-

ఆ లేఖపై సందేహాలెన్నో! 

26 Oct, 2018 05:17 IST|Sakshi

సీఐఎస్‌ఎఫ్‌ అదుపులో ఉండగానే వైఎస్సార్‌సీపీకి వీరాభిమాని అంటూడీజీపీ ఠాకూర్‌ స్టేట్‌మెంట్‌ 

పైగా జేబులో లేఖ ఉందంటూ ప్రకటన 

సాయంత్రానికి హడావుడిగా 11 పేజీల లేఖ విడుదల

పదో తరగతి చదివిన వ్యక్తి అంత స్పష్టంగా ఎలా రాయగలడు? 

ఆ లేఖతో నిందితుడు వైఎస్సార్‌సీపీ వీరాభిమానిగా భ్రమింపజేసే యత్నం 

సాక్షి, విశాఖపట్నం: ఎవరైనా ఆత్మహత్యకు పాల్పడే వారు తమ చావుకు కారణాలను వివరిస్తూ లేఖ రాసి పెట్టుకుంటారు. ఆ లేఖ ఆధారంగానే అతను ఎందుకు ఆత్మహత్యకు పాల్పడాల్సి వచ్చిందో నిర్ధారణకు వస్తారు.  కానీ ఏపీ ప్రతిపక్ష నేత,  వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడిన దుండగుడు జనుపల్లి శ్రీనివాసరావును వైఎస్సార్‌సీపీకి వీరాభిమానిగా చిత్రీకరించేందుకు పోలీసులు ఆడిన ‘లేఖ’ నాటకం విస్మయానికి గురిచేస్తోంది. 

చేయి తిరిగిన రాతగాడిలా..: లేఖలో మొదటి పేజీ మొదలుకుని చివరి పేజీ వరకు ఒకే దస్తూరి క్రమపద్ధతిలో ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఎంత చేయి తిరిగిన రాతగాడైనా చివరి పేజీలకొచ్చేసరికి రాత శైలి మారుతుంది. కానీ ఇక్కడ శ్రీనివాసరావు రాసినట్టు పోలీసులు చెబుతున్న లేఖను పరిశీలిస్తే ఎన్నో అనునానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక అతను చదువుకున్నదేమో పదో తరగతి. కానీ లేఖలోని  విషయాలు..భావుకత, సమాజం పట్ల నిర్ధిష్ట అవగాహన చూస్తుంటే నిజంగా అతను రాసిందేనా అనుమానం ఎవరికైనా కలుగుతుంది. కచ్చితంగా ఈ లేఖ పోలీసులు సృష్టించిందేనన్న అనుమానాలకు బలం చేకూరుతోంది. పైగా ఈ లేఖ చివరి పేజీలో సంబంధం లేకుండా ‘ఈ ఘటనలో నాకు ఏ ప్రాణహాని జరిగినా నా అవయవదానం చేయండి అమ్మా..నాన్నా’ అంటూ లేఖ ముగించడం చూస్తుంటే కావాలని పథకం ప్రకారమే ఈ లేఖ సృష్టించినట్టుగా స్పష్టమవుతోంది. 

లేఖ ఆద్యంతం చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు: ‘అన్నా ప్రజల హృదయంలో కొలువుండి ప్రజలు దైవంగా భావించిన వైఎస్‌ రాజశేఖరరెడ్డి అంటే నాకు చాలా అభిమానం’అంటూ ప్రారంభమైన ఆ లేఖలో చంద్రబాబు పాలనలో ప్రజలు ఎంతో కష్టాలు పడుతున్నారంటూ విమర్శలు సాగాయి.అధికారంలోకి వస్తే వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి చేపట్టబోయే సంక్షేమ పథకాలను వివరించారు. చివరి పేజిలో చంటి పేరిట సంతకం చేసి పక్కనే వేరే దస్తూరితో జనుపల్లె శ్రీనివాసరావు చిరునామా రాసి ఉంది. సీఐఎస్‌ ఎఫ్‌ అసిస్టెంట్‌ కమాండెంట్, చీఫ్‌ సెక్యురిటీ ఆఫీసర్‌ సంతకాలతో విడుదల చేసిన ఈ లేఖ సర్వత్రా సందేహాలకు తావిచ్చేలా ఉంది. ఇదిలా ఉండగా డీజీపీ ఠాకూర్‌ అమరావతిలో ఘటనపై మాట్లాడుతూ దుండగుడు వైఎస్‌ జగన్‌కు వీరాభిమాని అంటూ  ప్రకటించారు. అంతే కాదు.. వైఎస్సార్‌సీపీ అభిమాని అని తేల్చేందుకు అతని జేబులో ఓ లేఖను స్వాధీనం చేసుకున్నామంటూ చెప్పుకొచ్చిన అనంతరం పోలీసులు లేఖను విడుదల చేయడం చర్చనీయాంశమవుతోంది. 

పోలీసుల హైడ్రామా..: రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భద్రత విషయంలో దారుణంగా విఫలమైన పోలీసులు.. చివరికి ఆయనపై జరిగిన  హత్యాయత్నాన్ని ఓ సాధారణ యాధృచ్ఛిక ఘటనగా చిత్రీకరించేందుకు చేస్తున్న యత్నాలు విస్తుగొలుపుతున్నాయి. అత్యంత భద్రతా బలగాల పర్యవేక్షణలో ఉన్న విశాఖ విమానాశ్రయంలోని  వీఐపీ లాంజ్‌లో క్యాబినెట్‌ హోదా కలిగిన ప్రతిపక్ష నేతపై కత్తితో హత్యాయత్నం జరిగితే పోలీసులు స్పందించిన తీరు, నిర్లక్ష్య వైఖరి అత్యంత వివాదాస్పదమవుతోంది. 

హర్షను విచారించని పోలీసులు!
దుండగుడు పనిచేస్తున్న ఎయిర్‌పోర్టులోని ఫ్యూజన్‌ ఫుడ్స్‌ యజమాని, టీడీపీ నేత హర్షను పోలీసులు కనీసంగా ప్రశ్నించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఎయిర్‌పోర్ట్‌లో ఫ్యూజన్‌ ఫుడ్స్‌ బ్రాంచిని సొంతంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు మంత్రి నారా లోకేష్‌ హాజరయ్యారు.

మరిన్ని వార్తలు