మంత్రి సోమిరెడ్డికి ఝలక్‌

26 Jul, 2018 10:29 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: అధికార తెలుగుదేశం పార్టీ ఆత్మకూరు ఇన్‌చార్జి వ్యవహారంలో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. సోమిరెడ్డి తన అనుచరుడు కన్నబాబును ఇన్‌చార్జిగా చేయాలని గట్టిగా ప్రయత్నించారు. అయితే పార్టీ అధిష్టానం తాత్కాలిక ఇన్‌చార్జిగా ఆదాల ప్రభాకర్‌రెడ్డి నియమించింది. ఇప్పటి వరకూ ఇక్కడ ఇన్‌చార్జిగా ఉన్న మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు. దీంతో నియోజకవర్గ ఇన్‌చార్జి కోసం నేతల మధ్య విభేదాలు కొనసాగాయి. జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు తమ అనుచరులకు ఇన్‌చార్జి పదవి కట్టబెట్టాలని పోటీ పడ్డారు. అయితే అందుకు పూర్తి భిన్నంగా నెల్లూరు పార్లమెంట్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న ఆదాల ప్రభాకరెడ్డిని నియమిస్తూ పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. ఆదాల ప్రభాకర్‌రెడ్డికి పూర్తిగా నియోజకవర్గం కొత్త కావటంతో పార్టీ అంతర్గత విషయాల్లో సమన్వయం చేసుకోవాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్రను ఆదేశిచింది.

ఈ క్రమంలో సోమవారం మంత్రులతో కలిసి ఆదాల ఆత్మకూరు నియోజకవర్గ కేంద్రంలో సమావేశం నిర్వహించనున్నారు. గత నెల రోజులుగా అధికార పార్టీలో ఆత్మకూరు నియోజకవర్గ వ్యవహారం రగడ కొనసాగుతుంది. ముఖ్యంగా గతంలో పోటీచేసి ఓడిపోయిన కన్నబాబుకు ఇన్‌చార్జి పదవి ఇవ్వాలని మంత్రి సోమిరెడ్డి బలంగా ప్రయత్నించారు. డీసీసీ బ్యాంకు చైర్మన్‌ మెట్టకూరు ధనుంజయరెడ్డికి ఇప్పించాలని ఒక దశలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర ప్రయత్నించి చివరికి ఆయన కూడా కన్నబాబుకే మద్దతు పలికారు. మరికొందరు పదవి ఆశించారు.

ఈ క్రమంలో ఆత్మకూరు వ్యవహారంపై గత శనివారం పార్టీ కార్యాలయంలో జరిగిన సమన్వయకమిటీ సమావేశంలో తీవ్ర చర్చ జరిగింది. ఆత్మకూరు ఇన్‌చార్జిని కాకుండా ఐదుగురు సభ్యులతో సమన్వయకమిటీ ఏర్పాటు చేయాలని భావించారు. అయితే దీనికి నిరసనగా డీసీసీ బ్యాంకు చైర్మన్‌ ధనుంజయరెడ్డి గైర్హాజరు కావటం, హాజరైన కన్నబాబు ఆయన వర్గీయులు అభ్యంతరం వ్యక్తం చేయటంతో పార్టీకి కొంత తలనొప్పిగా మారింది. ఈ క్రమంలో నేతల మధ్య వివాదం సాగుతున్న క్రమంలో చివరకు ఆదాల ప్రభాకర్‌రెడ్డిని తాత్కాలిక ఇన్‌చార్జిగా నియమించారు.
జిల్లా అధ్యక్షుడిపై పరిశీలకుడు ఫిర్యాదు
పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్రపై పార్టీ జిల్లా పరిశీలకులు ఎరిక్సన్‌ బాబు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. పార్టీ అంతర్గత విషయాలు చర్చించటానికి, ఇతర పార్టీ కార్యక్రమాల్లో తనకు ప్రాధాన్యం ఇవ్వటం లేదని ఎరిక్సన్‌ బాబు పార్టీ రాష్ట్ర కార్యాలయానికి ఫిర్యాదు చేశారు.    

మరిన్ని వార్తలు