అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం

20 Aug, 2014 02:52 IST|Sakshi
  •  బాధితులకు తక్షణ న్యాయం     
  •   కేసుల పరిష్కారంలో వేగం
  •   నేర సమీక్షా సమావేశంలో ఎస్పీ విజయ్‌కుమార్
  • కోనేరుసెంటర్ (మచిలీపట్నం) : జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అసాంఘిక శక్తుల ఆగడాలను అరికట్టేందుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని   ఎస్పీ జి.విజయ్ కుమార్ ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం ఎస్పీ జిల్లాలోని ఇతర అధికారులతో కలిసి నేర సమీక్షా సమావేశం నిర్వహించారు.  ఎస్పీ మాట్లాడుతూ శాంతి    భద్రతలకు విఘాతం కలిగించే విధంగా వ్యవహరించే ఏ ఒక్కరినీ ఉపేక్షించేది లేదని చెప్పారు. అలాంటి వారికి సిబ్బంది వత్తాసు పలికినా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారికి పోలీసుల సహకారం ఉన్నట్లు తెలిసినా శాఖాపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  

    న్యాయం కోసం స్టేషన్లను ఆశ్రయించే బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందన్నారు. విధుల పట్ల అంకితభావం, బాధితులకు న్యాయం చేయటంలో చిత్తశుద్ధి చూపించాలని సూచించారు.  నేరాలు జరిగిన తరువాత  చర్యలు తీసుకోవడం కంటే నేరాలను అదుపు చేసేలా సిబ్బంది విధులను నిర్వర్తించాలన్నారు. స్టేషన్లలో పెండింగ్ కేసులను పరిష్కరించేందుకు తక్షణమే  చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సుదీర్ఘకాలం పాటు పెండింగ్‌లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
     
    పోలీసులకు అందే ప్రతి కేసు నమోదు చేసి ఎఫ్‌ఐఆర్ కట్టాలని, బాధితులకు న్యాయం జరిగే విధంగా కృషి చేయాలని సూచించారు. సిబ్బందికి ఎలాంటి సమస్యలు ఉత్పన్నమైనా ధైర్యంగా తనను కలిసి వివరించవచ్చునని  చెప్పారు.  సివిల్ పంచాయితీల విషయంలో పోలీసులు స్టేషన్లలో పంచాయితీలు పెట్టినట్లు తన దృష్టికి వస్తే తన నిర్ణయాలు కఠినంగా ఉంటాయన్నారు. జిల్లాలో జరిగే పేకాట, కోడిపందేలాపై ప్రత్యేక నిఘా ఉంచి వాటిని అరికట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అడిషనల్ ఎస్పీ బి.డి.వి. సాగర్, బందరు, గుడివాడ, నూజివీడు, నందిగామ డీఎస్పీలు, జిల్లాలోని సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
     

మరిన్ని వార్తలు