సర్పగండం

6 Jul, 2019 08:46 IST|Sakshi

వర్షాకాలంలో పెరిగిన సంచారం

రైతులకు పొంచి ఉన్న ముప్పు

6 నెలల్లో 414 మంది బాధితులు

అప్రమత్తంగా ఉండాలంటున్న నిపుణులు

సాక్షి, విజయనగరం : వర్షాకాలం మొదలవడంతోనే పాముల సంచారం పెరిగింది. ఇప్పటికే జిల్లాలో అనేక మంది పాముకాటుకు గురయ్యారు. వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులు రాత్రి వేళల్లో పంటలకు నీరు పెట్టేందుకు వెళ్లి విష సర్పాల కాటుకు గురివుతుంటారు.

పంట పొలాల్లోనే ఎక్కువ
సాధారణంగా నిర్జన ప్రదేశాలను ఎక్కువగా ఇష్టపడే పాములు ఆహారం కోసం జనారణ్యంలోకి చొచ్చుకొస్తున్నాయి. చెత్తా చెదారం ఎక్కువగా ఉన్న ప్రాంతాలు, పాడు బడిన భవన శిధిలాలు, పూరి గుడిసెలు, గుబురుగా ఉండే పంటచేలల్లో ఎక్కువగా నివసిస్తున్నాయి. ఎలుకలు, కప్పలను ఎక్కువగా ఇష్టపడే పాములు పొలాల్లో రాత్రి పూట సంచరిస్తూ రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

రక్త పింజర
ఇది అటవీ ప్రాంతంలో ఎక్కువుగా సంచరిస్తూ ఉంటుంది. ఇది కాటేసిన రెండు గంటల తర్వాత విషం శరీరంలోకి ఎక్కుతుంది. ఈ పాము కాటేసిన వెంటనే విషాన్ని తొలగించేందుకు వెంటనే ప్రాథమిక చికిత్స చేయాలి.

కట్ల పాము
ఈ పాము కరిచిన వెంటనే విషం రక్తంలో కలుస్తుంది. ప్రాణాపాయం ఎక్కువ. విషం రక్తంలోకి చేరకముందే చికిత్స అందిస్తే ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశం ఉంది.

రాత్రి వేళ జాగ్రత్త
జిల్లాలో వరి, మొక్కజొన్న, చెరుకు, అరటి, చోడి, కూరగాయలు, మిరప తదితర పంటలను రైతులు సాగు చేశారు. రైతులు రాత్రి పూట పొలాల్లో నీరు పెట్టడానికి వెళ్లి పాముకాటుకు గురివుతున్నారు. జనవరి నెల నుంచి జూన్‌ నెల వరకు 414 పాముకాటుకు గురయ్యారు.

అవగాహనతోనే ప్రాణ రక్షణ
గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రైతులకు పాములపై కనీస అవగాహన అవసరమని వైద్యులు అంటున్నారు. కనిపించే పాములన్నీ విషపూరితం కాదు. కట్ల పాము, తాచు పాము, రక్తపింజర, నాగుపాము వంటి 15 శాతం పాములతోనే ముప్పు ఉంది. సరైన సమయంలో చికిత్స పొందితే విషసర్పం కరిచినా ప్రాణాపాయం ఉండదు.

జాగ్రత్తలు తప్పనిసరి
రాత్రి వేళ పొలాలకు వెళ్లేటప్పుడు చెప్పులు, టార్చిలైట్లతో పాటు శబ్ధం చేసే పరికరాలను వెంట తీసుకుని వెళ్లడం మంచిది. పాముకాటుకు గురైన వారు ఎలాంటి ఆందోళనకు గురికావలసిన అవసరం లేదు. తీవ్ర ఒత్తిడికి గురైతే రక్తపోటు పెరగడంతో పాటు గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. పసర వైద్యం, మంత్రాలు అంటూ అలసత్వం వహిస్తే ప్రాణాలకే ప్రమాదం. పాముకాటు వేయగానే పైభాగం గుడ్డతో కట్టాలి. కాటు వేసిన భాగాన్ని కొత్త బ్లేడుతో గాటు వేసి రక్తాన్ని నోటితో లాగేయాలి. నోటి గాయాలున్న వారు ఇలా చేయకూడదు. ప్రాథమిక వైద్యం అందించిన వెంటనే ఆస్పత్రికి తీసుకుని వెళ్లాలి. కరిచిన పాము ఏదో తెలుసుకుంటే చికిత్స అందించడం సులభం అవుతుంది.

ఆందోళన వద్దు
పాముకాటు వేస్తే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అప్రమత్తంగా ఉంటే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు. అన్ని పీహెచ్‌సీల్లో యాంటీ వీనమ్‌ మందు అందుబాటులో ఉంది. రైతులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. పాముకాటు వేసిన వెంటనే వీలైనంత తొందరగా ఆస్పత్రికి తీసుకుని రావాలి.
– బోళం పద్మావతి, జనరల్‌ ఫిజిషియన్, కేంద్రాస్పత్రి

మరిన్ని వార్తలు