స్థానిక సచివాలయాల ద్వారా 33 లక్షల వినతుల పరిష్కారం

27 Jun, 2020 04:51 IST|Sakshi

గ్రామ, వార్డు సచివాలయ వ్యవహారాల సలహాదారు ధనుంజయ్‌రెడ్డి  

సాక్షి, అమరావతి:  గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఇప్పటివరకు 33 లక్షల వినతులను పరిష్కరించారని గ్రామ, వార్డు సచివాలయాలు, స్పందన వ్యవహారాలలో ముఖ్యమంత్రి సలహాదారు ఆర్‌.ధనుంజయ్‌రెడ్డి తెలిపారు. సచివాలయాల వ్యవహారాల శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్, కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌ జీఎస్‌ నవీన్‌కుమార్‌తో కలిసి శుక్రవారం ఆయన రాష్ట్రంలోని 15,004 గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులతో టెలీ కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. ధనుంజయ్‌రెడ్డి ఏమన్నారంటే.. 

► స్థానిక సచివాలయాల ద్వారా ప్రభుత్వం అందజేస్తున్న 540 రకాల సేవలపై ప్రజలందరికీ అవగాహన కల్పించి మరింత మంది ఈ సేవలను వినియోగించుకునేందుకు తోడ్పడాలి.  
► ప్రజల నుంచి నేరుగా అందే వినతులతో పాటు వలంటీర్ల ద్వారా అందే వినతుల పరిష్కారం విషయంలో సచివాలయాల సిబ్బంది అలసత్వం చూపవద్దు.  
► సీఎం వైఎస్‌ జగన్‌ సూచించిన విధంగా నిర్ణీత గడువులోగానే వినతుల పరిష్కారం పూర్తవ్వాలి. సేవల్లో ఆలస్యమైతే సంబంధీకులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అందుకు పరిహారం కూడా చెల్లించాల్సి ఉంటుంది.  
► సీఎం జగన్‌మోహన్‌రెడ్డి గ్రామాల పర్యటనకు వచ్చినప్పుడు సచివాలయాల ద్వారా అందజేసే సేవల విషయంలో ఎలాంటి ఫిర్యాదులు వచ్చే పరిస్థితి రాకూడదు. 
► ప్రతి వార్డు, గ్రామ సచివాలయంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వివరాలు, వాటికి అర్హత, దరఖాస్తు చేసుకునే విధానం వంటి సమాచారం తెలియజేస్తూ నోటీసు బోర్డులు తప్పనిసరిగా ఉండాలి. 
► ప్రభుత్వానికి సంబంధించి ప్రజలకు ఉపయోగపడే అన్ని ముఖ్యమైన ఫోన్‌ నంబర్ల జాబితా, సంక్షేమ కార్యక్రమాల అమలు క్యాలెండర్, సచివాలయాల ద్వారా అందుబాటులో ఉన్న సేవల వివరాలతో కూడిన డిస్‌ప్లే బోర్డులు ఉంచాలి.  

మరిన్ని వార్తలు