కడుపు నొప్పి తాళలేక సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆత్మహత్య

5 Nov, 2018 13:21 IST|Sakshi
మృతురాలి కుటుంబీకులను పరామర్శిస్తున్న వైఎస్‌ అవినాష్‌రెడ్డి, వైఎస్‌ వివేకానందరెడ్డి

వైఎస్‌ఆర్‌ జిల్లా, పులివెందుల రూరల్‌ : సింహాద్రిపురం మండలం దిద్దకుంట గ్రామానికి చెందిన అరుణాదేవి(30) అనే యువతి కడుపునొప్పి తాళలేక ఆత్మహత్య చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన రామచంద్రారెడ్డి, సావిత్రిల కుమార్తె అరుణాదేవిని చెర్లోపల్లె గ్రామానికి చెందిన చెన్నకేశవరెడ్డి, వరలక్ష్మిల కుమారుడు చాణక్య శ్రీనివాసులరెడ్డికి ఇచ్చి నాలుగేళ్ల కిత్రం వివాహం చేశారు. వారిద్దరు బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నారు. వీరికి మూడేళ్ల క్రితం జన్మించిన బిడ్డ విద్యుదాఘాతంతో మృతి చెందాడు. అప్పటి నుంచి ఆమె తీవ్ర మనస్థాపం చెందుతోంది. దీనికి తోడు ఆమె కడుపు నొప్పితో బాధపడుతోంది. ఈ నేపథ్యంలో సెలవులు కావడంతో వారు రెండు రోజుల కిత్రం దిద్దకుంటకు వచ్చారు. ఈ క్రమంలో ఆమె శనివారం గడ్డికి ఉపయోగించే మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. దీంతో బంధువులు గుర్తించి ఆమెను చికిత్స కోసం పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అక్కడి వైద్యులు పరీక్షించి మెరుగైన వైద్యం కోసం కడపకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు  పోలీసులు తెలిపారు.

కుటుంబ సభ్యులను పరామర్శించిన వైఎస్‌ అవినాష్‌రెడ్డి, వైఎస్‌ వివేకానందరెడ్డి
అరుణాదేవి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న మాజీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శంకర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు  బ్రహ్మానందరెడ్డి, యర్ర గంగిరెడ్డి, సురేష్‌రెడ్డిలు ప్రభుత్వ ఆసుపత్రిలో అరుణాదేవి మృతదేహనికి నివాళులర్పించారు.

మరిన్ని వార్తలు