బతుకులు బాగుపడ్డాయ్‌

28 Jun, 2020 05:22 IST|Sakshi

మద్యం నియంత్రణ చర్యలతో నిరుపేదల జీవితాల్లో వెలుగులు

విశాఖ జిల్లాలో 4 వేలకు పైగా బెల్ట్‌ షాపుల నిర్మూలన

రెండు దశల్లో 129 మద్యం దుకాణాల తొలగింపు

విశాఖ సిటీ: విశాఖపట్నం జిల్లాలో ఊరూరా ఏరులై పారిన మద్యం ఇప్పుడు సామాన్యులకు క్రమంగా దూరమవుతోంది. సామాన్య కుటుంబాలు బాగుపడాలన్న తలంపుతో ప్రభుత్వం మద్యం ధరలను అమాంతం పెంచడంతో తాజాగా వేలాది మంది దానికి దూరమయ్యారు. పేద, మధ్య తరగతి కుటుంబాలన్నీ ఇప్పుడు సంతోషంగా జీవిస్తున్నాయి. జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో దాదాపు 5 వేల బెల్ట్‌ షాపులు నడిచేవి. వాటిని పూర్తిగా నిర్మూలించారు. అప్పట్లో అధికారికంగా 401 మద్యం దుకాణాలు ఉండేవి. కొత్త ప్రభుత్వం వచ్చాక వాటిని 320కి తగ్గించింది. లాక్‌డౌన్‌ సడలింపుల తరువాత మరో 48 దుకాణాలను తొలగించింది. దీంతో ప్రస్తుతం 272 షాపులు మాత్రమే నడుస్తున్నాయి. షాపులను జనావాసాలకు దూరంగా ఏర్పాటు చేయడం.. ధరలు పెంచడంతో మద్యం కొనుగోలు భారంగా మారింది. ఇన్ని ఇబ్బందులు పడేకంటే మద్యం మానుకోవడమే ఉత్తమం అన్న ఆలోచనతో అనేకమంది తాగే అలవాటుకు స్వస్తి పలికి ఇంటిపట్టునే ఉంటున్నారు. పరిస్థితిలో ఎంతో మార్పు రావడంతో జిల్లాలోని మహిళా లోకం ఆనందం వ్యక్తం చేస్తోంది. 

దుకాణం వైపు చూస్తే దడ పుడుతోంది 
తోపుడుబండిపై ఉడకబెట్టిన మొక్కజొన్న, వేరుశనగలు అమ్ముతా. ప్రతిరోజూ మద్యం కోసం రూ.300 నుంచి రూ.500 ఖర్చయ్యేవి. స్నేహితులతో వెళ్లినప్పుడు ఖర్చు ఇంకా పెరిగేది. దీంతో మర్నాడు వ్యాపారానికి పెట్టుబడి ఉండేది కాదు. దానివల్ల అప్పులు ఎక్కువ చేసేవాడిని. ఇటీవల మద్యం ధరలు పెంచడంతో స్నేహితులతో వెళ్లే అలవాటు తప్పిపోయింది. ధరలు పెరగటంతో మందు కొనటం పూర్తిగా మానేశాను. ఇప్పుడు మద్యం తాగకపోతేనే ప్రశాంతంగా ఉంది. మద్యం దుకాణం వైపు చూస్తేనే దడ పుడుతోంది.  
– నందిక సన్యాసిరెడ్డి, తగరపువలస,భీమునిపట్నం

ఇంటి నిర్మాణం మొదలెట్టాం 
నేను ఇంటర్మీడియెట్‌ వరకు చదు వుకున్నా. బతుకుదెరువు కోసం అనకాపల్లి బెల్లం మార్కెట్‌లో కళాసీగా పని చేస్తున్నా. చిన్న వయసులోనే మద్యం అలవాటైంది. వచ్చే ఆదాయమంతా మందు కే ఖర్చవటంతో మా ఇంటి నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. కొత్త ప్రభుత్వం వచ్చాక ఎక్కడపడితే అక్కడ మందు దొరకట్లేదు. ధర కూడా భారీగా పెరిగిపోయింది. దీంతో విరక్తి కలిగి మందు పూర్తిగా మానేశా. ఇప్పుడు ఇంటి నిర్మాణం మొదలెట్టాం.      
– సిమ్మ అశోక్,రేబాక, అనకాపల్లి మండలం 

మా ఆయన ఆరోగ్యం కుదుటపడింది 
కుమారుడు శివాజీతో కలిసి ఫొటోలో కనిపిస్తున్న ఈమె పేరు జెట్టి లక్ష్మి. భర్త అప్పలస్వామినాయుడు. వీరికి ఇద్దరు కుమారులు. భర్త అప్పలస్వామి కూలి పనులకు వెళ్తుంటాడు. మద్యం తాగే అలవాటు ఉండటంతో వచ్చిన కూలి డబ్బులన్నీ తాగటానికే ఖర్చయిపోయేవి. తాగుడు ఎక్కువ కావడంతో అప్పలస్వామి ఆరోగ్యం పాడవుతూ వచ్చింది. దశలవారీ మద్యం నియంత్రణ అమల్లోకి రావడంతో ఇప్పుడా కుటుంబం ఆనందంగా జీవిస్తోంది. లక్ష్మిని పలకరించగా.. ‘వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక మా గ్రామంలో బెల్ట్‌ షాపులన్నీ మూతపడ్డాయి. ఎక్కడా మందు దొరకట్లేదు. షాపుకెళ్లి కొందామంటే రేట్లు పెరిగిపోయాయి. దీనివల్ల మా ఆయన పూర్తిగా మద్యం మానేశారు. ఇప్పుడు ఆయన ఆరోగ్యం కుదుటపడింది. ఆదాయం కూడా మెరుగుపడింది. మా బతుకులు బాగుపడ్డాయ్‌’ అని సంతోషంగా చెప్పింది. ఇది ఒక్క లక్ష్మి కుటుంబంలో వచ్చిన మార్పు మాత్రమే కాదు. మద్య నియంత్రణ వల్ల విశాఖ జిల్లాలోని వేలాది కుటుంబాలు ఇదే చెబుతున్నాయి. 

మరిన్ని వార్తలు