జెన్‌కోకు ‘సౌర’ సొగసు!

9 Aug, 2013 00:58 IST|Sakshi
జెన్‌కోకు ‘సౌర’ సొగసు!

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ జెన్‌కోకు ‘సౌర’ సొగసు సమకూరనుంది. రాష్ట్రవ్యాప్తంగా 30 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సౌరవిద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు జెన్‌కో పాలక మండలి ఆమోదముద్ర వేసింది. దాంతో పాటు మరో 100 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకూ భూమిని సేకరించాలని నిర్ణయించింది. విద్యుత్ సౌధలో ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, జెన్‌కో చైర్మన్ ఎం.సాహూ అధ్యక్షతన గురువారం బోర్డు సమావేశం జరిగింది. వైఎస్సార్ జిల్లాలోని రాయలసీమ థర్మల్ విద్యుత్ కేంద్రం వద్ద 20 మెగావాట్లు, నెల్లూరులో 5 మెగావాట్లు, ఖమ్మంలోని కేటీపీఎస్ వద్ద మరో 5 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు బోర్డు ఆమోదముద్ర వేసింది. వాగులు, వంకలపై 104 మెగావాట్ల సామర్థ్యంతో 75 ప్రాంతాల్లో మినీ జల విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు టెండర్లను ఆహ్వానించగా.. 2.5 మెగావాట్ల సామర్థ్యంతో 3 కేంద్రాల ఏర్పాటుకు మాత్రమే టెండర్లు దాఖలయ్యాయి.
 
 విజయనగరం, వరంగల్‌లో ఒక్కో మెగావాట్ చొప్పున ఏర్పాటు చేసేందుకు పీవీఆర్ ఇంజనీర్స్ కంపెనీ ముందుకురాగా.. నల్లగొండలో 0.5 మెగావాట్ సామర్థ్యం కలిగిన కేంద్రం ఏర్పాటుకు శ్రీనివాసన్ అనే కాంట్రాక్టరు ముందుకు వచ్చారు. వీటికి కూడా బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఒడిశాలోని తాల్చేరు నుంచి రాష్ట్రంలోని విద్యుత్ ప్లాంట్లకు రైల్వే వ్యాగన్ల ద్వారా మరింత బొగ్గును సరఫరా చేసేందుకు, సిగ్నలింగ్ వ్యవస్థను మెరుగుపరిచేందుకు కూడా బోర్డు సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. అయితే, విద్యుత్ సంస్థల రుణాల పునర్వ్యవస్థీకరణ ప్యాకేజీ అమలు తర్వాతే 2012-13 ఆర్థిక సంవత్సరానికిగానూ జెన్‌కో ఆర్థిక ఫలితాలు ప్రకటించాలని బోర్డు అభిప్రాయపడింది. ఈ సమావేశంలో జెన్‌కో ఎండీ విజయానంద్, ఆర్థిక, సాగునీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శులు, జెన్‌కో జేఎండీ ప్రభాకర్‌రావు, డెరైక్టర్లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు