రిషికేశ్: విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర రిషికేశ్ వద్ద గంగానదిలో పుణ్యస్నానం ఆచరించారు. సూర్యగ్రహణం సందర్భంగా ఆదివారం వేకువజాము నుంచే రిషికేశ్‌లో శారదాపీఠం ఆశ్రమాన్ని ఆనుకుని ఉన్న గంగానదీ తీరానికి చేరుకున్నారు. తన పరివారంతో కలిసి పుణ్యస్నానం ఆచరించారు. పీఠాధిపతులు ఇద్దరూ దండ తర్పణం నిర్వహించారు. అనంతరం వేద విద్యార్ధులతో కలిసి చండీ పారాయణ చేసారు. స్వామి స్వాత్మానందేంద్ర గ్రహణ సమయాన్ని మొత్తం నదీ తీరంలోనే గడిపారు. నదీ జలాల్లో మునిగి ప్రత్యేక జపమాచరించారు. గ్రహణ కాలంలో విశాఖ శారదాపీఠం ఆవరణలోని సకల దేవతా మూర్తుల ఆలయాలను కూడా మూసివేశారు. సూర్య, చంద్ర గ్రహణాలు సంభవించినప్పుడల్లా ఈ తరహా నియమాలను పాటించడం విశాఖ శారదా పీఠానికి ఆనవాయితీగా వస్తోంది.