అడ్రస్‌ లేని సోలార్‌ సిటీ

19 Jan, 2019 07:42 IST|Sakshi
నరసాపురంలో గోదావరి తీరం

ప్రకటనకు రెండేళ్లు విడుదల కాని నిధులు

ముందుకు కదలని ప్రాజెక్ట్‌ పట్టణ వాసుల్లో నిరాశ

పశ్చిమగోదావరి, నరసాపురం: నరసాపురం పట్టణం ఇక సోలార్‌ సిటీ.. విజయవాడ తరువాత రాష్ట్రంలోనే రోల్‌ మోడల్‌గా నరసాపురంలో అని చెప్పారు. సాక్షాత్తు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటన చేసి రెండేళ్లు పూర్తయింది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ప్రాథమికంగా ఏ అంశమూ ముందుకు కదల్లేదు. దీంతో పట్టణ వాసులు నిరాశ చెందారు. ఇక ప్రాజెక్ట్‌ కార్యరూపం దాల్చే అవకాశంలేదు. అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తీరప్రాంత అభివృద్ధిపై అంతకాదు ఇంతంటూ చేసిన హడావుడిలో సోలార్‌సిటీ అంశం కూడా తెరమరుగైపోయింది. 2016లో కేంద్ర ప్రభుత్వం దేశంలో 47 పట్టణాలను సోలార్‌ సిటీలుగా అభివృద్ధి చేయడానికి నిర్ణయించింది. మన రాష్ట్రానికి సంబంధించి మొదటిగా విజయవాడను ఎంపిక చేశారు.ఐతే కేంద్ర మంత్రి సీతారామన్‌ సొంత పట్టణం కావడం, మరోవైపు రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి చైర్మన్‌గా కొనసాగుతున్న జస్టిస్‌ గ్రంధి భవానీ ప్రసాద్‌ కూడా ఈ ప్రాంతం వారే కావడంతో నరసాపురం పట్టణాన్ని కూడా సోలార్‌ సిటీగా ఎంపిక చేశారు.

ప్రకటనకు రెండేళ్లు
కేంద్ర మంత్రి నిర్మిలా సీతారామన్‌ నరసాపురం పట్టణాన్ని సోలార్‌ సిటీగా ఎంపిక చేసినట్టు 2016 జనవరి 3న ప్రటించారు. మరుసటి నెల ఫిబ్రవరిలో డీటేల్డ్‌ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ (డీపీఆర్‌) కోసం మునిసిపాలిటీకి రూ.50 లక్షలు మంజూరు చేస్తున్నామని ప్రకటనవచ్చింది. దీంతో వెనువెంటనే పట్టణాన్ని సోలార్‌సిటీగా అభివృద్ధి చేయడానికి కౌన్సిల్‌ తీర్మానించింది. సీతారామన్‌ ఆదేశాలతో హుటాహుటిన నాటి నెట్‌క్యాఫ్‌ ఎండీ (హైదరాబాద్‌) కమలాకరబాబు వచ్చి, మునిసిపల్‌ కార్యాలయంలో సమావేశం కూడా నిర్వహించారు. రాష్ట్రంలో విజయవాడతో పాటుగా నరసాపురం కూడా సోలార్‌సిటీగా రూపాంతరం చెందుతుందని పట్టణ వాసులు సంతోషించారు. ఐతే నేటికీ ఒక పైసా కూడా నిధులు విడుదల చేయలేదు. నెట్‌క్యాఫ్‌ వద్దే ఫైల్‌ పెండింగ్‌లో ఉంది. విజయవాడలో మాత్రం సోలార్‌సిటీ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌ జాప్యాన్ని సీతారామన్‌ దృష్టికి తీసుకెళ్లడంలో స్థానిక ఎమ్మెల్యే, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌లు శ్రద్ధ పెట్టకపోవడం వల్లే అవకాశం చేజారిందనే విమర్శలు ఉన్నాయి.

తరువాత పట్టించుకోలేదు
సోలార్‌ సిటీ డీపీఆర్‌ కోసం రూ.50 లక్షలు మంజూరు చేశామన్నారు. కానీ నిధులు ఫైసా విడుదల కాలేదు. నెట్‌క్యాఫ్‌ అధికారులతో అనేక సార్లు మాట్లాడాం. రేపు మాపన్నారు. కేంద్ర మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లాలని ప్రయత్నించాము వీలు కాలేదు. ఫైల్‌ నెట్‌క్యాఫ్‌ వద్దే పెండింగ్‌లో ఉంది.  – పి.రత్నమాల, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌

మరిన్ని వార్తలు