అమ్మకు ప్రేమతో..

1 Jun, 2020 13:26 IST|Sakshi
బ్యాటరీ బుగ్గీ వాహనం తయారీలో రామక్రిష్ణ, వాహనంలో తల్లిని ఆలయం వద్దకు తీసుకెళ్లినప్పుడు..

భలే బ్యాటరీ బుగ్గీ ఔత్సాహికుని సరికొత్త ఆవిష్కరణ

కాలుష్యరహిత వాహనం రెడీ

ఓ ఐడియా జీవితాన్నే మార్చేస్తుందో లేదోగానీ సరికొత్త ఆవిష్కరణతో శభాష్‌ అనిపించుకున్నాడా ఔత్సాహికుడు రామక్రిష్ణ. తన తల్లి గుడికి వెళ్లేందుకు ఈజీగా ప్రయాణించేలా వాహనం చేయాలని అతని సంకల్పానికి పట్టుదల తోడైంది. పనికిరాని పాత ఇనుప సామాన్లు అతని చేతిలో కొత్తరూపు  సంతరించుకున్నాయి. వీటికి మరికొన్ని విడి భాగాలు జోడించి, బ్యాటరీ బుగ్గీ (బ్యాటరీతో ఏర్పాటు చేసిన బండి) రూపొందించి భళా అనిపించాడు.

చిత్తూరు, చౌడేపల్లె : మండలంలోని కాగతి పంచాయతీ కరణంవారిపల్లెకు చెందిన రామక్రిష్ణ బీటెక్‌  చేశారు. నెల్లూరులో ఉంటున్నారు. కొంతకాలం కృష్ణపట్నం పోర్ట్‌లో పనిచేశారు. లాక్‌డౌన్‌ కావడంతో స్వగ్రామానికి వచ్చాడు. వృద్ధురాలైన తన తల్లి విజయమ్మ ప్రయాణించడానికి వీలుగా ఓ వాహనం తయారు చేయాలని పూనుకున్నాడు. ఇంటిలో నిరుపయోగంగా పడేసిన సైకిల్, మోపెడ్‌ వస్తు సామగ్రితో పాటు సాధారణంగా దొరికే ఇనుప వస్తువులను సేకరించారు.అలాగే, పుంగనూరులోని పాత ఇనుప సామాన్ల అంగడి (గుజిరీ షాపు)కి వెళ్లి దాదాపు 70కిలోల అవసరమైన వాటిని కొన్నారు. వీటినంతా శుద్ధి చేసి, వాహనానికి పనికొచ్చేలా చేశారు. పాతకాలపు జట్కా బండి తరహాలో వాహనాన్ని తయారుచేశాడు. దీనికి 750 వాట్స్‌ మోటారు, 48 ఓల్ట్‌ కెపాసిటీ గల బ్యాటరీని అమర్చారు. ముందుకెళ్లడమే కాకుండా, రివర్స్‌ ఫార్వడ్‌ ఫంక్షన్‌ను సైతం అమర్చాడు. డిజిటల్‌ స్పీడోమీటర్‌ కూడా పెట్టారు. ఆ తర్వాత దీనిని నాలుగు గంటల పాటు బ్యాటరీకి చార్జింగ్‌ చేశాడు. కూలీలంటూ ఎవరూ లేకపోవడం మూలాన దీని తయారీకి నెలన్నర సమయం పట్టింది. ఓ శుభముహూర్తాన గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలోని అభయాంజనేయస్వామి ఆలయానికి తొలిసారి ఈ వాహనంలో తన తల్లిని తీసుకెళ్లాడు. స్వామివారిని దర్శించుకున్నాడు. తనకోసం శ్రమించి దీనిని తయారు చేసినందుకు ఆ తల్లి హృదయం ఉప్పొంగింది. ప్రేమతో హత్తుకుని ఆశీర్వదించింది.

ఖర్చు రూ.20వేలే!
ఈ బ్యాటరీ బుగ్గీ తయారీకి రూ.20 వేల వరకు అయ్యింది. ముగ్గురు ప్రయాణించేలా రూపొందించా. దీని తయారీకి నా అన్న కుమారుడు తేజరామ్‌  సహకరించాడు. మోపెడ్‌ మీద పాలక్యాన్లు తీసుకెళ్లేవారు, ఊరూరా తిరిగి తినుబండారాలు అమ్మేవారు ఇలాంటివి తయారు చేసిమ్మని అడుగుతున్నారు. దీనికి అమర్చిన బ్యాటరీ చార్జింగ్‌కు సోలార్‌ సిస్టం సైతం అమర్చడానికి ట్రై చేస్తున్నా. దీనికి అదనంగా 15–20వేలు అవ్వొచ్చు.  చార్జింగ్‌ చేస్తే 40 నుంచి 55 కిలోమీటర్ల వరకు ఆ బుగ్గీ ప్రయాణిస్తుంది. వేగం కూడా 30 నుంచి 35 కిలోమీటర్ల వరకూ ఉంటోంది. దీనిపై ఆసక్తి కలిగిన వారు 9985555691 సెల్‌నంబర్‌ను సంప్రదించొచ్చు.    –రామక్రిష్ణ

మరిన్ని వార్తలు