ఎన్పీడీసీఎల్‌లో సోలార్ వెలుగులు

1 Jan, 2014 02:46 IST|Sakshi

వరంగల్, న్యూస్‌లైన్ :  ఎస్పీడీ సీఎల్ కార్యాలయంలో సోలార్ వెలుగులు ప్రారంభమయ్యాయని సీఎండీ కార్తికేయమిశ్రా తెలిపారు. ఎన్పీడీసీఎల్ భవన్‌పైన రూ.77 లక్షల వ్యయంతో 80 కిలోవాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టును ఏర్పాటు చేసి ఉత్పత్తి ప్రారంభించామన్నారు. విద్యుత్ భవన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డిసెంబర్ 22 నుంచి మంగళవారం నాటికి 2804 యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశామన్నారు. రోజుకు 300 యూనిట్లను ఉత్పత్తి చేస్తున్నామని, ప్రస్తుతం కార్యాలయానికి సోలార్ విద్యుత్‌ను వినియోగిస్తున్నట్లు సీఎండీ చెప్పారు. కార్యాలయ సెలవు రోజుల్లో ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌ను గ్రిడ్‌కు పంపిస్తున్నట్లు వివరించారు.

 విద్యుత్ వినియోగదారులు ఈ ప్రాజెక్టు పెట్టాలనుకుంటే సంబంధిత ఆపరేషన్ డీఈ కార్యాలయాల్లో సంప్రదించాలని సూచించారు. దరఖాస్తు పెట్టుకున్న 15 రోజుల వ్యవధిలో ప్రాజెక్టు పూర్తి అవుతుందని వివరించారు. 3 కిలోవాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టు పరిధి వరకు ప్రభుత్వం 50 శాతం సబ్సిడీ ఇస్తుందన్నారు. సోలార్ పవర్ ప్రాజెక్టుతోపాటు నెట్ మీటరింగ్‌కు కూడా సబ్సిడీ ఉంటుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం సోలార్ ప్రాజెక్టు నుంచి నెట్ మీటరింగ్ ఏర్పాటు చేస్తున్నామని, నాలుగైదు రోజుల్లో పూర్తి అవుతుందన్నారు. 10 రోజుల వ్యవధిలో నెట్ మీటరింగ్ విధానాన్ని కంపెనీ కార్యాలయంలో ప్రజలకు చూపిస్తామన్నారు. ఈ ఏడాదిలో ఈ కొత్త ప్రాజెక్టును ప్రజల్లోకి తీసుకుపోయి విసృ్తత ప్రచారం కల్పిస్తామన్నారు.

 సోలార్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు తోడ్పాటునందిస్తామని సీఎండీ కార్తికేయమిశ్రా అన్నారు. ఇప్పటి వరకు సోలార్‌తో ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌కు యూనిట్‌కు రూ. 3.50 చొప్పున చెల్లిస్తున్నామని, ధరలు పెరిగితే వాటి ప్రకారమే ఉత్పత్తిదారులకు చెల్లిస్తామన్నారు. ఇళ్లపై కొంత స్థలం ఉంటే చాలని, సోలార్ పవర్ ప్రాజెక్టు పెట్టుకోవచ్చని సీఎండీ సూచించారు. సమావేశంలో ఎన్పీడీసీఎల్ ప్రాజెక్టు విభాగం డెరైక్టర్ బి. వెంకటేశ్వర్‌రావు, కంపెనీ సెక్రెటరీ వెంకటేశం ఉన్నారు.

మరిన్ని వార్తలు