‘క్రిమి చిన్నదైనా పెద్ద సైన్యంతో పోరాడాలి’

1 Apr, 2020 13:16 IST|Sakshi

సాక్షి, రాజమండ్రి: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో నిత్యావసర ధరలు పెరగకుండా చర్యలు తీసుకున్నామని ఉప ముఖ్య మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. నగరాలు, పట్టణాల్లో నిత్యావసర వస్తువులు అందరికీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. 'కరోనా కేసులు ప్రస్తుతం పెరుగుతున్నాయి. ఇది జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ముఖ్యంగా నగరాల్లో పాజిటివ్ కేసులు పెరుగుదల ఎక్కువగా ఉంది. అవసరమైన మేరకు వ్యవసాయ సంబంధిత సరకుల రవాణాకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జనమంతా కచ్చితంగా సోషల్ డిస్టెన్స్ పాటించాలి. క్రిమి చిన్నదైనా పెద్ద సైన్యంతో మనం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
 
అవసరమైన వారికి రాజమండ్రి లాంటి నగరాల్లో స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నాయి. ఈ సంస్థలను సమన్వయ పరిచి అవసరమైన వారికి సదుపాయాలు అందించే విధంగా అధికారులు ఏర్పాట్లు చేయాలి. ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్లలో ప్రాసెసింగ్ సిబ్బంది మధ్య కూడా సోషల్ డిస్టెన్స్ పాటించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఆహారం లేకుండా ఎవరూ ఇబ్బందిపడకూడదని సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశించారు. కరోనా కారణంగా ఏప్రిల్ 4న ప్రతి పేద కుటుంబానికి రూ.1000 అందజేస్తాం' అని  పిల్లి సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా