అంతులేని అవినీతి

22 Jan, 2019 07:59 IST|Sakshi
గడ్కరీని సన్మానిస్తున్న బీజేపీ మండల అధ్యక్షుడు నేరెళ్ల పెదబాబు

కాంగ్రెస్‌పై బీజేపీ నేత సోము వీర్రాజు ధ్వజం

ఎన్‌హెచ్‌ విస్తరణ పనులకు కేంద్ర మంత్రి గడ్కరీ శంకుస్థాపన

ఆకివీడులో బహిరంగ సభ

పశ్చిమగోదావరి, ఆకివీడు: అవినీతి కాంగ్రెస్‌ లక్షల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసిందని బీజేపీ సీనియర్‌ నాయకుడు సోము వీర్రాజు ఆరోపించారు. పామర్రు–ఆకివీడు జాతీయ రహదారి విస్తరణ పనులకు ఆకివీడు జెడ్పీ హైస్కూల్‌ ఆవరణలో కేంద్ర ఉపరితల, జల వనరులు, రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా జరిగిన సభలో సోము వీర్రాజు మాట్లాడారు. రాజకీయాలను ప్రస్తావించనంటూనే కాంగ్రెస్‌పై దుమ్మెత్తిపోశారు.

కాంగ్రెస్‌ హయాంలో స్పెక్ట్రమ్, బొగ్గు, రక్షణ శాఖ తదితర వాటిలో అవినీతి జరిగిందని ఆరోపించారు. గ్రామ పంచాయతీల హక్కుల్ని, నిధుల్ని కాలరాశారన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ హయాంలో పల్లెలు వెలుగుతున్నాయని కితాబిచ్చారు. కేంద్రం నుంచి పల్లెలకు నేరుగా నిధులు విడుదలవుతున్నాయని, గతం కంటే 10 శాతం పెంచి విడుదల చేస్తున్నారని చెప్పారు. జాతీయ ప్రాజెక్టుగా ఉన్న పోలవరం నిర్మాణానికి రెండేళ్లలో రూ.6,842 కోట్లు విడుదల చేశారన్నారు. శ్రీకాకుళం–అనకాపల్లి ఆరులైన్ల రోడ్ల నిర్మాణం,ఆనందపురం–ఇచ్ఛాపురం హైవే ఆరు లైన్ల అభివృద్ధికి నిధులు కేటాయించడం అభినందనీయమన్నారు.

రోజుకు 1.50 కి.మీ నిర్మాణం
కేంద్రంలోని మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా రోజుకు 1.50 కిలోమీటర్ల జాతీయరహదారి నిర్మాణం జరుగుతుందని నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు చెప్పారు. దేశంలోని అన్ని ఓడరేవులను జాతీయ రహదారులతో అనుసంధానం చేస్తున్నారన్నారు. కేంద్ర పథకాలు గ్రామాల అభివృద్ధికి దోహదపడుతున్నాయని, దీని వల్లే పల్లెలు సస్యశ్యామలం అవుతున్నాయని అన్నారు.

మోరంపూడి ఫ్లైఓవర్‌ అదృష్టం
రాజమండ్రిలో మోరంపూడి ఫ్లైఓవర్‌ వంతెన నిర్మాణం అదృష్టమని రాజమండ్రి ఎంపీ ఎం.మురళీమోహన్‌ అన్నారు. గుండుగొలను–రాజమండ్రి జాతీయరహదారి అభివృద్ధికి నిధులు కేటాయించిన మంత్రి గడ్కరీని కృతజ్ఞతలు తెలిపారు.

కేంద్ర నిధులతో సీసీ రోడ్లు
కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ, 14, 15 ఆర్థిక సంఘ నిధులతో గ్రామాల్లోని అన్ని వీధుల్లో సిమెంట్‌ రోడ్లు నిర్మించగలిగామని ఉండి ఎమ్మెల్యే వీవీ శివరామరాజు అన్నారు. చాలా గ్రామాల్లో గతంలో రోడ్లు లేవని, ఇప్పుడు సిమెంట్‌ రోడ్లతో ప్రజలు సురక్షితంగా నడవగలుగుతున్నారన్నారు.

39 ప్రాజెక్టు రోడ్లకురిమోట్‌తో శంకుస్థాపన
రాష్ట్రంలోని 39 జాతీయ రహదారుల ప్రాజెక్టులకు సంబంధించిన పేర్లను జాతీయరహదారుల శాఖ ఈడీ అనిల్‌ దీక్షిత్‌ చదవగా మంత్రి నితిన్‌ గడ్కరీ రిమోట్‌తో ఆన్‌లైన్‌లో శంకుస్థాపనలు చేశారు. వివిధ ప్రాంతాల్లో 1,384 కిలోమీటర్ల మేర జాతీయరహదారుల అభివృద్ధికి రూ.16,878 కోట్లు వెచ్చిస్తున్నట్టు దీక్షిత్‌ వెల్లడించారు.

గడ్కరీకి ఘన సత్కారం
మంత్రి నితిన్‌ గడ్కరీని ఎంపీ గోకరాజు గంగరాజు, మంత్రి అయ్యన్నపాత్రుడు, ఎమ్మెల్యే శివరామరాజు, బీజేపీ మండల అధ్యక్షుడు నేరెళ్ల పెదబాబు ఘనంగా దుశ్శాలువాలతో సత్కరించారు. గంగరాజు గజమాలతో గడ్కరీని సత్కరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, జిల్లా అధ్యక్షుడు కోడూరి లక్ష్మీనారాయణ, పాకా సత్యనారాయణ, భూపతిరాజు శ్రీనివాసవర్మ, డీవీఎస్‌ వర్మ, కావూరి సాంబశివరావు, జెడ్పీ వైస్‌ చైర్మన్‌ మన్నే లలితాదేవి, ఎంపీపీ పిన్నమరాజు వాణి, జాతీయరహదారుల శాఖ, ఆర్‌ అండ్‌ బీ అధికారులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు