క్లిష్టమైన కేసుల ఛేదనలో కీలకంగా సోషల్‌ మీడియా 

26 Nov, 2019 04:00 IST|Sakshi

మారుమూల ప్రాంతాల్లో దాగినా వెంటాడుతున్న కళ్లు

చిత్తూరు జిల్లాలో చిన్నారి హత్య కేసు నిందితుడిని పట్టిచ్చిన ‘ఫేస్‌బుక్‌’

విశాఖలో నైజీరియన్‌ గ్యాంగ్‌ మోసాలకు సోషల్‌ మీడియా ద్వారానే చెక్‌

నేరస్తుల జాడ పసిగట్టడంలో రాష్ట్ర పోలీసుల కొత్త పంథా

మూడు నెలల్లో పట్టుబడిన నిందితులు 258  

సాగర తీరంలోని విశాఖలో అందమైన అమ్మాయిలను ఎరవేసి సోషల్‌ మీడియా ద్వారా మోసాలకు పాల్పడుతున్న నైజీరియా గ్యాంగ్‌ను ఈనెల 20న పోలీసులు అరెస్టు చేశారు. ఫేస్‌బుక్, వాట్సాప్‌ ద్వారా అందమైన యువతుల ఫొటోలు పంపించి గిఫ్ట్‌లు, ఫ్రెండ్‌షిప్, ఫేక్‌ ఫోన్‌కాల్స్‌తో డబ్బులు కాజేస్తున్న ముఠా బారిన పడిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. అదే సోషల్‌ మీడియా ద్వారా నైజీరియా ముఠా ఫోన్‌ నెంబర్లు, ఆచూకీ కనిపెట్టి వారి ఆట కట్టించడం విశేషం.

చిత్తూరు జిల్లా బి.కొత్తకోటలో ఈనెల 7వ తేదీన అపహరణకు గురైన చిన్నారి వర్షిత హత్య కేసులో నిందితుడు పఠాన్‌ మహ్మద్‌రఫీని సోషల్‌ మీడియా వారం రోజుల్లోనే పట్టిచ్చింది. చిన్నారిపై అకృత్యానికి పాల్పడిన నిందితుడి ఊహాచిత్రాన్ని పోలీసులు సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా విడుదల చేశారు. రఫీ ఫొటోను పలువురు డ్రైవర్లు సామాజిక మాధ్యమాల్లో గుర్తించి  టమోటా లారీ క్లీనర్‌గా ఛత్తీస్‌గడ్‌ వెళ్లాడని సమాచారం అందించడంతో ఈనెల 16న అరెస్టు చేశారు. నిందితుడు గడ్డం తొలగించి గుండుతో పారిపోయినప్పటికీ సోషల్‌ మీడియా కళ్లుకప్పలేకపోయాడు.

సాక్షి, అమరావతి: కీలక కేసుల్లో పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతోపాటు సామాజిక మాధ్యమాలను వినియోగించుకోవడం ద్వారా నేరస్తుల ఆట కట్టిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక చొరవతో డీజీపీ డి.గౌతమ్‌ సవాంగ్‌ చేపట్టిన సాంకేతిక ప్రయోగాలు సత్ఫలితాలనిస్తున్నాయి. గత మూడు నెలల వ్యవధిలో 258 కేసుల్లో సోషల్‌ మీడియా ద్వారా నిందితులను అరెస్టు చేశారు. పదేళ్లుగా పరారీలో ఉన్న వారిని కూడా సోషల్‌ మీడియా సాయంతో గుర్తించి అరెస్టు చేయడం గమనార్హం. కృష్ణా, విజయనగరం, విశాఖ, చిత్తూరు, అనంతపురం తదితర చోట్ల పలు కేసుల్లో సామాజిక మాధ్యమాల సాయంతోనే క్లూస్‌ (ఆధారాలు) సేకరించాగలిగారు. 

‘సోషల్‌’ జల్లెడ!
కేసుల దర్యాప్తుల్లో పోలీసులు తీసుకుంటున్న చర్యలు సామాజిక మాద్యమాల్లో పెద్ద ఎత్తున వైరల్‌ అవుతుండటంతో మారుమూల ప్రాంతాలకు కూడా సమాచారం చేరుతోంది. నిందితుల ఉహాచిత్రాలు, పాత నేరస్తుల ఫొటోలను ఆప్‌లోడ్‌ చేస్తున్నారు. పలు కేసుల్లో తప్పించుకుని తిరుగుతున్న వారి పేరుతో ఏమైనా ఫేస్‌బుక్‌ ఖాతాలున్నాయా? ఫ్రొఫైల్‌లో చిరునామా, ఫోన్‌ నెంబర్లు, వాట్సాప్‌ వివరాలు తదితర కోణాల్లో కూపీ లాగి సోషల్‌ మీడియాలో జల్లెడ పడుతుండటంతో అన్వేషణ ఫలిస్తోంది. జటిలమైన కేసుల్లోను సామాజిక మాధ్యమాలు దారి చూపుతున్నాయని సీనీయర్‌ ఐపీఎస్‌ అధికారులు సంతృప్తి వ్యక్తం చేస్తుండటం విశేషం.

ఐదు సైబర్‌ ల్యాబ్స్‌ సహకారం..
సామాజిక మాధ్యమాలపై నిఘా, సమాచారాన్ని క్రోడీకరించేందుకు పలు కేసుల్లో పోలీసులు ప్రత్యేక వ్యవస్థను వినియోగించుకుంటున్నారు. తిరుపతి, కర్నూలు, విశాఖ, విజయవాడ, రాజమహేంద్రవరంలోని సైబర్‌ ల్యాబ్స్‌ సహకారంతో కేసులను చేధిస్తున్నారు. ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్, టిక్‌టాక్, గూగుల్‌ లాంటి సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుంటున్నారు.

వేగంగా దర్యాప్తు..
‘కేసుల దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు న్యాయం చేయాలన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు అన్ని రకాల సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నాం. డ్రగ్స్‌ మాఫియా, సెక్స్‌ రాకెట్, ఆన్‌లైన్‌ జూదం తదితరాల్లో సోషల్‌ మీడియా ద్వారా అందుతున్న సమాచారం నేరస్తుల ఆట కట్టించేందుకు దోహదపడుతోంది. సోషల్‌ మీడియాను వినియోగించుకుని కేసులు చేధించేలా డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ప్రత్యేక చర్యలు చేపట్టారు’
–పాల్‌రాజు, టెక్‌ సర్వీసెస్‌ డీఐజీ

మరిన్ని వార్తలు