అమ్మ భారమైంది..

21 Sep, 2018 06:34 IST|Sakshi
కొడుకుల ఆదరణకు దూరమై దుఃఖిస్తున్న పండుటాకు పార్వతి

తల్లిని ఇంటి నుంచి నెట్టేసిన తనయులు

బస్‌ స్టేషన్‌లో తలదాచుకుంటున్న వృద్ధురాలు

మానవత్వంతో స్పందించిన విద్యార్థులు, పట్టణ ఎస్సై

కామాక్షీ పీఠానికి చేరిన పండుటాకు

తూర్పుగోదావరి,అమలాపురం టౌన్‌: ముగ్గురు కొడుకులున్నా ఆ పండుటాకు పరాయి పంచన బతుకీడ్చుతోంది. ఆ కొడుకులకు కనిపెంచిన అమ్మే భారమైంది. ఆమె పేరున ఉన్న ఐదు సెంట్ల స్థలం కూడా తమకు ఇచ్చేయమని అమ్మపై కొడుకులు ఒత్తిడి తెస్తున్నారు. మాట వినని అమ్మను తమ తమ ఇంట్లో నుంచి పొమ్మన్నారు. దీంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆమెను అమలాపురం నల్లా వీధి రామాలయం వద్ద హనుమాన్‌ సిద్ధాంతి చేరదీసి కొన్నాళ్లుగా కాస్త జాగా...కడుపు నిండా తిండి పెడుతున్నారు. చివరకు కొడుకుల నుంచి ఛీదిరింపులు ఎక్కువై ఆత్మాభిమానం ఉన్న ఆ అమ్మ అమలాపురం ఆర్టీసీ బస్‌స్టేషన్‌లోనే మూడు రోజులుగా ఒంటరిగా కూర్చొని రోదిస్తోంది.

విద్యార్థులకు గమనించి..
అమలాపురానికి చెందిన ధవళేశ్వరపు పార్వతి (95 బస్‌స్టేషన్‌లో మూడు రోజులుగా కూర్చొని మధనపడుతుండగా ఆమెను స్థానిక ఎస్‌కేబీఆర్‌ కళాశాలకు చెందిన విద్యార్థులు గురువారం గమనించి విషయాన్ని ఆరాతీశారు. దీంతో తన కొడుకులు గురించి, తనకున్న కొద్దిపాటి స్థలం గురించి వారు పెడుతున్న చిత్రహింసలను వివరించింది. అసలే వృద్ధాప్యంతో బక్కచిక్కిన అవ్వ అన్నం లేక అలమటిస్తోందని గమనించి విద్యార్థులు ఆమె చేత ఆహారం తినిపించారు. ఆ పండుటాకు పరిస్థితిని విద్యార్థులు పట్టణ ఎస్సై జి.సురేంద్రకు వివరించారు. ఆయన కూడా స్పందించి అవ్వను అమలాపురంలోని కామాక్షీ పీఠా«నికి తీసుకుని వెళ్లారు. పీఠాధిపతి కామేశ మహర్షికి ఆమె దీనస్థితిని వివరించారు. పీఠాధిపతి కూడా మానవత్వంతో అవ్వను అక్కున చేర్చుకున్నారు. ఆమె కొడుకులను పిలిపించి పార్వతి న్యాయం చేసే దిశగా ఎస్సై సురేంద్ర ప్రయత్నం చేస్తున్నారు. కాగా ఆమె కొడుకు గణపతిని పోలీసులు అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్‌ ఇస్తున్నట్టు తెలిసింది.

మరిన్ని వార్తలు