పాముకాటుకు గురైన స్టాఫ్‌ నర్స్‌

10 Jun, 2018 09:46 IST|Sakshi

బాలేరు పీహెచ్‌సీలో ఘటన

శ్రీకాకుళం, భామిని: పరిసరాలు అపరిశుభ్రంగా, కనీస మరుగు సౌకర్యాలు లేని ప్రభుత్వాస్పత్రుల్లో రోగులతో పాటు వైద్యసిబ్బందికి ప్రాణాపాయం నెలకొంది. ఆస్పత్రి పరిసరాల్లోకి మూత్ర విసర్జనకు వెళ్లిన స్టాఫ్‌నర్స్‌ పాము కాటుకు గురికావడం ప్రభుత్వ ఆస్పత్రుల అధ్వాన స్థితికి అద్దం పట్టింది. భామిని మండలంలో బాలేరు పీహెచ్‌సీలో స్టాఫ్‌నర్స్‌గా పనిచేస్తున్న బి.పావని శనివారం పాముకాటుకు గురైంది. మూత్ర విసర్జనకు ఆస్పత్రి పరిసరాల్లోకి వెళ్లిన ఈమెకి పాము కాటువేసింది. సకాలంలో సరైన వైద్యం అందడంతో ప్రాణాపాయ పరిస్థితి నుంచి బయటపడింది. పీహెచ్‌సీలో ప్రాథమిక వైద్యం తర్వాత కొత్తూరు సీహెచ్‌ఎన్‌సీకి తరలించి వైద్యసేవలు అందించారు. ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడినను మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు రిఫర్‌ చేసి వైద్యసేవలు అందిస్తున్నారు.

అధ్వానంగా ఆస్పత్రులు
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో కనీస సౌకర్యాలు కొరవడుతున్నాయి. ఆస్పత్రుల పరిసరాల్లో చెత్తాచెదారాలు పేరుకుపోయాయి. పలుమార్లు ఉపాధి హామీ నిధులతో పనులకు ప్రతిపాదించినా జరగలేదని వైద్య సిబ్బంది వాపోతున్నారు. పీహెచ్‌సీల్లో సరైన మరుగు సదుపాయాలు లేకపోవడం దారుణమని అంటున్నారు. వైద్య సిబ్బందికే కనీస సౌకర్యాలు కరువైతే, ఆస్పత్రికి వచ్చిన రోగుల సంగతి చెప్పనవసరం లేదు. ఇదిలావుండగా భామిని, బాలేరు పీహెచ్‌సీలను సందర్శంచిన ఐటీడీఏ పీవో లోతేటి శివశంకర్‌ ఇక్కడ కనీస వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. ఐటీడీఏ నిధులతో ఇక్కడ వసతులు కల్పించేందుకు చర్యలు చేపడతామని ప్రకటించారు. ఇది జరిగి కొద్ది రోజులు గడచినా కార్యరూపం దాల్చలేదు. 

మరిన్ని వార్తలు