కొన్ని పాటలు కారు డీజిల్ కోసమే

30 Jan, 2014 01:45 IST|Sakshi
కొన్ని పాటలు కారు డీజిల్ కోసమే

 సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ
 

‘‘సినీ పరిశ్రమలో రెండు రకాల పాటలు రాస్తాం. కారు డీజిల్ కోసం కొన్ని ఇష్టం లేని పాటలు రాయకతప్పదు. వాటిని పెన్నుతోనే రాస్తా. సమాజం కోసం మంచి పాటలు రాయడంలో తృప్తి ఉంటుంది. వాటిని మాత్రం గుండెతో రాస్తా. పాలకులు తెలుగును రాష్ట్ర అధికార భాషగా చేయకపోవడం మన దౌర్భాగ్యం’’ అని ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ అన్నారు. గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో జరుగుతున్న పదిహేనేళ్ల ‘స్పెషల్ జెక్‌ఫెస్ట్- 14’ వేడుకల్లో ఆయన బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులకు ఇంటర్వ్యూ ఇచ్చారు.
 
 ప్రశ్న : రాష్ట్రంలో తెలుగు అమలుపై మీ అభిప్రాయం?
 జవాబు : ఇద్దరు తెలుగోళ్లు కలిస్తే ఇంగ్లిషులో మాట్లాడుతున్నారు. చదువుకున్నవారు తెలుగు మాట్లాడటం నామోషీగా భావిస్తున్నారు. పాలకులు కూడా ఆంగ్లంలోనే ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అయితే ఇద్దరు తమిళులు కలిస్తే కచ్చితంగా తమిళంలో మాట్లాడకపోతే చిన్నతనంగా భావిస్తారు.
 
 ప్ర: తెలుగు విస్తరణకు తీసుకోవాల్సిన చర్యలేమిటి?
 జ : తెలుగును కంప్యూటరీకరిస్తే ప్రపంచ భాషగా వర్ధిల్లుతుంది. కంప్యూటకరణతోనే 365 అక్షరాలున్న చైనా భాష, 26 అక్షరాలున్న ఇంగ్లిషు ప్రపంచ ఖ్యాతి పొందినప్పుడు 56 అక్షరాల తెలుగును ప్రపంచ వ్యాప్తి ఎందుకు చేయలేం.
 
 ప్ర: మీ పాటలకు ప్రేరణ?
 జ : మా నాన్న హనుమంతే. ఆయన తెలంగాణ సాయుధ పోరాట యోధుడు. స్వాతంత్య్ర సమరయోధుడు కూడా. ఆయన అడుగుజాడల్లోనే మా అమ్మ జానకమ్మ ఉద్యమంలో పనిచేశారు. 1951లో తెలంగాణ సాయుధ పోరాటంలో నా తల్లిదండ్రులు సహా 4 వేల మంది ప్రాణాలు అర్పించారు. ఆ పోరాటం స్ఫూర్తితోనే నా పాటల్లో ఉద్యమం, చైతన్యం పుట్టాయి.
 
 ప్ర: ఏ సినిమాకు తొలిపాట రాశారు?
 జ : 1994లో ‘నమస్తే అన్న’ సినిమాకు ‘గరం గరం పోరీ’ పాటరాశా. ఇప్పటివరకు 700 సినిమాలకు 1,700 పాటలు రాశా. త్వరలో వచ్చే బాహుబలి, మనసును మాయ చేయకే తదితర సినిమాల్లో రాస్తున్నా.
 
 ప్ర: కొత్త సినిమాల పాటల్లో సాహిత్యం పరిస్థితి?
 జ : ప్రస్తుత జనరేషన్‌ను బట్టే సినిమా పాటలు ఉంటున్నాయి. ఏది వదిలేయాలి, ఏది స్వీకరించాలనేది ప్రేక్షకుల నిర్ణయం.
 
 ప్ర: ఏఏ సినిమాల్లో నటించారు?
 జ : శ్రీహరి నటించిన కుబుసంలో నటించా. కొత్తగా వస్తున్న ఆయుధం, అదీ లెక్క సినిమాల్లో నటిస్తున్నా.
 
 ప్ర: మీ లక్ష్యం ఏమిటి?
 జ : పరిశ్రమకు వచ్చిన మూడేళ్లకు నంది, ఐదేళ్లకే జాతీయ అవార్డు తీసుకోవాలనేది నా లక్ష్యం. నంది అవార్డు పొందిన రెండేళ్లకు జాతీయ అవార్డు  అందుకున్నా. శ్రీశ్రీ, వేటూరి తర్వాత జాతీయ అవార్డు అందుకోవడం గర్వకారణంగా ఉంది.
 
 ప్ర: సినీ పరిశ్రమలో మీ టర్నింగ్ పాయింట్
 జ : ఒసేయ్ రాములమ్మ. దాసరి వలనే నాకు పునర్జన్మ వచ్చింది. ఆ సినిమాల్లోని పాటల్లో పల్లెదనం, ఆవేశం, విప్లవం నా పాటలకు ప్రాణం పోశాయి. పాపులర్ అయ్యాను.
 
 ప్ర: ప్రైవేట్‌గా ఎన్ని పాటలు రాశారు?
 జ : రెండు వేల పాటలు రాశా. నాటికలు, నవలలు కూడా రాశా. 1985లో వెలుగురేఖలు నవలకు విశాలాంధ్ర వారు స్టేట్ ప్రైజ్ ఇచ్చారు. త్వరలో శ్రమపై ఒక కావ్యాన్ని విడుదల చేస్తున్నా.
 

మరిన్ని వార్తలు