మహానేతకు ఘన నివాళులు

9 Jul, 2017 01:31 IST|Sakshi
మహానేతకు ఘన నివాళులు
- సమాధి ఘాట్‌ వద్ద పుష్పాంజలి ఘటించిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 
ఇడుపులపాయలో నివాళులర్పించిన వైఎస్‌ కుటుంబ సభ్యులు 
సమాధి ఘాట్‌ వద్ద ప్రత్యేక ప్రార్థనలు 
 
సాక్షి, కడప: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఆయన తనయుడు, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం వైఎస్సార్‌ జిల్లా వేంపల్లె మండలం ఇడుపులపాయలోని సమాధి ఘాట్‌ వద్ద ఘనంగా నివాళులర్పించారు. సమాధిపై పుష్పాలను ఉంచి అంజలి ఘటించారు. కొద్దిసేపు తండ్రి సమాధి వద్దనే మౌనంగా గడిపారు. జగన్‌తోపాటు ఆయన సతీమణి వైఎస్‌ భారతీరెడ్డి, వారి పిల్లలు హర్ష, వర్ష, వైఎస్సార్‌ సతీమణి, పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ, కుమార్తె షర్మిల, అల్లుడు అనిల్‌కుమార్, వారి పిల్లలు రాజారెడ్డి, అంజలి, దివంగత వైఎస్‌ జార్జిరెడ్డి సతీమణి వైఎస్‌ భారతమ్మ, వైఎస్సార్‌ సోదరి విమలమ్మ, వైఎస్‌ జగన్‌ మామ డాక్టర్‌ ఈసీ గంగిరెడ్డి, ఆయన సతీమణి ఈసీ సుగుణమ్మ, కడప, రాజంపేట ఎంపీలు వైఎస్‌ అవినాశ్‌రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గడికోట మోహన్‌రెడ్డి, రాయచోటి వైఎస్సార్‌సీపీ నేతలు మండ్లిపల్లె రాంప్రసాద్‌రెడ్డి, వైఎస్‌ కొండారెడ్డి తదితరులు సమాధి ఘాట్‌ వద్ద నివాళులర్పించారు.

మహానేత సమాధిపై ప్రతి ఒక్కరూ పుష్పగుచ్ఛాలు ఉంచారు. అందరూ సమాధి ఘాట్‌ చుట్టూ కూర్చొని వైఎస్సార్‌ను తలుచుకుంటూ మౌనంగా ఉండిపోయారు. శనివారం ఉదయాన్నే సమాధి ఘాట్‌కు చేరుకున్న వైఎస్‌ కుటుంబ సభ్యులు అక్కడ నివాళులర్పించిన అనంతరం ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్‌ విజయమ్మ భావోద్వేగానికి లోనయ్యారు. ప్రార్థనల అనంతరం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బయటకు వస్తున్న సమయంలో పార్టీ కార్యకర్తలు, వైఎస్సార్‌ అభిమానులు వైఎస్‌ జగన్‌ నాయకత్వం వర్ధిల్లాలి.. జై జగన్‌.. జైజై జగన్‌.. వైఎస్సార్‌ అమర్‌ రహే అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. అనంతరం వైఎస్‌ జగన్‌తోపాటు వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ భారతీరెడ్డి, షర్మిల తదితరులు సమీపంలో ఉన్న వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి, మైనపు ఒత్తులు వెలిగించి నివాళులర్పించారు. సమాధి ఘాట్‌ వద్దకు భారీగా తరలివచ్చిన అందరితోనూ ఆప్యాయంగా మాట్లాడుతూ, వారితో కరచాలనం చేస్తూ వైఎస్‌ జగన్‌ ముందుకు కదిలారు.