ఎమ్మెల్సీలుగా సోమిరెడ్డి, బీద

14 Jun, 2015 01:34 IST|Sakshi
ఎమ్మెల్సీలుగా సోమిరెడ్డి, బీద

ఆమోదం తెలిపిన గవర్నర్

 సాక్షి ప్రతినిధి, నెల్లూరు : ఎమ్మెల్సీలుగా టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర పేర్లను గవర్నర్ ఆమోదించారు. గవర్నర్ ఆమోదంతో పాటు ఎన్నికల సంఘం సైతం పచ్చజెండా ఊపడంతో జిల్లా నుంచి ఇద్దరు టీడీపీ నాయకులు ఎమ్మెల్సీలుగా ఎంపికయ్యారు. మునుపెన్నడూ లేని విధంగా ఇద్దర్ని ఎమ్మెల్సీలుగా ప్రకటించడం విశేషం. శాసనమండలి చైర్మన్ సమక్షంలో రెండు, మూడు రోజుల్లో సోమిరెడ్డి, బీద మండలి సభ్యులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

రెడ్డి, బీసీ సామాజికవర్గాలకు చెందిన ఇద్దరు నేతలకు ఎమ్మెల్సీలుగా అవకాశం రావడం ఇదే మొదటి సారి. జిల్లా నుంచి ఇద్దరికి ఎమ్మెల్సీలుగా అవకాశం రావడం టీడీపీ శ్రేణులు, నాయకుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా, జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉంది. గత ఎన్నికల్లో ఓటమిపాలైనా పార్టీ అధినేత ఇచ్చిన హామీ మేరకు ఆయనకు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారు. దీంతో మొదటిసారిగా ఆయన శాసనమండలికి వెళ్లనున్నారు.

20 ఏళ్లుగా టీడీపీలో విస్తృత సేవలందించిన బీద రవిచంద్ర మొట్టమొదటిసారిగా పెద్దల సభకు ఎంపికయ్యారు. రెండుసార్లు ఎమ్మెల్యే టికెట్ కోసం యత్నించినా, ఆయనకు అవకాశం దక్కలేదు. బీద సేవలను గుర్తించి మొదటిసారిగా చట్టసభలకు ఎంపిక చేయడంతో ఆయన వర్గీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు