ఇచ్చింది సోనియా.. తెచ్చింది కాంగ్రెస్

8 Aug, 2013 02:21 IST|Sakshi

తూప్రాన్, న్యూస్‌లైన్: తెలంగాణ ప్రాంతంలో ఉన్న సీమాంధ్రులంతా తెలంగాణవాదులేననీ, వారిని సెటిలర్స్ అనడం భావ్యం కాదని పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్ అన్నారు. బుధవారం తూప్రాన్‌లో నిర్వహించిన తెలంగాణ విజయోత్సవ ర్యాలీలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.  ఈ సందర్భంగా పట్టణంలోని సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో డీఎస్ మాట్లాడారు. తెలంగాణ తెచ్చేది...ఇచ్చేది తామేననీ ఎన్నోసార్లు చెప్పామని, ఇచ్చినమాటకు కట్టుబడే తెలంగాణ తెచ్చుకున్నామన్నారు. అందువల్లే ఆ నినాదాన్ని ఇపుడు ‘‘ఇచ్చింది సోనియాగాంధీ, తెచ్చింది కాంగ్రెస్’’గా మార్చుకోవాలన్నారు.  తెలంగాణ ఏర్పాటు క్రెడిట్ ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీదేనన్నారు. తనతో పాటు  తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలంతా తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని అధిష్టానానికి విన్నవించారని ఆయన తెలిపారు. అందువల్లే సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు సుముఖత తెలిపారన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తెలంగాణలోని విద్యార్థులు, ఉపాధ్యాయులు, కుల సంఘాలు, వివిధ వర్గాలకు చెందిన వారు దశాబ్ధాలుగా ఉద్యమాలు చేస్తూ వస్తున్నారనీ, వారిలాగే వివిధ స్థాయిలో ఉన్న కాంగ్రెస్ నాయకులు సైతం ఉద్యమాలు చేపట్టారని డీఎస్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.  
 
 అయితే సీమాంధ్రుల మనస్సు నొప్పించకుండా తెలంగాణ సాధించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వారికి రాజధాని ఏర్పాటు అయ్యేవరకు సహకరిద్దామని పిలుపునిచ్చారు. కొన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ అంశాన్ని అడ్డం పెట్టుకుని లాభపడాలని చూశాయనీ, కానీ కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రకటనతో వారి ఆటలకు చెక్ పడిందన్నారు. గజ్వేల్, పటాన్‌చెరు ఎమ్మెల్యేలు నర్సారెడ్డి, నందీశ్వర్‌గౌడ్‌లు తెలంగాణ సాధన ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారని కొనియాడారు. కార్యక్రమంలో పీఎసీఎస్ చైర్మన్ మహిపాల్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు విజయభాస్కర్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, నర్సింహ్మారెడ్డి, బాబుల్‌రెడ్డి, భాగవన్‌రెడ్డి, వీర్‌కుమార్‌గౌడ్, చక్రవర్తి, రవీందర్‌గుప్త, అలీం, పెంటాగౌడ్, నరేందర్‌రెడ్డి, కమ్మరి సత్యనారాయణ, వెంకటస్వామి, వెంకట్‌రెడ్డి, దీపక్‌రెడ్డి, రఘునాథరావు, అనంతం, మాల్లారెడ్డి, సిద్దిరాంలుగౌడ్, సామల అశోక్, ఉమార్, నాగరాజుగౌడ్, అనిల్, లక్ష్మణ్  పాల్గొన్నారు. అంతకుముందు పోతరాజుపల్లి చౌరస్తా నుంచి తూప్రాన్ వరకు సాగిన విజయోత్సవ ర్యాలీలో కాంగ్రెస్ కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు