సీఎం సభలకు  బస్సుల కోసం రూ.225 కోట్లా?

14 May, 2019 06:46 IST|Sakshi

బకాయిలు చెల్లించకపోయినా బస్సుల ఏర్పాటు ఎందుకు?

ఆర్టీసీ ఎండీకి బీజేపీ నేత సోము వీర్రాజు లేఖ

సాక్షి, అమరావతి: ఆర్టీసీ అప్పులు, ఆస్తులు, నష్టాలు, లీజుల కేటాయింపుపై చర్చించేందుకు వెంటనే అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన ఆర్టీసీ ఎండీకి సోమవారం లేఖ రాశారు. ఆర్టీసీ మాజీ అధికారులు, మేధావులు, ప్రయాణీకుల సంఘాలను ఆ సమావేశానికి ఆహ్వానించాలని కోరారు. సీఎం సభల కోసం ఏర్పాటు చేసిన బస్సులకు సంబంధించి దాదాపు రూ.225 కోట్ల బకాయిల రూపంలో ప్రభుత్వం చెల్లించాల్సి ఉందన్నారు.

అయినా చంద్రబాబు ధర్మ పోరాట దీక్షలతోపాటు టీడీపీ సమావేశాలకు డ్వాక్రా మహిళలను తరలించడానికి, పోలవరం ప్రాజెక్టు సందర్శనకు డబ్బులు చెల్లించకపోయినా ఆర్టీసీ యాజమాన్యం బస్సులు ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. పెద్ద మొత్తంలో ఉన్న బకాయిలను వసూలు చేయడంలో ఆర్టీసీ ఎందుకు నిర్లక్ష్యంగా, నిర్లిప్తంగా వ్యవహరిస్తోందో అర్ధం కావడం లేదన్నారు. ఈ భారాన్ని తగ్గించుకునేందుకు ఆర్టీసీ చార్జీలు పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తోందని దుయ్యబట్టారు. ప్రస్తుత పరిస్థితుల్లో సామాన్యులు చార్జీల పెంపును భరించే స్థితిలో లేరని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు