ఎంసెట్‌ ఫలితాల్లో చిక్కుముడులు

1 May, 2019 04:33 IST|Sakshi

ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు, తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు,ఏపీ గ్రేడ్లతో సమస్యలు

దీంతో ఫలితాల విడుదలలో జాప్యం

అధికారులతో నేడు సీఎస్‌ ఎల్వీ సమావేశం

ఫలితాల విడుదలపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం 

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ఎంసెట్‌–2019 ఫలితాల విడుదల ఓ చిక్కుముడిగా మారింది. వివిధ ఆటంకాల కారణంగా ఫలితాల విడుదల ఆలస్యమవుతోంది. తెలంగాణ ఇంటర్మీడియెట్‌ ఫలితాలలోని గందరగోళం పరిష్కారం కాకపోవడం, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎకనమికల్లీ వీకర్‌ సెక్షన్ల (ఈడబ్ల్యూఎస్‌) రిజర్వేషన్ల అమలు తదితర అంశాల్లో స్పష్టత లేకపోవడంతో పాటు ఏపీ ఇంటర్‌ విద్యార్థులకు మార్కులు కాకుండా, గ్రేడ్లు ఇవ్వడం ఎంసెట్‌ ఫలితాల విడుదల ఆలస్యానికి కారణంగా చెబుతున్నారు. మంగళవారం ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి దమయంతి ఈ అంశాలపై సమీక్ష నిర్వహించారు. బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం సమక్షంలో వీటిపై చర్చించి తుది నిర్ణయం తీసుకుని ఎంసెట్‌ ఫలితాల విడుదల తేదీని ప్రకటిస్తారని అధికారవర్గాలు చెప్పాయి. 

ఏపీ ఇంటర్‌ గ్రేడ్లతో సమస్య
ఎంసెట్‌లో విద్యార్థులు సాధించిన మార్కులను 75 శాతంగా పరిగణించి వాటికి ఇంటర్‌ మార్కులను వెయిటేజీగా తీసుకుని ర్యాంకులను ప్రకటించాల్సి ఉంటుంది. ఏపీలో కొత్తగా ఇంటర్‌ ఫలితాలను మార్కుల విధానంలో కాకుండా గ్రేడ్ల విధానంలో ప్రకటించారు. ఎంసెట్‌లో ర్యాంకులు ప్రకటించాలంటే ఇంటర్‌లో విద్యార్థులకు వచ్చిన మార్కులను తప్పనిసరిగా ఇంటర్‌ బోర్డు.. ఎంసెట్‌ కన్వీనర్‌కు అందించాలి. ఈ మార్కులకోసం కన్వీనర్‌ బోర్డుకు లేఖ రాశారు. అయితే గ్రేడింగ్‌పై ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకున్నందున మార్కులను ఇచ్చేందుకు బోర్డు వెనుకాడుతోంది. విద్యార్థుల మార్కుల శాతాన్ని తెలుసుకొనేందుకు పార్ములాను సూచించి దాని ఆధారంగా ముందుకు వెళ్లవచ్చని సూచిస్తోంది. అయితే ఇంటర్‌ గ్రేడ్ల విధానం తీసుకుని ఎంసెట్‌ ర్యాంకులు ప్రకటిస్తే గందరగోళంగా మారుతుందని ఎంసెట్‌ అధికారులు వాదిస్తున్నారు. మార్కులు ఇవ్వాల్సిందేనని స్పష్టంచేస్తున్నారు. ఇందుకు బోర్డు నుంచి స్పష్టత రాలేదు. ఇక ఏపీ ఎంసెట్‌ రాసిన వారిలో తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులు దాదాపు 20 వేల మంది వరకు ఉన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ ఫలితాలు మే 8న విడుదలకు అవకాశముందని, ఆ తరువాత అంటే మే రెండో వారంలో ఆ మార్కులు అందిన తర్వాత ఏపీ ఎంసెట్‌ ఫలితాలను విడుదల చేయడానికి వీలుంటుందని అధికారులు చెబుతున్నారు. 

ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లపైనా సందేహాలు
ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్యాసంస్థల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం చట్టం చేసిన నేపథ్యంలో రాష్ట్రంలోనూ దాన్ని అమలు చేయాల్సి ఉంది. ఈ పది శాతంలో 5 శాతం కాపులకు ప్రత్యేకిస్తూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ రిజర్వేషన్లను ఎలా అమలు చేయాలన్నదానిపైనా ఉన్నత విద్యాశాఖలో సందేహాలు ఏర్పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు ప్రకటించినప్పుడు సూపర్‌న్యూమరరీ సీట్లు కేటాయించాలని పేర్కొన్నా ఆమేరకు ఉత్తర్వులు లేవని ఎంసెట్‌ అడ్మిషన్ల అధికారులు చెబుతున్నారు. జాతీయ విద్యాసంస్థల్లో వేర్వేరు విధానాలు అమలు చేస్తున్నారని పేర్కొంటున్నారు. రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్ల అమలుపై ప్రభుత్వం నుంచి నిర్దిష్టమైన ఆదేశాలు రావలసి ఉందని వివరించారు. వీటన్నిటిపై సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం సమక్షంలో జరిగే సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా