పరాకాష్టకు స్మగ్లర్ల వివాదాలు

30 May, 2016 12:23 IST|Sakshi
పరాకాష్టకు స్మగ్లర్ల వివాదాలు

పరస్పరం ఫిర్యాదులు
కొందరికి అధికార పార్టీ  నేతల అండ
వారిని పట్టించుకోని అధికారులు

 
బీవీపాళెం(తడ) : చెన్నై కేంద్రంగా కొందరు ట్రాన్స్‌పోర్టర్లు సరుకుల ఎగుమతులు, దిగుమతులు చేస్తుంటారు. వారంతా సరుకు పరిస్థితిని బట్టి రవాణా చార్జీలు వసూలు చేస్తారు. ఈ క్రమంలో కొన్ని సరుకులను బిల్లులు లేకుండా రవాణా చేస్తుంటారు. చెన్నైలో కొనుగోలు చేసిన సరుకును ఎలాంటి పన్నులు చెల్లించకుండానే మన రాష్ట్రానికి చేరుస్తున్నారు. ఇదే క్రమంలో ఆంధ్రా వైపు నుంచి కూడా కొన్ని వస్తువులను సరిహద్దులను దాటిస్తున్నారు. ఇందుకు గానూ వ్యాపారుల నుంచి భారీగా వసూలు చేస్తారు. మధ్యలో వాహనాలను అధికారులు పట్టుకోకుండా ఎప్పటికప్పుడు ముడుపులు అందజేస్తుంటారనే ఆరోపణలు ఉన్నాయి.

తాజాగా ట్రాన్స్‌పోర్టర్ల ముసుగులో కొందరు స్మగ్లర్లు రంగ ప్రవేశం చేశారు. వీరి ద్వారా సరుకుల రవాణా చేస్తే పెట్టుబడి తక్కువగా ఉంటుందని ఎక్కువమంది వ్యాపారులు వారి వైపే మొగ్గుచూపుతున్నారు. ఎక్కువగా నిత్యావసర సరుకులు, సుగంధ ద్రవ్యాలతో పాటు వివిధ రకాల ఎలక్ట్రానిక్ వస్తువులు, నిషేదిత గుట్కాలు, పాన్‌మసాలాలను ట్రాన్స్‌పోర్టర్ల ముసుగులోని స్మగ్లర్లు యథేచ్ఛగా సరిహద్దులు దాటించేస్తున్నారు.


వివాదాలతో   రచ్చకెక్కిన వ్యవహారం
గతంలో కొద్దిమంది మాత్రమే ఇలా వ్యాపారం సాగించేవారు. ప్రస్తుతం ఇలాంటి వ్యాపారాలు సాగించే వారు బాగా పెరిగిపోయారు. దీంతో పోటీ పెరిగి వ్యాపారులను తమ ట్రాన్స్‌పోర్ట్ వైపు ఆకర్షించేందుకు స్మగ్లర్లు ఎత్తుగడలు మొదలుపెట్టారు. సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి, నెల్లూరు ప్రాంతాలు చెన్నైకి దగ్గరలో ఉండటంతో ఆయా ప్రాంతాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేసుకుని ఒకరిపై ఒకరు అధికారులకు ఫిర్యాదులు చేస్తూ అవతలి వారి వాహనాలను పట్టించే పనులను మొదలుపెట్టారు. ఇందులోనూ అధికారులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీకి అనుకూలంగా ఉండే రవాణాదారులకు వత్తాసు పలుకుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అధికార పార్టీ నాయకుల అండతో జీరో దందా వ్యాపారం సాగిస్తున్న రవాణాదారులను ఏ అధికారీ ఎదుర్కొనే పరిస్థితి లేదు.
 
 
గుట్టుగా సాగిపోతున్న జీరోదందా స్మగ్లర్ల మధ్య వివాదాల నేపథ్యంలో మరోమారు రచ్చకెక్కింది. ఇటీవల ఓ వర్గానికి చెందిన పార్శిల్ లారీని అధికారులు పట్టుకోవడంతో, సంబంధిత వ్యక్తులు చెక్‌పోస్ట్‌కు వచ్చి చేసిన హడావుడి చర్చనీయాంశంగా మారింది. మరోవైపు అధికారులు కూడా స్మగ్లర్లలో ఓ వర్గానికి కొమ్ముకాస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

మరిన్ని వార్తలు