భూవివాదం కేసులో సోమిరెడ్డికి సమన్లు

7 Sep, 2019 09:36 IST|Sakshi

సాక్షి, వెంకటాచలం(నెల్లూరు): వెంకటాచలం మండలంలో భూవివాదం కేసులో  మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి వెంకటాచలం ఎస్సై షేక్‌ కరీముల్లా శుక్రవారం సాయంత్రం సమన్లు అందజేశారు. వెంకటాచలం మండలం ఇడిమేపల్లి రెవెన్యూ పరిధిలో సర్వే నంబరు 58–3లోని 2.41ఎకరాల భూమిని ఫోర్జరీ డాక్యుమెంట్లతో ఇతరులకు అమ్మేసిన విషయంపై కోర్టు ఆదేశాలతో ఏ1 ముద్దాయిగా సోమిరెడ్డిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి విలువైన ఇతరుల భూమిని అమ్మేసిన కేసుకు సంబంధించి గత నెల 31వ తేదీన వెంకటాచలం పోలీసులు ఇడిమేపల్లికి వెళ్లి విచారణ చేపట్టారు.

ఈ నెల మూడో తేదీన నెల్లూరు రూరల్‌ సీఐ రామకృష్ణ  సోమిరెడ్డికి సమన్లు జారీ చేసేందుకు అల్లీపురంలోని ఆయన నివాసానికి వెళ్లారు. ఆయన లేక పోవడంతో వెనక్కు వచ్చేశారు. అయితే శుక్రవారం సాయంత్రం వెంకటాచలం ఎస్సై షేక్‌ కరీముల్లా అల్లీపురంలోని సోమిరెడ్డి నివాసానికి వెళ్లి ఆయనకు రెండు సమన్లు జారీ చేశారు. ఇడిమేపల్లి భూవివాదం కేసుకు సంబంధించి విచారణాధికారి సీఐ రామకృష్ణ వద్దకు హాజరుకావాలని ఒక సమను, భూవిదాదం కేసులో మీవద్ద ఉన్న డాక్యుమెంట్లను అందజేయాలని మరో సమను అందజేసినట్లు ఎస్సై తెలిపారు. అల్లీపురంలోని సోమిరెడ్డి నివాసానికి పోలీసులు వెళ్లడంతో సోమిరెడ్డిని అరెస్ట్‌ చేస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. పోలీసులు సమన్లు జారీ చేయడంతో ఎప్పడు ఏం జరుగుతుందోనని జిల్లాలో చర్చానీయాంశమైంది.  ఇది చదవండి : నమ్మితే నట్టేట ముంచారు

మరిన్ని వార్తలు