అడవి బిడ్డలకు కొండంత అండ

6 Jun, 2020 02:55 IST|Sakshi

సంక్షేమంలో సామాజిక న్యాయం

18.40 లక్షల మంది గిరిజనులకు రూ.2,136 కోట్ల నగదు జమ

అర్హులైన వారందరికీ నవరత్నాలు, ఇతర పథకాల ద్వారా ఆర్థిక ఫలాలు       

వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే గిరిజన సలహా మండలి ఏర్పాటు 

గిరిజన మహిళకు ఏకంగా డిప్యూటీ సీఎం పదవి 

ఏడాదిలో ఎంత మార్పు అంటూ గిరిజనుల ప్రశంసలు

సాక్షి, అమరావతి: గత ఐదేళ్ల చంద్రబాబు పాలనకు, ప్రస్తుత సీఎం వైఎస్‌ జగన్‌ ఏడాది పాలనకు గిరిపుత్రుల విషయంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. చంద్రబాబు పాలనలో గిరిజనులను అసలు మనుషులగానే గుర్తించ లేదు. రాజ్యాంగం ప్రకారం గిరిజనుల అభివృద్ధి, సంక్షేమంలో కీలకమైన గిరిజన సలహా మండలిని ఏర్పాటు చేయకుండా గాలికి వదిలేశారు. 
► ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గిరిజన సలహా మండలిని ఏర్పాటు చేయడం ద్వారా గిరిజనుల హక్కులకు వెన్నుదన్నుగా నిలిచారు. ఇక్కడే గత ఐదేళ్ల బాబు పాలనకు ఏడాది వైఎస్‌ జగన్‌ పాలనకు స్పష్టమైన తేడా కనిపిస్తోంది. 
► చంద్రబాబు ప్రభుత్వ హయాంలో గిరిజనులకు బ్యాంకు రుణాలే తప్ప ఎటువంటి సంక్షేమ పథకాలను అందించలేదు. అదీ కూడా తెలుగుదేశం పార్టీ వారు సిఫార్సు చేసిన వారికి ప్రభుత్వం సబ్సిడీ ఇస్తేనే బ్యాంకులు రుణాలు మంజూరు చేసేవి.
► ఇప్పుడు బ్యాంకు రుణాలతో సంబంధం లేకుండా మేనిఫెస్టోలోని నవరత్నాలు, ఇతర పథకాల ద్వారా గిరిజనులకు ఆర్థిక ప్రయోజనాలు నేరుగా వారి బ్యాంకు ఖాతాలకే జమ చేస్తున్నారు. 
► చంద్రబాబు మంత్రివర్గంలో గిరిజనులకు చోటు కల్పించలేదు. వైఎస్సార్‌సీపీ నుంచి ఫిరాయించిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మావోయిస్టుల దాడిలో మృతి చెందిన తర్వాత ఎన్నికలకు ఆరు నెలలు ముందు ఆయన కుమారుడికి మొక్కుబడిగా మంత్రివర్గంలో స్థానం కల్పించారు. ప్రస్తుతం గిరిజన మహిళ ఏకంగా డిప్యూటీ సీఎం పదవిలో ఉంది.
► ప్రస్తుత ప్రభుత్వం ఏడాదిగా 18.40 లక్షల మంది గిరిజనులకు ఏకంగా రూ.2,136 కోట్ల ఆర్థిక ప్రయోజనం చేకూర్చింది.

ఇది ఎలా సాధ్యమైందంటే..
► వైఎస్సార్‌ నవశకం పేరుతో ప్రభుత్వం వలంటీర్లను గిరిజనుల ఇంటింటికి పంపించి అర్హులైన లబ్ధిదారులను గుర్తించింది. మంత్రులు, ప్రజాప్రతినిధుల సిఫార్సులకు తావు ఇవ్వలేదు. 
► కులం, మతం, ప్రాంతం, రాజకీయం, పార్టీలకు అతీతంగా వివక్ష లేకుండా అర్హులైన గిరిజనులందరినీ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులుగా గుర్తించారు. గిరిజనులకు ఏ పథకాలున్నాయి.. వాటి ద్వారా ఎటువంటి ప్రయోజనం కలుగుతుందనే దానిపై పెద్దగా అవగాహన లేకపోయినప్పటికీ వలంటీర్ల ద్వారా ప్రతీ పథకానికి గిరిజనులను లబ్ధిదారులుగా గుర్తింప చేశారు.
► దీంతో జగనన్న అమ్మ ఒడి కింద 2.76 లక్షల మంది గిరిజనులకు రూ.414 కోట్ల ఆర్థిక ప్రయోజనం కలిగింది. వైఎస్సార్‌ రైతు భరోసా కింద 2.77 లక్షల మంది గిరిజన రైతులకు రూ.597 కోట్లను నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేశారు. వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక కింద మే నెలాఖరు వరకు 3.37 లక్షల మంది గిరిజనులకు రూ.838 కోట్లను చెల్లించారు.

మరిన్ని వార్తలు