‘రామ’సక్కని సూరీడు!

1 May, 2020 10:43 IST|Sakshi

తల్లి తన గర్భగుడిలో బిడ్డను నవమాసాలు మోస్తుంది.. ప్రాణాలకు తెగించి.. పురిటి నొప్పులతో జన్మనిస్తుంది.   పాలిచ్చి.. లాలించి పెంచి పెద్ద చేస్తుంది..   తాను పస్తులుండైనా బిడ్డ ఆకలి తీరుస్తుంది. గోరుముద్దలు తినిపిస్తుంది.. చందమామ కథలు చెప్తుంది.ఆలనా పాలన చూస్తుంది.. అడిగిందల్లా ఇస్తుంది..జోలపాట పాడి నిద్రపుచ్చుతుంది..రుణం తీర్చుకునే సమయం వస్తే..కన్న కొడుకుగా.. ఏమిచ్చి తల్లి రుణం తీర్చుకోవాలి..?అమ్మంటే..  సాటి మనిషిగా చూడకుండా.. నిండైన అమ్మతనపు కమ్మదనం ఎరిగిన బిడ్డ..జబ్బు చేసిందని జాలి చూపలేదు..కలికాలం.. కరోనా కాటు.. జనం విలవిల్లాడుతుంటే..వైద్యాలయాలే దేవాలయాలు అనుకుని..వైద్యమో రామ‘చంద్రా’ అంటూ వైద్యుడే దేవుడంటూ..తల్లిని భుజానకెత్తుకొని వడివడిగా అడుగులేస్తూ..  పేగుతెంచుకు పుట్టిన ‘రవి’ పరుగులు తీశాడు.. వైద్యదేవత చల్లని చూపు చూసింది.. మాతృమూర్తి ఇంటికి చేరింది.  (ఆకలితో అడవిలోనే..!)

అనంతపురం, కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గం మండలం దురుదకుంటకు చెందిన వృద్ధురాలు రామక్క మూడు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతోంది. తల్లి బాధను చూసి తట్టుకోలేని తనయుడు రవికుమార్‌ ద్విచక్ర వాహనంపై కళ్యాణదుర్గం తీసుకెళ్లాడు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ నిబంధనలు అమలులో ఉన్నాయి. దీంతో ద్విచక్ర వాహనానికి అనుమతిలేకపోయింది. పట్టణంలోకి ప్రవేశించే ప్రధాన రహదారి వద్ద బైక్‌ను వదిలి, తల్లిని భుజంపై ఎత్తుకొని ఎర్రటి ఎండలో ప్రైవేట్‌ ఆస్పత్రి వద్దకు వెళ్తున్న దృశ్యాన్ని స్థానికులు చూసి ఆశ్చర్యపోయారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న కరోనా దెబ్బకు ప్రైవేట్‌ ఆస్పత్రిలో వైద్యం చేయకూడదని నిబంధన ఉంది. దీంతో వైద్యం అందలేదు. ఎవరిని అడగాలో.. ఎక్కడికి వెళ్లాలో తెలియక.. చివరికి కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ స్టాఫ్‌నర్సును అడిగి తల్లికి వైద్యం చేయించుకొని స్వగ్రామానికి తిరిగి వెళ్లిపోయాడు. ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రైవేట్‌ వైద్యులు ప్రభుత్వాస్పత్రిలో సేవలందించేందుకు వచ్చి   ఉంటే వృద్ధురాలైన తల్లికి వైద్యం చేయించడానికి కుమారుడికి ఇన్ని అవస్థలు ఉండేవి కావని పలువురు అభిప్రాయపడ్డారు.

తల్లి రామక్కను మోసుకుని వైద్యం కోసం తీసుకెళ్తున్న కుమారుడు రవికుమార్‌ 

మరిన్ని వార్తలు