ఆస్పత్రి సమస్యలు పరిష్కరించండి

22 Dec, 2013 02:51 IST|Sakshi
మెయిన్‌రోడ్ (కాకినాడ), న్యూస్‌లైన్ :కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో శనివారం ఆస్పత్రి అభివృద్ధి సంఘ సమావేశం ఆస్పత్రి పీడియాట్రిక్ సమావేశపు హాల్‌లో కలెక్టర్ నీతూ ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఏప్రిల్ 1 నుంచి నవంబర్ వరకు జరిగిన పద్దులు, ఖర్చుల కు సంబంధించిన సొసైటీ ఆదాయ  వివరాలను, వివిధ అభివృద్ధి పనులను ఆస్పత్రి సూపరింటెండెంట్ పి.వెంకటబుద్ద సభ్యులకు వివరించారు. రూ. 35,78,961 హెచ్‌డీఎస్ రాబడులు కాగా, రూ. 35,10,541 మేరకు జరిగిన ఖర్చులను వివరించారు.కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, పిఠాపురం ఎమ్మెల్యే వంగా గీత మాట్లాడుతూ ఆస్పత్రిలో ఉన్న 42 పేమెంట్ రూములను వినియోగంలోకి తేవాలని, కొత్తగా మంజూరైన మదర్ అండ్ చైల్డ్ కేర్ సెంటర్ కోసం స్థలం గుర్తించి వెంటనే నిర్మాణం పనులు  చేపట్టాలని కోరారు. ఈ బ్లాక్‌ను విడిగా ప్రత్యేక స్థలంలో నిర్మించాలని కోరారు.  
 
 ఇవీ సమస్యలు..
 ఆస్పత్రికి చెందిన పలువురు ఉద్యోగులు ఆస్పత్రిలో ఉన్న సమస్యలను కలెక్టర్ దృష్టికి తెచ్చారు. జిల్లా సమాచార చట్టం సలహా కమిటీ సభ్యులు గేదెల శ్రీనివాస్ మాట్లాడుతూ ఊపిరి తిత్తుల వార్డులు పాతబడటంతో ఆయా వార్డుల్లో మోకాలిలోతు వర్షపు నీరు నిలుస్తుందన్నారు. గతేడాది జరిగిన హెచ్‌డీఎస్ సమావేశంలో జి+8 బిల్డింగ్ నిర్మించడానికి అప్రూవల్ అయినా నేటికీ భవన నిర్మాణానికి సంబంధించిన నిధులు విడుదల కాలేదన్నా రు. అత్యవసర విభాగం వద్ద గతంలో నిర్వహించిన రక్త పరీక్షల గది మూసివేయడంతో వెంటనే రోగులకు రక్త పరీ క్షలు నిర్వహించడానికి వీలుకావడం లేదన్నారు.
 
 జీవో 3 అమలు చేయండి
 అనంతరం ఏపీ మెడికల్ వైద్య ఉద్యోగ సంఘం కార్యదర్శి, జిల్లా జేఎసీ చైర్మన్ బూరిగ ఆశీర్వాదం, సొసైటీ సభ్యులు బొడ్డు వెంకటరమణ తదితరులు మాట్లాడుతూ ఉద్యోగులు ఎదుర్కుంటున్న సమస్యలు పరిష్కరించాలని, జీవో నంబర్ 3 విడుదలై మూడేళ్లు గడచినా నేటికీ అమలు చేయడం లేదన్నారు. ఖాళీగా ఉన్న ఎంఎన్‌వో, ఎఫ్‌ఎన్‌వో, రేడియో థెరపీ టెక్నీషియన్, ఈసీజీ టెక్నీషియన్, థియేటర్ అటెండెంట్ తదితర ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరారు. ఆస్పత్రికి చెందిన వివిధ విభాగాల హెచ్‌ఓడీలు, ఆర్‌ఎంసీ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ ఆర్.మహాలక్ష్మి, రోటరీ ప్రతినిధి డాక్టర్ మూర్తి హాజరయ్యారు.
 
మరిన్ని వార్తలు