ఫిబ్రవరి 12 రాత్రి అసలేం జరిగింది?

4 Mar, 2018 14:01 IST|Sakshi

హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌ : జీవితంలో అనుకోని దుర్ఘటనలు ఎదురైనప్పుడు కొందరు భయపడతారు.. మరికొందరు ఆ గాయాలనే తలుచుకుంటూ కుంగిపోతారు.. ఇంకొందరు సమయస్ఫూర్తితో ఎదుర్కొని ఎందరికో స్ఫూర్తి ప్రదాతలుగా నిలుస్తారు. ఊరు కాని ఊరిలో, భాష తెలియని ప్రాంతంలో అర్ధరాత్రి దుండగులు కత్తులతో దాడి చేస్తే ధైర్యంగా ప్రతిఘటించి మృత్యువుతో పోరాడి ఎందరికో ఆదర్శంగా నిలిచింది ఉంగుటూరు మండలం తేలప్రోలుకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని జంగా లావణ్య.   ప్రాణాపాయ స్ధితి నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న లావణ్య  స్వగ్రామం తేలప్రోలు వచ్చారు.
 ఆమె ‘సాక్షి’తో ముచ్చటించారు.

సాక్షి: ‘బ్రేవ్‌ ఉమన్‌’ అవార్డు రావడం ఎలా అనిపించింది?
లావణ్య: తమిళనాడుకు చెందిన ఓ ప్రముఖ న్యూస్‌ ఛానల్‌ ఇటీవల ప్రతిష్టాత్మక ‘బ్రేవ్‌ ఉమెన్‌’ అవార్డును ప్రకటించటం చాలా ఉత్సాహాన్ని ఇ చ్చింది. పూర్తిగా కోలుకోకపోవడంతో నా తల్లిదండ్రులు బసవ పున్న మ్మ, పిచ్చిరెడ్డి చెన్నైలో నటి రాధిక చేతుల మీదుగా అవార్డు తీసుకున్నారు.

సాక్షి: ఫిబ్రవరి 12 రాత్రి అసలేం జరిగింది?
లావణ్య: నేను రోజూ సాయంత్రం జిమ్‌కు, వీక్‌ ఎండ్స్‌లో డాన్స్‌ క్లాస్‌కు వెళుతుంటాను. ఆ రోజు ఓ ముఖ్యమైన క్లయింట్‌తో కంపెనీ తరుపున మీటింగ్‌కు హాజరవడంతో రాత్రి బాగా ఆలస్యమైంది. అయినా ధైర్యం చేసి బైక్‌పై రూమ్‌కి బయలు దేరాను. మరో ఐదు నిమిషాల్లో రూమ్‌కు చేరుకునే దాన్ని. ఇంతలో పెరుంబాక్కం సమీపంలో ముగ్గురు వ్యక్తులు  కత్తులతో నాపై దాడికి తెగబడ్డారు. నా దగ్గర బ్యాగ్‌లో ఉన్న డబ్బులు, మెడలోని బంగారు గొలుసు, సెల్‌ఫోన్‌ లాక్కున్నారు. నా చేతికి ఉన్న బ్రాస్‌లెట్‌ బలవంతంగా తీసుకోబోతుండగా ప్రతిఘటించేందుకు యత్నించా. దీంతో వారు కత్తులతో నాపై విచక్షణారహితంగా దాడి చేశారు. నా తలపై బలంగా పొడవాటి కత్తితో బాదడంతో తీవ్ర గా>యాలయ్యాయి. ఇంకా నన్ను చంపేస్తారనే అనుమానంతో చనిపోయినట్లు నటించా. దీంతో నన్ను విడిచిపెట్టి పారిపోయారు.

సాక్షి:  ఆస్పత్రికి ఎలా చేరారు?
లావణ్య: తీవ్ర గాయాలతో రక్తం పోతున్నా ధైర్యంగా సమీపంలోని రోడ్డుపైకి వచ్చా. రెండు అడుగులు వేయటం, కూర్చోవడం.. మళ్లీ రెండు అడుగులు వేయటం ఇలా రోడ్డుపైకి వచ్చిన తర్వాత కూడా రెండు గంటల పాటు ఎవ్వరూ సాయం అందించేందుకు ముందుకు రాలేదు. చాలా మంది ఉద్యోగులు ఆ రోడ్డుపై బైకులు, కార్లపై వెళుతూ గాయాలతో పడి ఉన్న నన్ను చూస్తున్నారే తప్ప సాయం చేసేందుకు ముందుకు రాలేదు. చదువు రాని ఓ లారీ డ్రైవర్‌ ప్రాణాపాయ స్థితిలో ఉన్న నన్ను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. నా ఆఫీస్, తల్లిదండ్రుల వివరాలు పోలీసులకు చెప్పాను. చెన్నైలోని గ్లోబల్‌ ఆస్పత్రిలో నన్ను పోలీసులు చేర్చారు.

సాక్షి: అక్కడి పోలీసులు, ప్రజల నుంచి ఎలాంటి సపోర్ట్‌ లభించింది?
లావణ్య: నా జీవితాంతం తమిళనాడు ప్రజలకు రుణపడి ఉంటాను. ఆపద సమయంలో యావత్‌ తమిళనాడు బాసటగా నిలిచింది. చెన్నై పోలీస్‌ కమిషనర్, ఏసీపీ, పల్లికరణై ఇన్‌స్పెక్టర్‌ శివకుమార్‌ కొద్దిరోజులకే ముగ్గురిని పట్టుకుకున్నారు. తమిళనాడు శాసనసభ ప్రతిపక్షనేత స్టాలిన్, ఐటీ శాఖ మంత్రి ఆస్పత్రికి వచ్చి నన్ను పలకరించడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది.

సాక్షి: దుండగుల దాడి సమయంలో మీరు ఎలాంటి ఆందోళనకు గురయ్యారు?
లావణ్య: మహాత్ముడు కలలు కన్నట్లుగా ఆడది మాత్రమే కాదు పురుషుడు కూడా అర్ధరాత్రి ఒంటరిగా బయటకు వెళ్లగలిగినప్పుడే నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లు అనేది నా అభిప్రాయం. ఇలాంటి సమయాల్లో ఆడ, మగ తేడా ఉండదు. నాకు చిన్నప్పటి నుంచి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం అలవాటు. నాయకత్వ లక్షణాలు కూడా ఎక్కువే. బహుశ ఇవే లక్షణాలు ఆపద సమయంలో నన్ను ధైర్యవంతురాలిని చేశాయి. దుండగుల దాడి నుంచి త్వరగా కోలుకునేందుకు ఇదే కారణం కావచ్చు. సమాజంలో ఎదురుదెబ్బలకు బెదరకుండా ముందుకు సాగడమే జీవితం.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా