భక్తుల ముసుగులో పాగా

8 Apr, 2015 03:18 IST|Sakshi
భక్తుల ముసుగులో పాగా

శేషాచలంలో భారీగా పెరిగిన చొరబాట్లు.. రెండువేల మంది తిష్ట
ఉచిత భోజనం తింటూ.. సముదాయాల్లో బసచేస్తూ..అదనుచూసి అడవిలోకి

 
సాక్షి, తిరుమల : శేషాచలంలో లభించే ఎర్రచందనం అక్రమ రవాణా చేసేందుకు స్మగ్లర్లు, కూలీలు శ్రీవారి భక్తుల అవతారం ఎత్తుతున్నారు. తిరుమలలో ఉచిత భోజనం చేస్తూ, వసతి సముదాయాల్లో బసచేస్తూ, అదను చూసి అడవిలో చొరబడి విలువైన సంపదను కొల్లకొడుతున్నారు. అడ్డువచ్చిన అటవీ శాఖాధికారులను హతమార్చుతున్నారు.

భక్తుల ముసుగులో స్మగ్లర్లు, కూలీలు వలస

చిత్తూరు, వైఎస్‌ఆర్ కడప జిల్లాలోని శేషాచల అడవులను ఆనుకుని ఉన్న గ్రామాల నుంచి వెళ్లే మార్గాలపై అటవీ శాఖ అధికారులతో పాటు టాస్క్‌ఫోర్సు సిబ్బంది ఎక్కువ నిఘా పెట్టారు. ఆ ప్రాంతాల్లో వెళ్లేవారిని కట్టడి చేయటంతో స్మగ్లరు, కూలీలు తిరుమలను కేంద్రంగా ఎంచుకున్నారు. ప్రధానంగా తమిళనాడులోని తిరువన్నామలై, సేలం, కృష్ణగిరి, ధర్మపురి, వేలూరు, కర్ణాటకలోని సరిహద్దు గ్రామాల నుంచి కూలీలు భక్తుల రూపంలో తిరుమల చేరుకుంటున్నారు.

పెరిగిన జుత్తు, మాసిన గడ్డం, చేతి లో లగేజీలతో  తిరుమలకు వస్తున్నారు. ఇక్కడి ఉచి తవసతి సముదాయాల్లో తలదాచుకుంటున్నారు. ఉచిత నిత్యాన్న భోజన సముదాయంలో ఆకలి తీర్చుకుంటారు. ఎవరికీ అనుమానం రాకుండా రోజుల తరబడి తిష్టవేస్తారు. వాతావరణం అనుకూలించాక అడవుల్లోకి చొరబడుతున్నారు.

శేషాచలంలో రెండువేల మంది స్మగ్లర్లు, కూలీల తిష్ట

చిత్తూరు, వైఎస్‌ఆర్ జిల్లాల పరిధిలో సుమారు 5.5 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో శ్రీవేంకటేశ్వర అభయారణ్యం (తిరుమల శేషాచల అటవీ ప్రాంతం) ఉంది. ఇక్కడ అరుదైన జంతు, జీవజాలంతో పాటు విలువైన ఎర్రచందనం, శ్రీగంధం ఎక్కువగా ఉన్నాయి. వీటికి అంతర్జాతీయ స్థాయిలో గిరాకీ ఉంది. విలువైన అటవీ సంపదను కొల్లగొట్టేందుకు దుండగులు బృందాలుగా ఏర్పడి అక్రమ రవాణా చేస్తున్నారు. భక్తుల రూపంలో తిరుమలకు చేరుకుని తిరుమల శ్రీవారి ఆలయానికి ఉత్తర దిశలోని గోగర్భం డ్యాము మీదుగా కాకులకొండ, పారువేట మండపం, పాపవినాశనం మార్గాల నుంచి మామండూరు వరకు ప్రయాణం సాగిస్తారు.

మరికొందరు శిలాతోరణం, ధర్మగిరి వేద పాఠశాల, శ్రీవారి పాదాల మీదుగా రంగంపేట, భాకరాపేట, ఎర్రవారిపాళెం, తలకోన వరకు అడవి సందపను తలించేందుకు వెళతారు. మరికొందరు అలిపిరి మార్గం నుంచి గాలిగోపురం మీదుగా నడచివస్తూ మార్గమధ్యంలో అవ్వాచ్చారి కోన లోయ నుంచి శేషతీర్థం, సీతమ్మతీర్థం మార్గాల్లోని ఎర్రచందనం కలపను సేకరిస్తారు. అక్కడి నుంచి మామండూరు, బాలపల్లి నుంచి ఎర్రచందనాన్ని తరలిస్తారు.

మహిళా కూలీలు కూడా..
ఎర్రచందనం అక్రమ రవాణాలోకి మహిళా కూలీలు కూడా ప్రవేశించడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల తిరుమలలో ఎనిమిది మంది కూలీలు పట్టుబడ్డారు. ఇందులో ఏకంగా నలుగురు మహిళా కూలీలు ఉండటం గమనార్హం.

మరిన్ని వార్తలు