సంపూర్ణ సూర్యగ్రహణం@ 40 ఏళ్లు

26 Dec, 2019 09:03 IST|Sakshi
16 ఫిబ్రవరి 1980 నాటి  సూర్య గ్రహణం సందర్భంగా వజ్రపుటుంగరం ఆకారం

కంకణాకార సూర్య గ్రహణం నేడు

ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రజలు 

సాక్షి, ఆత్మకూరు: గ్రహణాలకు మానవ జీవితంతో ప్రత్యేక సంబంధం ఉంది. సూర్య, చంద్ర గ్రహణాలను దేశంలో విశిష్టంగా భావించడం, వీటి మంచి, చెడులను విశ్లేషించుకోవడం మన దేశంలో అనవాయితీగా సాగుతోంది. శతాబ్ద కాలంలో (100 ఏళ్లు) 5 లేక 6 గ్రహణాలు రావడం పరిపాటి. అయితే ఈ గ్రహణాల్లో సూర్య గ్రహణానికి తొలి నుంచి అధిక ప్రాధాన్యత సాగుతోంది. సూర్య గ్రహణాలకు అటు ఆధ్యాత్మిక వేత్తలు, ఇటు శాస్త్రజ్ఞులు అధిక ప్రాధాన్యత ఇవ్వడం ఆది ఉంది. అయితే గురువారం కంకణాకార సూర్య గ్రహణం  ఏర్పడనుంది. దీనిని పరిశోధించేందుకు ఇప్పటికే అంతరిక్ష రంగ శాస్త్రవేత్తలు ప్రయోగాలకు సిద్ధమయ్యారు. మన దేశంలో 19వ శతాబ్దంలో (16 ఫిబ్రవరి 1980)లో ఏర్పడిన సంపూర్ణ సూర్య గ్రహణం దాని పరిస్థితులు, దాని ప్రభావం మనుషులు, జంతువులు, పక్షులపైన ఏ మేరకు ప్రభావం చూపింది.. ఇప్పటికీ విశేషంగా చెప్పుకుంటారు. 126 సంవత్సరాల అనంతరం అప్పట్లో (1980లో) సంపూర్ణ సూర్య గ్రహణం మనదేశంలో ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని మహబూబ్‌నగర్, కృష్ణా జిల్లాల్లో విశేషంగా కనిపిస్తుందన్న శాస్త్రజ్ఞుల అంచనాలతో ఆ ప్రాంతాల్లో వందలాది మంది అంతరిక్ష శాస్త్రవేత్తలు ఆ రోజుల్లో పరిశోధనలకు వివిధ రకాల కెమెరాలు, పరికరాలతో మొహరించారంటే గ్రహణ ప్రభావం ఏ విధంగా ఉందో అర్థమవుతుంది. అప్పట్లో సూర్య గ్రహణం సంభవిస్తుందన్న కారణంతో రాష్ట్రంలో పాఠశాలలు, విద్యా సంస్థలకు, ఫ్యాక్టరీలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అప్పటి సంపూర్ణ సూర్య గ్రహణం విశేషాలు ఒక్కసారి పరిశీలిస్తే.

ప్రాణ భీతితో పరుగులు  
అప్పట్లో సంపూర్ణ సూర్య గ్రహణం రోజున నాగాల్యాండ్‌ రాష్ట్రంలోని కోహిమాలో గ్రహణ సమయంలో భూ కంపం రానుందన్న పుకార్లు వెల్లడవడంతో ఆ ప్రాంతంలో ప్రజలు ప్రాణ భీతితో పరుగులు పెట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారిలోని అనుమానాలను నివృత్తి చేసేందుకు ఎంతగా ప్రయత్నం చేసినా ప్రజలు భయాందోళనలతో పరుగులు పెట్టినట్లు ఆ నాటి దినపత్రికల్లో వార్తలు వెలువడ్డాయి.     

మిట్ట మధ్యాహ్నం అసుర సంధ్య      
నాటి సంపూర్ణ సూర్య గ్రహణంతో మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో దేశంలో చీకట్లు అలముకుని అసుర సంధ్య వేళలా కనిపించింది. ఆ సమయంలో పొలాలకు వెళ్లిన పశువులు సైతం మేత తింటూ మధ్యలోనే ఇళ్లకు మళ్లడం నాటి విశేషం.

గ్రహణంతో లభించిన కంటి చూపు  
 సాధారణంగా సూర్య గ్రహణాన్ని ప్రత్యక్షంగా చూడరాదని శాస్త్రవేత్తలు పలు ముందస్తు జాగ్రత్తలు ప్రకటించారు. ఫిల్మ్‌ల ద్వారా, పారదర్శక అద్దాలకు నల్లటి మసి పూసి వాటి ద్వారా చూడాలని హెచ్చరికలు జారీ చేశారు. అయితే అప్పట్లో ఏర్పడిన సంపూర్ణ సూర్య గ్రహణాన్ని అప్పటి కడప జిల్లా మాజీ మున్సిపల్‌ కౌన్సిలర్‌ అప్పటికే క్యాటరాక్ట్‌ వల్ల కంటి చూపు కోల్పోయి మదనపడుతూ నేరుగానే గ్రహణ సమయంలో సూర్యుడిని చూశాడు. అనంతరం కొద్ది సేపటికే అతని కంటి చూపు కొద్దిగా మెరుగు పడి సమీపంలోని వస్తువులు స్పష్టంగా కనిపించేలా చూపు దక్కిందని వెల్లడించాడు. ఈ విషయం సైతం అప్పట్లో దినపత్రికల్లో ప్రముఖంగా ప్రచురితమైంది.

జంతువులపై ప్రభావం  
అప్పటి సూర్య గ్రహణం జంతువులు, పక్షులపై విశేష ప్రభావం చూపింది. మధ్యాహ్నం 12:20 నుంచి 3:30 గంటల వరకు ఈ గ్రహణం సంభవించడంతో గ్రహణ సమయంలో పూర్తిగా చీకట్లు అలముకున్నాయి. దీంతో పక్షులు తమ గూళ్లను చేరుకోవడం శాస్త్రజ్ఞులు పరిశీలించారు. కొన్ని జంతువులు గ్రహణ సమయంలో నిద్రకు ఉపక్రమించాయి. గ్రహణం వీడిన అనంతరం జంతువులు పిచ్చి పిచ్చిగా అటూ ఇటూ తిరిగినట్లు, అప్పట్లో కుందేళ్లు, ఎలుకలపై ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్తలు వెల్లడించారు. వారి పరిశోధనల్లో గ్రహణ సమయంలో జంతువుల నరాలను ‘ఆసిల్లో స్కోప్‌’ ద్వారా పరిశీలించారు. గ్రహణ అనంతరం పరిశీలించగా వాటి నరాల్లో ఉద్రిక్తత అధికమైందని, దీంతో అవి పిచ్చిపిచ్చిగా అటూ ఇటూ తిరగడం గమనించినట్లు అప్పట్లో శాస్త్రజ్ఞులు వెల్లడించారు. ఆహారం కోసం వెళ్లిన పక్షులు గ్రహణ సమయంలో చీకట్లు పడ్డాయని గ్రహించి మధ్యాహ్న సమయానికే వాటి గూళ్లు చేరుకున్నాయని, అనంతరం 3:30 గంటలకు గ్రహణం వీడి పోవడంతో రెక్కలు అల్లల్లాడిస్తూ దిక్కు తోచని విధంగా ప్రవర్తించాయని శాస్త్రజ్ఞులు అప్పట్లో పేరుకున్నారు. 

సూర్య చంద్రులు ఒకే సారి  
అప్పట్లో ఏర్పడిన సంపూర్ణ సూర్య గ్రహణం సమయంలో గ్రహణంలో చిక్కుకున్న సూర్యుడు ఓ వైపు, చీకట్లు అలముకోవడంతో చంద్రుడు మరో వైపు ఒకే సారి ఆకాశంలో దేశ ప్రజలకు కనిపించడం నాటి విశేషం. పలు ప్రాంతాల్లో సూర్య చంద్రులను ఒకే సారి చూసిన ప్రజలు సంబరమాశ్చర్యాలకు గురయ్యారని నాటి వృద్ధులు తెలిపారు. ఏది ఏమైనా సూర్య గ్రహణం గురువారం సంభవించనున్న నేపథ్యంలో చూసేందుకు పలు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రత్యక్షంగా చూడరాదని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. నేడు ఏర్పడనున్న కంకణాకార సూర్య గ్రహణాన్ని మరి కొద్ది సేపట్లో చూద్దామా మరీ.

మరిన్ని వార్తలు