పోర్టులో అక్రమార్కుల లంగరు

11 Feb, 2015 04:47 IST|Sakshi

- పెరుగుతున్న చోరీలు
- గ్యాంగ్ ఫైల్స్ తెరచినా ఫలితం శూన్యం

కాకినాడ క్రైం : తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పోర్టులో అక్రమార్కులు లంగరు వేశారు. ప్రతి నిత్యం రూ. కోట్ల విలువైన బియ్యం, మొక్కజొన్న, బొగ్గు, గ్రానైట్, వంట నూనె తదితరాలు కాకినాడలోకి యాంకరేజ్, డీప్‌వాటర్ పోర్టుల ద్వారా విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. విలువైన రసాయనాలను దిగుమతి చేస్తున్నారు. యాంకరేజ్ పోర్టు నుంచి బియ్యం ఎగుమతికి అనుమతి లభించడంతో బార్జిల ద్వారా బియ్యాన్ని ఓడల్లోకి ఎక్కిస్తున్నారు. ఈ ఎగుమతి దిగుమతుల నేపథ్యంలో కొందరు ముఠాలుగా ఏర్పడి భారీ ఎత్తున చోరీలకు పాల్పడుతున్నారు. సుమారు నెలా పదిరోజుల క్రితం ఏటిమొగకు చెందిన కొందరు బార్జి సిబ్బందిని భయపెట్టి వారి నుంచి బియ్యం బస్తాల చోరీకి పాల్పడగా పోర్టు పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సుమారు పదిరోజుల కిందట తిమ్మాపురంలో పోలీసులు ఒక ఇంట్లో తనిఖీలు నిర్వహించగా పోర్టు నుంచి చోరీ చేసిన 20 క్వింటాళ్ల బియ్యం దొరికాయి. ఇలా ప్రతి నెలా పోర్టు, తిమ్మాపురం, సర్పవరం పోలీస్ స్టేషన్ల పరిధిలో పోర్టుకి సంబంధించిన సుమారు 10 చోరీ కేసులు నమోదవుతున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో వేరే చెప్పనక్కర్లేదు. యూరియా, వంటనూనె, ఇతర రసాయనాలను ఏకంగా లారీలతో సహా అపహరిస్తున్నా నిరోధించే నాథులు కరువయ్యారు.
 
కంపెనీల ప్రతినిధుల ప్రమేయంతోనే..

పోర్టులో సుమారు 20 కంపెనీలు తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఓడల్లో రవాణాకు గాను సరుకును ఏకమొత్తంలో ఇక్కడికి తీసుకువస్తుంటారు. ఇదే అదనుగా కొందరు చోరీలకు పాల్పడతున్నారు. ఈ చోరీలకు కొన్ని సందర్భాల్లో ఆయా కంపెనీల ప్రతినిధుల సహకారం కూడా లభిస్తుండడంతో అక్రమార్కుల పని సులువవుతోంది. గత ఏడాది జీఎస్పీసీలో రూ. 5 కోట్ల విలువైన యంత్ర సామగ్రిని ఎత్తుకుపోయారు. గొడౌన్‌లో ఉన్న సామగ్రిని దొంగిలించడంలో వారికి సెక్యూరిటీ సిబ్బంది సహకరించారని పోలీసు దర్యాప్తులో వెల్లడైంది.
 
కాకినాడ పోర్టులో ఇటువంటి చోరీలకు పాల్పడే ముఠాలు ఎనిమిది ఉన్నాయని భావిస్తున్నారు. కొన్ని ముఠాల సభ్యులు ఇతర జిల్లాల్లో కూడా చోరీలకు పాల్పడుతున్నారని అనుమానిస్తున్నారు. వారిపై ఇప్పటికే గ్యాంగ్ ఫైల్స్ ఓపెన్ చేసినట్టు పోలీసు అధికారులు వెల్లడించారు. అయినప్పటికీ పరిస్థితుల్లో మార్పు కనిపిం చడం లేదు. పోర్టులో చోరీల అదుపునకు గతంలో ఏర్పా టైన చెక్‌పోస్టులు ఇప్పుడు సరిగా పనిచేయకపోవడంతో మళ్లీ చోరీలు ఊపందుకున్నాయి. పోర్టు కేంద్రంగా అక్రమార్కులు రూ. కోట్ల విలువైన సరుకు దోచుకుని పెద్ద ఎత్తున వ్యాపారం కొనసాగిస్తున్నారు.

మరిన్ని వార్తలు