ఇంత దౌర్భాగ్యమా..?

5 Mar, 2014 03:11 IST|Sakshi

అనంతపురం టౌన్, న్యూస్‌లైన్ : పోలీసుల వ్యవహార శైలి వల్ల ఒక ప్రజాప్రతినిధి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారంటే ఇంతకన్నా దౌర్భాగ్యముంటుందా? అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బి.గురునాథరెడ్డి (అనంతపురం), కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి (ధర్మవరం) మండిపడ్డారు. రాష్ట్రపతి పాలనలో ఉన్నామా? లేక పోలీసుల పాలనలో ఉన్నామా? అని ప్రశ్నించారు. కౌన్సెలింగ్ పేరుతో అమాయకులను చిత్రహింసలు పెడుతున్న పోలీసుల వ్యవహార శైలిని నిరసిస్తూ రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో అనంతపురంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళన నిర్వహించారు. ఎమ్మెల్యేలు, గురునాథరెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, పార్టీ జిల్లా కన్వీనర్ శంకరనారాయణ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గురునాథరెడ్డి నివాసం దగ్గర నుంచి ఎస్పీ కార్యాలయానికి ర్యాలీగా బయల్దేరారు. అయితే కార్యాలయంలోకి వెళ్లకుండా తెలుగుతల్లి సర్కిల్‌లోనే పోలీసులు అడ్డుకున్నారు. ఒకరిద్దరు మాత్రమే వెళ్లాలంటూ హుకుం జారీ చేశారు. దీంతో వైఎస్సార్‌సీపీ నేతలు రోడ్డుపైనే అరగంట పాటు బైఠాయించి ‘పోలీసుల దౌర్జన్యం నశించాలి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి’ అంటూ నినాదాలు చేశారు. ఓ దశలో పోలీసులు అరెస్ట్ చేయాలని చూడగా నాయకులు ప్రతిఘటించారు. దీంతో వెనక్కు తగ్గిన పోలీసులు కొందరిని మాత్రమే లోనికి పంపిస్తామని చెప్పడంతో వారు ఆందోళన విరమించారు.
 
 అనంతరం ఎస్పీ సెంథిల్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. అంతకు మునుపు గురునాథరెడ్డి మాట్లాడుతూ పోలీసులు అమానుషంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గౌరవప్రదంగా జీవిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు, కార్యకర్తలు, రైతులను కౌన్సెలింగ్ పేరుతో పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి ఇష్టానుసారంగా చితకబాదుతున్నారని ఆరోపించారు. ఇదే విషయంపై రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిని అగౌరవ పర్చేలా సీఐ భాస్కర్‌రెడ్డి వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సీఐని డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో రెండురోజులుగా జరుగుతున్న పరిణామాలపై  మంగళవారం ఉదయమే  కలెక్టర్, ఎస్పీలను కలిసి వినతిపత్రం ఇచ్చామన్నారు. అయితే ఇచ్చిన రెండుగంటలకే రాయదుర్గంలో సంఘటన జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా పోలీసులు వ్యహరిస్తున్నారని మండిపడ్డారు.
 
 జిల్లా కన్వీనర్ శంకరనారాయణ మాట్లాడుతూ... జిల్లాలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఉందన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఉద్యమబాట పట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ సీజీసీ సభ్యురాలు తోపుదుర్తి కవిత, నాయకులు ఎర్రిస్వామిరెడ్డి, తోపదుర్తి భాస్కర్‌రెడ్డి, ఆలూరు సాంబశివారెడ్డి, బొమ్మలాటపల్లి సుధాకర్‌రెడ్డి, రంగంపేట గోపాల్‌రెడ్డి,  చింతకుంట మదు,  వీరాంజనేయులు, రిలాక్స్‌నాగరాజు, కొర్రపాడు ఉస్సేన్‌పీరా, మారుతీనాయుడు, మారుతీప్రసాద్, దిలీప్‌రెడ్డి, బోయతిరుపాలు, శంకర్, రాజారెడ్డి,  గువ్వల శ్రీకాంత్, శ్రీదేవి, ప్రమీలా, క్రిష్ణవేణి,లక్ష్మి, హజరాభి, ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు.
 
 పోలీసుల అత్యుత్సాహం..
 శాంతియుత ర్యాలీ చేస్తున్న వైఎస్సార్‌సీపీ నేతల పట్ల పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. నాయకులను ఎస్పీ కార్యాలయం వరకూ వెల్లనీయలేదు. అదనపు బలగాలను దింపి, రోప్‌పార్టీ బలగాలతో తెలుగుతల్లి విగ్రహం వద్ద అడ్డుకున్నారు. కనీసం మా బాధలు కూడా చెప్పకునేందుకు అవకాశం ఇవ్వరా? ఇదేమి పాలన? మనం ఎక్కడున్నాం అంటూ ఎమ్మెల్యే గురునాథరెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఎస్పీ కార్యాలయం వరకూ వెళ్లనీయకపోతే మహిళలమంతా ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటామని మహిళా విభాగం నగర అధ్యక్షురాలు శ్రీదేవి హెచ్చరించారు. దీంతో పోలీసులు దిగరాక తప్పలేదు. ఎస్పీ కార్యాలయం వరకు వెళ్లేందుకు వారికి హక్కు ఉందని త్రీటౌన్ సీఐ దేవానంద్, పోవడానికి వీల్లేదంటూ వన్‌టౌన్ సీఐ గోరంట్ల మాధవ్ వాదులాడుకున్నారు.
 

మరిన్ని వార్తలు