మట్టి దొంగలు

13 Aug, 2013 03:30 IST|Sakshi


 మంచిర్యాల రూరల్, న్యూస్‌లైన్ : ఎల్లంపల్లి(శ్రీపాద) ప్రాజెక్టు కోసం ఇళ్లు, వ్యవసాయ భూములు, సర్వం ధారాదత్తం చేసిన నిర్వాసితులను మట్టి మాఫియా వెంటాడుతోంది. కొందరు కాంట్రాక్టర్లు అనుమతి లేకుండా గుడిపేట శివారులో మట్టిని అక్రమంగా తవ్వుతూ తూర్పు ప్రాంతంతోపాటు కరీంనగర్ జిల్లాలకు తరలిస్తున్నారు. నిత్యం లారీల కొద్ది మట్టి తవ్వకాలు చేపట్టడంతో గ్రామాన్ని ఆనుకుని ఉన్న భూమి గుంతలుగా మారింది. ఇటీవల కురిసిన వర్షాలకు గుంతల్లో భారీగా వరదనీరు వచ్చి చేరడంతో రవాణాకు అడ్డంకిగా మారింది. అక్రమంగా రూ.లక్షలు గడిస్తున్న కాంట్రాక్టర్ల ఆగడాలను అరికట్టాల్సిన
 రెవెన్యూ అధికారులు ‘మూములు’గా తీసుకోగా, నిర్వాసితులకు కంటిమీద కునుకు లేకుండా పోయింది.
 
 మూడు వైపులా నీరు
 ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటినిల్వ నుంచి గుడిపేట గ్రామం కేవలం అర కిలోమీటరు దూరంలో ఉంది. గ్రామానికి మరోవైపు చెరువు ఉంది. ఇటీవల కురిసిన వర్షాలకు ప్రాజెక్టులో, చెరువులో భారీగా వరద నీరు చేరి నిండుకుండలా మారాయి. దీంతో గ్రామస్తులు ఇప్పటికే తీవ్ర భయాందోళనలకు గురవుతుండగా, మట్టి మాఫియాతో మరో ముప్పు ఏర్పడింది. ప్రాజెక్టులో ముంపునకు గురవుతున్న గ్రామాలకు ప్రభుత్వం పరిహారం అందించి, వ్యవసాయ భూములను తమ ఆధీనంలోకి తీసుకుంది. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే వ్యవసాయ భూములు ప్రాజెక్టు నీటిలో మునిగిపోతాయి. దీంతో కొందరు అక్రమార్కులు మట్టి తవ్వకాలు చేపట్టారు. ఎనిమిది పొక్లెయినర్‌తో రోజుకు 80 నుంచి 90 లారీలు, 30 వరకు ట్రాక్టర్లతో మట్టిని తరలిస్తున్నారు. ఒక్కో లారీకి రూ. 2,500 నుంచి రూ.3,500 వరకు, ట్రాక్టరుకు రూ.1000 నుంచి రూ.1,500 దూరాన్ని బట్టి వసూలు చేస్తున్నారు. ఉదయం, రాత్రి అనే తేడా లేకుండా మట్టి రవాణా చేస్తున్నారు. రెవెన్యూ, నీటిపారుదల శాఖ, ఆర్టీఏ అధికారులు మామూలుగా చూస్తున్నారు. గుడిపేటను ఆనుకుని ఉన్న భూమి గుంతలుగా మారింది. 20 ఫీట్లకు పైగా లోతు మట్టిని తవ్వడంతో పెద్దపెద్ద గుంతలు ఏర్పడి, అందులో వర్షం నీరు నిలిచింది. దీంతో గ్రామానికి మూడువైపులా నీరు నిలిచిఉండడంతో, ఎప్పుడు ఏంజరుగుతుందోనని గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్నారు.
 
 నిర్వాసితుల ఆందోళన
 లారీల్లో అధికలోడుతో మట్టి తరలిస్తుండటంతో రహదారులు గుంతల మయంగా మారాయి. రవాణా సాగించడం కష్టంగా మారింది. గుడిపేట, నంనూరు గ్రామాలకు వెళ్లే రోడ్డు నుంచి మట్టిని తీసుకెళ్తున్న లారీలు, ట్రాక్టర్లతో రహదారులు పాడవుతున్నాయని, అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ముంపు గ్రామాలు కావడంతో రోడ్లను అభివృద్ధి చేయడం లేదని, గుంతలు పడిన రోడ్లను అలాగే వదిలేస్తే, తాము రాకపోకలు సాగించేది ఎలాగని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. గుడిపేటకు మూడువైపులా నీరు నిల్వ ఉండడంతో మట్టితో కట్టుకున్న ఇళ్లు తడిగా మారుతూ, ఎప్పుడు కూలుతాయోనని గ్రామస్తులు భయాందోళనలు చెందుతున్నారు. తాము పునరావాస కేంద్రాలకు వెళ్లేందుకు మరో రెండేళ్లైనా పడుతుందని, రెండేళ్లు తాము గుంతల రోడ్డుపై ప్రయాణం చేస్తే, తమకు ఆరోగ్య సమస్యలు వస్తాయని నిర్వాసితులు పేర్కొంటున్నారు.
 
 పట్టించుకోని అధికారులు
 రెవెన్యూ శాఖ అధికారుల కళ్లముందే లారీలకొద్ది మట్టిని అక్రమంగా కాంట్రాక్టర్లు తవ్వుకుపోతున్నా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. అధిక లోడుతో వెళ్తున్న వాహనాలను పట్టుకోవాల్సిన ఆర్టీఏ అధికారులు ‘మామూలు’గా తీసుకుంటున్నారు. ఇరిగేషన్ శాఖకు ఎల్లంపల్లి ముంపు గ్రామాల భూములను అప్పగించారు. మట్టిమాఫియా ఆయా భూముల్లో మట్టి తవ్వకాలు చేపడుతున్నా, తమకేమి సంబంధం లేదన్నట్లుగా ఆ శాఖ అధికారులు వ్యవహరిస్తున్న తీరు పలు విమర్శలకు తావిస్తోంది. అన్ని శాఖల సహాయసహకారాలను పొందేందుకు కాంట్రాక్టర్లు పెద్ద మొత్తంలో ముడుపులు ముట్టజెప్పారని పలువురు చర్చించుకుంటున్నారు. మట్టితవ్వకాలతో కాంట్రాక్టర్లు, అధికారులు సంపాదనలు పెరుగుతుండగా, ప్రభుత్వ ఖజానాకు గండిపడుతుంది. ఇక నిర్వాసిత గ్రామస్తులు తమ రోడ్లు పాడవుతున్నాయని, ఉదయం లారీలు, ట్రాక్టర్లు మట్టిని తీసుకుపోవడం వల్ల మట్టిలేస్తుందని, రాత్రుళ్లు లారీలు తిరగడం వల్ల మట్టితోపాటు శబ్దాలతో నిద్రలేని రాత్రుళ్లు గడపాల్సి వస్తుందని వాపోతున్నారు. రెవెన్యూకు, పోలీసులకు అక్రమ రవాణాపై సమాచారం ఇచ్చినా, వాహనాలను పట్టుకోవడం, కేసులు నమోదు చేయడం గానీ అధికారులు చేపట్టకపోవడంతో, ఎవరికి తమ బాధలు చెప్పుకోవాలో తెలియడం లేదని నిర్వాసితులు తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు