కోట్ల మట్టి కొల్లగొట్టి.. కొల్లగొట్టి

14 Jul, 2016 01:00 IST|Sakshi

పోలవరం కుడి కాల్వ మట్టి స్వాహా
లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి అక్రమ తరలింపు
45 కిలోమీటర్ల పొడవున భారీగా తవ్వకాలు
ప్రభుత్వానికి నివేదిక పంపిన విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్

 
 
ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ కాదు అనే నానుడిని టీడీపీ నేతలు బాగా వంట పట్టించుకున్నారు. రాక రాక వచ్చిన అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డగోలుగా అక్రమాలకు తెగబడుతున్నారు. మళ్లీ అధికారం వచ్చేనా చచ్చేనా అనుకుంటూ అమాత్యుల అండదండలతో కోట్ల రూపాయల మట్టిని యథేచ్ఛగా కొల్లగొడుతున్నారు. నిబంధలన్నింటికీ ట్రాక్టర్ చక్రాల తొక్కిపెట్టి.. ప్రజాధనాన్ని అక్రమంగా వారి జేబుల్లో కుక్కుకుంటున్నారు.  అడ్డొస్తారనుకునే అధికారుల నోళ్లకు మామూళ్ల మత్తుతో తాళం వేస్తున్నారు.
 
విజయవాడ : అందినంత వరకు దోచుకోవడమే ఎజెండాతో జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు పని చేస్తున్నారు. దీంతో అనుచరగణం రెచ్చిపోయి భారీగా మట్టిని కొల్లగొట్టి డబ్బులు దండుకుంటున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని స్వాహా చేశారు. కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. దీనిపై వరుస కథనాలు రావడంతో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దృష్టి సారించి సమగ్ర విచారణ నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక పంపారు.

జిల్లాలో పోలవరం కుడి కాల్వ పనుల్ని రాష్ట్ర జలవనరుల శాఖ నిర్వహిస్తోంది. దీనిని ప్యాకేజ్‌ల వారీగా విభజించి కాలువ పూడికతీత పనులు చేస్తున్నారు. గన్నవరం రూరల్ మండలంలోని పల్లెర్లమూడి నుంచి మైలవరం నియోజకవర్గంలోని జి. కొండూరులో వెలగలేరు వరకు 45 కిలోమీటర్ల పొడవునా కుడి కాలువ పూడికతీత పనులు చేపట్టారు. ఈ క్రమంలో జిల్లాలో కీలక మంత్రి, మరో శాసనసభ్యుడు మండలాల వారీగా మట్టి తవ్వకాలను పంచుకొని అడ్డగోలుగా తవ్వించారు. మొత్తం 45కి.మీ మేర సుమారు 100 కోట్లకుపైగా విలువైన మట్టిని స్వాహా చేశారు. ఒక క్యూబిక్ మీటర్ రూ. 400 వరకు పలుకుతోంది. ఇక్కడ మట్టిని తవ్వేందుకు ప్రత్యేకంగా కాంట్రాక్ట్ కూడా ఇచ్చారు. పూడికతీత పనుల్లో భాగంగా మట్టిని తవ్వి పక్కన కుప్పలుగా పోయిం చాలి. దానితో నిమిత్తం లేకుండా మట్టిని తవ్వేవారే జలవనరుల శాఖ నిర్దేశించిన కొలతల ప్రకారం వదిలేసి మిగిలిన మట్టిని తరలించుకుపోతున్నారు.
 
రెండు నియోజకవర్గాల్లోనే...
ముఖ్యంగా రెండు నియోజకవర్గాల్లో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, ఛోటా నాయకులు పోటీలు పడి మరీ మట్టిని తవ్వించారు. గతంలో ఒకటి రెండుసార్లు రెవెన్యూ సిబ్బంది, పోలీసులు అడ్డుకోవటానికి యత్నిస్తే తమదైన శైలిలో హెచ్చరికలు జారీ చేసి తర్వాత మాముళ్లతో వారిని కట్టి పడేస్తున్నారు. వీటిని అడ్డుకుంటే అమాత్యునికి ఎక్కడ కోపం వస్తుందోనని జలవనరుల శాఖ అధికారులు మౌనం వహిస్తున్నారు.  

 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి మాయం
 ఈ వ్యవహారంపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు విచారణ నిర్వహించారు. అక్కడ 284.56 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి మాయమైందని నిర్ధారించారు. దీని ద్వారా ప్రభుత్వం సుమారు 60.77 లక్షల ఆదాయం కోల్పోగా బాధ్యుల నుంచి దానికి ఐదు రెట్లు మొత్తం అపరాధ రుసుంగా వసూలు చేయాలని.. ప్రభుత్వానికి నివేదిక పంపారు. విచారణ చేసి చర్యలు తీసుకోవాల్సిందిగా జలవనరుల శాఖ అధికారులకు ఉత్తర్వులు అందినట్లు సమాచారం.      
 

>
మరిన్ని వార్తలు