కరువునెదిరించిన సు‘ధీరుడు’

29 Jul, 2019 07:49 IST|Sakshi
బొందలవాడలో ఖర్జూరం పంటను పరిశీలిస్తున్న కలెక్టర్‌ 

కంప్యూటర్‌ను కాదని కరువు నేలలో ప్రయోగం 

ఆరేళ్లుగా మూడెకరాల్లో ఖర్జూర సాగు 

270 చెట్లతో రూ.30 లక్షల ఆదాయం 

తోటను పరిశీలించిన జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ 

ఆయనో విద్యావంతుడు. నెలకు ఐదంకెల జీతం. రైతు కుటుంబం నుంచి వచ్చిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. కాంక్రీట్‌ వనాల్లో సంతోషం కరువై వ్యవసాయంపై మనసు మళ్లింది. అనుకున్నదే తడవుగా సొంతూరికి చేరుకుని లక్ష్యం దిశగా అడుగులు వేశాడు. ఎడారికే పరిమితమైన ఖర్జూర సాగును కరువు జిల్లాలో చేపట్టి లాభాల పంట పండిస్తున్నాడు. జిల్లా కలెక్టర్‌ ఎస్‌.సత్యనారాయణ ఆదివారం స్వయంగా తోటను పరిశీలించి ఆ యువకుడిని అభినందించడం విశేషం. 

సాక్షి, నార్పల: మండలంలోని బొందలవాడకు చెందిన యండ్లూరి సుధీర్‌నాయుడు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేసేవారు. కానీ వ్యవసాయం అంటే ఎంతో ఇష్టమున్న ఆయన..స్వగ్రామం చేరుకుని పంటలసాగుకు సిద్ధమయ్యాడు. అయితే అందరిలా కాకుండా వినూత్న పంటలు సాగుచేయాలనుకున్నాడు. ఈక్రమంలోనే ఎడారిలో పండే ఖర్జూర సాగుపై వివరాలు సేకరించాడు. అనంత భూములు ఖర్జూరు సాగుకు అనుకూలమని తెలుసుకున్నాడు. ఇక్కడి ఉష్ణోగ్రత కూడా పంట సాగుకు అనుకూలమని తెలిసి ఆరేళ్ల క్రితం మూడు ఎకరాల్లో 270 కర్జూర చెట్లు నాటాడు. పంటకు అవసరమైన సస్యరక్షణ చర్యలు ఎప్పటికప్పుడు చేపట్టాడు. ఫలితంగా ఖర్జూరం సిరులు కురిపిస్తోంది. ఈ సంవత్సరానికి గాను రూ.30 లక్షల ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. దీంతో సుధీర్‌ నాయుడు పేరు మార్మోగిపోయింది. 

ఖర్జూర తోటను పరిశీలించిన కలెక్టర్‌ 
సుధీర్‌ నాయుడు గురించి తెలుసుకున్న కలెక్టర్‌ సత్యనారాయణ ఆదివారం బొందలవాడ గ్రామానికి వచ్చి ఖర్జూర తోటను పరిశీలించారు. పంట పెట్టడానికి ఎంత పెట్టుబడి అవుతుంది..,  ఎన్ని సంవత్సరాలకు పంట చేతికి వస్తుంది.., మార్కెటింగ్‌ సదుపాయం ఎలా ఉంది.. తదితర వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ, ‘అనంత’ భూములు ఉద్యాన పంటలకు అనుకూలమన్నారు. కలింగర, ఢిల్లీ కర్బూజ, అరటి, మామిడి, చీనీ, ద్రాక్ష, దానిమ్మ, బొప్పాయి, జామ లాంటి ఉద్యాన పంటలు సాగు ఎక్కువగా ఉంటుందన్నారు. కానీ బొందలవాడకు చెందిన యువకుడు ఒకడుగు ముందుకు వేసి ఖర్జూర పంట సాగుచేసి అధిక ఆదాయం పొందడం సంతోషదాయకమన్నారు. కలెక్టర్‌ వెంట ఏపీఎంఐపీడీ సుబ్బరాయుడు, ఏడీ చంద్రశేఖర్, సతీష్, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు