కాటేస్తున్నాయ్‌..

7 Sep, 2019 07:54 IST|Sakshi

వర్షాకాలంలో సంచరిస్తున్న సర్పాలు

కాటుతో మృత్యువాత పడుతున్న ప్రజలు

తాజాగా ఇద్దరు చిన్నారుల మృతి

‘యాంటీ వీనమ్‌’ ఉన్నా....ఉపయోగం తక్కువే

జనవరి వరకు అప్రమత్తంగా ఉండాల్సిందే

పాములు కనిపించగానే ఒళ్లు జలదరిస్తుంది.. మీదకు వస్తే.. ఊహించుకుంటేనే భయమేస్తుంది. నిత్యం జిల్లాలో పాముకాటు సంఘటనలతో జనం బెంబేలెత్తుతున్నారు. కొంతమేర జాగ్రత్తలు తీసుకోకపోవడం... విష సర్పాలు కాటు నేపథ్యంలో పలువురు ప్రాణాలు విడుస్తున్నారు. చాలామందిని పాములు కరుస్తున్నా... భయంతోనూ... అలజడితోనూ...ఆందోళనతో పలువురు మృత్యువాత పడుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పామకాటుకు విరుగుడు మందు యాంటీ వీనమ్‌ ఉన్నా ఇతర ఆరోగ్య సమస్య వల్ల.. స్పెషలిస్టులు లేక వేయడానికి ఇబ్బంది పడుతున్నారు. పాముల సంచారంతోపాటు పాముకాటు నేపథ్యంలో ప్రజల్లో చైతన్యం తీసుకు వచ్చేందుకు వైద్య ఆరోగ్యశాఖ నడుం బిగించాలి. 

సాక్షి, కడప : విషసర్పాలకు సమయం వచ్చింది. ఎక్కడికక్కడ ఉన్నా సీజన్లలో మాత్రం అధికంగా కనిపిస్తుంటాయి.. ఏమారితే   కాటేయడంలో కాస్త కూడా ఆలస్యం జరగదు. గడ్డిపొదల చాటున.. దంతెల మాటునో...పాత గోడల సందుల్లోనూ... కుళ్లిన వ్యర్థ పదార్థాల మధ్యన..కంపచెట్ల మధ్య ఎక్కువగా సంచరిస్తుంటాయి. వర్షం పడిన సందర్భంలో ఉక్కపోతకు లోపల ఉండలేక రోడ్లపైకి  వస్తుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో అప్రమత్తత లేకపోతే ప్రాణాలకు ముప్పే. చాలా పాముల్లో విషం ఉండదని పరిశోధకులు చెబుతున్నా కాటుతో పలువురు మృత్యువాత పడుతూనే ఉన్నారు.

కేవలం రెండు, మూడు రోజుల వ్యవధిలో మైదుకూరు, అంబకపల్లెకు చెందిన ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడటం ఆందోళన కలిగిస్తోంది. ఈ రెండు సంఘటనలే కాదు....పాముకాటుతో పలువురు మృతి చెందుతున్నా బయటిరాని వ్యవహారాలు కూడా ఉంటున్నాయి.  సర్పం కాటు వేసినా ధైర్యంగా నిలబడగలగడం....వెంటనే ఆస్పత్రికి వెళ్లడం ద్వారా విషానికి విరుగుడుతో కొంతైనా మేలు జరిగే అవకాశం ఉంది.

సీజన్‌లో పాములతో ప్రమాదం
జూన్‌ నుంచి డిసెంబరు వరకు విష సర్పాలు ఎక్కువగా సంచరిస్తుంటాయి. వర్షాకాలంతోపాటు చలికాలంలో గడ్డి బాగా పెరగడం, ముళ్ల పొదలు, పంట పొలాలు కూడా పచ్చగా ఉండడంతో వాటి మధ్య ఉండటానికి అవకాశం ఉంటుంది. రాత్రి పూట కూడా పొలాల్లో...గట్లమీద, కాలువల్లో పాముల సంచారం ఎక్కువగా ఉంటుంది.  జూన్‌ నుంచి డిసెంబరు వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వర్షాలు కురిసిన సమయంలో ఆచి చూసి అడుగులు వేస్తేనే ప్రమాదాన్ని పసిగట్టగలం. కట్లపాము, నాగుపాము, రక్తపింజిరి, జర్రిపోతు,  పసిరిక పాము,  తదితర జాతికిచెందిన పాములే ఎక్కువగా కనిపిస్తుంటాయి. అటవీ ప్రాంతంలో కొండచిలువ లాంటి పాములు అరుదుగా కనిపిస్తున్నా జనవాసాల్లోకి రావడం తక్కువే. ఎక్కడ చూసినా కనిపించేవి పై రకం పాములే. అందులోనూ కొన్ని పాముల్లో విషం ఉంటే, మరికొన్నింటిలో ఉండదని పరిశోధకులు వివరిస్తున్నారు. పాము చిన్నదైనా....పెద్దదైనా రాత్రి, పగలు సమయాల్లో కూడా తిరుగుతుంటాయి. రాత్రి సమయంలో చిన్నపాటి వర్షం కురిసినా బయటికి వస్తున్న నేపథ్యంలో అప్రమత్తత చాలా అవసరం. రోడ్లపైన వెళ్లే ద్విచక్ర వాహనదారులు కూడా జాగ్రత్తగా వ్యవహారించకపోతే ప్రమాదం పాము రూపంలో దెబ్బతీసే అవకాశం లేకపోలేదు.

పాముకాటేస్తే పరేషాన్‌
జిల్లాలో పాము కాటేస్తే పరేషాన్‌ పరిస్థితి తలెత్తుతోంది. కొన్ని పీహెచ్‌సీల్లో పాముకాటుకు వేసే యాంటీ వీనమ్‌ మందులను సంబంధిత ఆస్పత్రి అభివృద్ది కమిటీ కొనుగోలు చేసి అందిస్తున్నారు. అన్నిచోట్ల ప్రజలను అప్రమత్తం చేయాలి.  చైతన్యం తీసుకు రావడం ద్వారా సర్పాల విషయంలో ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకుంటారు. ముళ్ల పొదల నుంచి రావడం ఒక ఎత్తయితే...ఇంటిలో కిందపడుకున్నప్పుడు.....గడ్డి కింద ఉండడం...పుట్టల వద్ద తిరుగుతున్న సమయంలో కాటేస్తున్నాయి. ఇలాంటి సందర్బాలను కూడా ఉదహరిస్తూ వైద్య ఆరోగ్యశాఖ గ్రామీణ ప్రాంతాల్లో పూర్తి మార్పు తీసుకు రావాలి.  మారుమూల పల్లెల్లో పాముకాటుకు గురైన వారు నేరుగా పీహెచ్‌సీకి వస్తారు. తర్వాతే ఎక్కడైనా పట్టణాలకు వెళ్లే పరిస్థితి ఉంటుంది. రాత్రి పూట చీకట్లలో తిరుగుతూ పాములు కుట్టిన వారు...రాత్రిళ్లు పొలంలో నీరు కడుతూ పురుగు కుట్టిన వారు....గడ్డి లేదా బోద కోస్తూ పాముకాటుకు గురైన వారు చాలా మంది గతంలో ప్రాణాలు కోల్పొయిన సంఘటనలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అత్యవసర నిమిత్తమై ఆస్పత్రులకు వచ్చిన బాధితులకు సకాలంలో విషానికి విరుగుడు మందు అందేలా చర్యలు చేపట్టాల్సిన బాధ్యత వైద్య ఆరోగ్యశాఖపై ఉంది.

కాటుతో ప్రమాదమే
జిల్లాలో జనవరి నుంచి ఇప్పటివరకు 237 మందిని పాములు కరిచాయి.  ఒకరు మాత్రమే చనిపోయినట్లు వైద్య ఆరోగ్యశాఖ రికార్డులు వెల్లడిస్తున్నాయి.  తొలుత ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చినా తర్వాత ప్రైవేటు ఆస్పత్రులకు వెళుతున్నారు. ఆరోగ్యం బాగుపడితే చాలు..కానీ పాము కుట్టినా గంటల వ్యవధిలోనే విషం మనిషి ప్రాణాన్ని హరిస్తోంది. ఒక్కోసారి వరుసగా ఎక్కడ చూసినా పాముకాటుతో వరుస మరణాలు బెంబేలెత్తిస్తాయి. గత ఏడాది వరుసగా జూన్, జులై నెలల్లో గాలివీడు మండలంలోని ఇద్దరు మహిళలను పాముకాటు బలిగొంది. ఒక్క మండలంలోనే ఇరువురు పాముకాటుకు మృతి చెందారు. తాజాగా మూడు రోజుల వ్యవధిలో మైదుకూరు, లింగాలకు చెందిన ఇరువురు చిన్నారులు పాముకాటుతో చనిపోయారు. ఇది చదవండి : న్యూజెర్సీ అడవుల్లో రెండు తలల రాటిల్‌ స్నేక్‌

మరిన్ని వార్తలు