కావలి కాలువపై సోలార్ ప్లాంట్ ?

14 Sep, 2014 02:30 IST|Sakshi
కావలి కాలువపై సోలార్ ప్లాంట్ ?
సాక్షి, నెల్లూరు: సౌర విద్యుత్ ఉత్పత్తే లక్ష్యంగా అనువైన ప్రాంతాల అన్వేషణలో ప్రభుత్వం ఉంది. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండే రాయలసీమతో పాటు ఇరిగేషన్ ఆధారిత ప్రాంతాల్లో సైతం గుజరాత్ తరహాలో సాగునీటి కాలువలపై ప్లాంట్లు ఏర్పాటు చేసే యోచనలో సర్కారు ఉంది. అందులో భాగంగా జిల్లాలోని కావలి కాలువపై దృష్టిపెట్టారు. రాష్ట్రంలో 4,500 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తికి వీలుగా ఏపీ జెన్‌కో, ఎన్‌టీపీసీ, నెడ్‌క్యాప్‌లు సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాయి.  అనంతపురం, కర్నూలు, వైఎస్సార్ కడప, గుంటూరు తదితర జిల్లాలతో పాటు అన్ని జిల్లాల్లో  సౌరవిద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు అనువైన కాలువలను ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు పరిశీలిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో సైతం అధికారుల అన్వేషణ కొనసాగుతోంది. కావలి కాలువ సోలార్ ప్లాంటు ఏర్పాటుకు అనువైన ప్రాంతమని అధికారులు గుర్తించినట్లు సమాచారం. సంగం ఆనకట్ట వద్ద నుంచి దగదర్తి, బోగోలు, కావలి టౌన్, కావలి రూరల్ ప్రాంతాల మీదుగా ప్రకాశం జిల్లా సరిహద్దు వరకు 68 కిలోమీటర్ల పొడవున ఈ కాలువ ఉంది. ఇప్పటికే కాలువను పరిశీలించి నివేదిక సమర్పించాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. జిల్లా అధికారులు ఈ బాధ్యతను నీటిపారుదల ఈఈకి అప్పగించారు. కావలి కాలువతో పాటు సోమశిల -కండలేరు, తెలుగుగంగ కాలువ లను అధికారులు పరిశీలించనున్నారు. అనంతరం ప్రభుత్వానికి నివేదిక పంపనున్నట్లు ఇరిగేషన్ అధికారులు  ‘సాక్షి’కి తెలిపారు.
 
మరిన్ని వార్తలు