శారదా పీఠం వేడుకల్లో పాల్గొన్న సోము వీర్రాజు

30 Jan, 2020 14:11 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: దేశ సంపద, సమగ్రతతోపాటు, ప్రభుత్వాలు, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ శారదాపీఠం కార్యక్రమాలు నిర్వహించడం సంతోషకరమని బీజేపీ ఎంఎల్సీ సోము వీర్రాజు అన్నారు. గురువారం ఆయన విశాఖ శారదా పీఠం వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ దేశాలన్నీ బాగుండాలనే ఆలోచనను నిర్మించే వ్యవస్థే భారతీయత అని పేర్కొన్నారు. భారతీయ వ్యవస్థ ప్రపంచ దేశాలను ప్రభావితం చేస్తుందని తెలిపారు. దేశ ప్రజలు ఆనందంగా ఉండటానికి పీఠాలు, యజ్ఞాలు, యాగాలు దోహదపడుతాయన్నారు.

ముస్తాబైన పీఠం
విశాఖ శారదా పీఠం వార్షికోత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు యాగాల నిర్వహణకు వీలుగా విస్తృత ఏర్పాట్లు చేశారు. కాగా విశాఖ జిల్లా పెందుర్తి మండలం చినముషిడివాడలో కొలువుదీరిన పీఠం ప్రాముఖ్యం నలుదిశలా వ్యాపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహా స్వామి, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి పర్యవేక్షణలో ఐదురోజుల పాటు ఈ వేడుకలు విశిష్ట రీతిలో జరగనున్నాయి. ఉత్సవాలకు పీఠం సర్వాంగసుందరంగా ముస్తాబైంది. యావద్దేశం, ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని సర్వతోముఖాభివృద్ధి చెందాలన్న బృహత్తర సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆధ్వర్యంలో శ్రీనివాస చతుర్వేద హవనం ప్రత్యేకంగా నిలవనుంది. ఈ వేడుకలకు అనేక మంది ప్రముఖులు హాజరుకానున్నారు.

చదవండి: విశాఖ శారదా పీఠం వార్షికోత్సవాలు

మరిన్ని వార్తలు