చైర్మన్ కుర్చీపై ఆశలు

2 Aug, 2013 03:59 IST|Sakshi
సార్...! మన మున్సిపాలిటీ చైర్మన్ స్థానం ఏది రిజర్వ్ అవుతుంది.. ఏ లెక్కన చూసినా మహిళకు రిజర్వ్ అయినట్లు ఉందండీ... బీసీ మహిళ అవుతుందా...ఓసీ మహిళకు రిజర్వ్ అవుతుందా...?’ ఇవి నేడు బొబ్బిలిలో ప్రతి నోటా వినిపిస్తున్న మాటలు. చైర్మన్ ఎన్నిక పరోక్ష పద్ధతిలో జరుగుతుండడంతో ఆ దిశగా వార్డుల్లో పోటీకి దిగడానికి సిద్ధమవుతున్నారు. మున్సిపల్ చైర్మన్ స్థానం ఇప్పటివరకూ 57 ఏళ్ల కాలంలో ఒకే సారి బీసీకి రిజర్వ్ అయింది. ఓసీ జనరల్, ఓసీ మహిళకు ఇప్పటివరకూ అధిక పర్యాయాలు రిజర్వ్ అయింది. దాంతో ఇప్పుడు బీసీలతో పాటు మహిళల ఆశలన్నీ ఆ కుర్చీపైనే ఉన్నాయి. 1956 నుంచి మొన్నటి 2005 వరకూ ఈ మున్సిపాలిటీని ఆరుగురు చైర్మన్లు ఏలారు. వారిలో బీసీ వర్గానికి చెందిన వారు ఒకరు, మహిళ ఒకరు ఉన్నారు. దీంతో ఆ రెండు వర్గాలకు చెందిన వారు ఇప్పుడు చైర్మన్ స్థానంపై ఆశలు పెట్టుకున్నారు.
 
 పట్టణంలోని ప్రధాన రాజకీయపార్టీలకు చెందిన ఆశావహులంతా చైర్మన్ రిజర్వేషన్ ఖరారును బట్టి వార్డుల్లో పోటీకి దిగాలా, వద్దా అనే ఆలోచనలో ఉన్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి సారిగా ఈ ఎన్నికల్లో తలపడుతోంది. ఇప్పటివరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీలు బొబ్బిలి నియోజకవర్గంలో బలమైన పార్టీగా ఉన్న వైఎస్‌ఆర్‌సీపీని ఎలా ఎదుర్కోవాలోనని ఇప్పటి నుంచే సన్నద్ధమవుతున్నారు. గత ఎన్నికల్లో చైర్మన్ స్థానం జనరల్‌కు రిజర్వ్ కావడంతో బేబీనాయన 28వ వార్డునుంచి ఏకగ్రీవంగా ఎన్నికై చైర్మన్ అయ్యారు. అప్పుడు మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకోవడంతో మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని గునాన విజయలక్ష్మికి అప్పగించారు. 
 
 ఇప్పుడు పట్టణంలో త్రిముఖ పోటీ ఉండడంతో రాజకీయం ఆసక్తికరంగా మారింది. చైర్మన్ స్థానంపై కన్నేసి ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్న వారు మూడు పార్టీల్లోనూ ఉన్నారు. పట్టణంలోని 30 వార్డుల్లో 50 శాతం మహిళలకు రిజర్వ్ చేయడంతో 15 స్థానాల్లో వారికి స్థానం దక్కింది. ఇప్పుడు చైర్మన్ రిజర్వేషన్‌ను అనుసరించి మిగిలిన జనరల్ స్థానాల నుంచి కూడా మహిళలను పోటీకి దింపడానికి సిద్ధమవుతున్నారు.  ఇదిలా ఉండగా ఈ మున్సిపాలిటీ ఇప్పటివరకూ ఎస్సీలకు రిజర్వ్ కాలేదు. పట్టణంలోని 30వార్డుల్లో 37678మంది ఓటర్లుం డగా, వారిలో 3602 మంది ఎస్సీ ఓటర్లున్నారు. ప్రస్తుతం వారికి మూడు వార్డులను కేటాయించారు. రెండు జనరల్, ఒకటి ఎస్సీ మహిళకు కేటాయించారు. ఆ వర్గం కూడా ఇప్పుడు రిజర్వేషన్‌పై ఆసక్తిగా ఉంది. వారితో పాటు  బీసీలు, మహిళల ఆశలు ఎంతవరకూ నెరవేరుతాయో వేచి చూడాల్సిందే.
 
>
మరిన్ని వార్తలు