మానవత్వమా.. నీవెక్కడ?

6 Nov, 2018 07:53 IST|Sakshi
ఇంటి గేటు వద్ద వృద్ధురాలు రమణమ్మ

కన్నతల్లిపై నిర్దయ రోడ్డుపై వదిలేసిన కుటుంబ సభ్యులు

దయ తలిచిన స్థానికులు

అర్చకులంటే.. అందరి మంచి కోరేవారని చెబుతారు. సుఖ సంతోషాలతో.. పిల్లాపాపలతో క్షేమంగా ఉండాలని కోరుకునే వారి తరఫున దేవుడికి అర్చనలు చేసే వారు కూడా వారి మంచిని కోరుతుంటారు. సర్వేజనా సుభినోభవంతు అంటూ జీవించే వారు.. వారి ఇంట్లోని వృద్ధులపై అమానుషంగా ప్రవరిస్తే.. అందరినీ కంటనీటిని తెప్పిస్తుంది. ఇలాంటి సంఘటన మండపేట పట్టణంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు బయటకు గెంటేసిన ఒక వృద్ధురాలి ఆలనాపాలనను స్థానికులు చూస్తూ.. ఆమెకు వారే కుటుంబ సభ్యులుగా మారారు.

తూర్పుగోదావరి, మండపేట: ముగ్గురు కుమారులు.. ముగ్గురు కుమార్తెలు.. అందరూ జీవితాల్లో బాగానే స్థిరపడ్డారు. కన్నతల్లిని మాత్రం నడిరోడ్డుపై వదిలేశారు. వారందరి భవిష్యత్తు కోసం అహర్నిశలు శ్రమించిన ఆ తల్లి.. జీవిత చరమాంకంలో అయినవారి ఆదరణకు నోచుకోక దుర్భర జీవితాన్ని గడుపుతోంది. పింఛన్‌ సొమ్ము అడిగిన పాపానికి నడిరోడ్డుపై ఆమెను వదిలేసిన కుటుంబ సభ్యులు.. ఆమె ఉంటున్న ఇంటికి తాళం వేసుకుని వెళ్లిపోయారు. దయనీయ పరిస్థితిలో ఉన్న ఆమె స్థానికులు చేరదీశారు. పట్టణంలోని గొల్లపుంత కాలనీలో చోటుచేసుకున్న ఈ హృదయ విదారకర సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

మండపేట గొల్లపుంత కాలనీకి చెందిన నేతి రమణమ్మ (86)కు ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమారుడు గోకవరం సమీపంలోని గుమ్మళ్లదొడ్డిలో పురోహితుడు. రెండో కుమారుడు బస్సు డ్రైవర్, మూడో కుమారుడు రాజమహేంద్రవరంలోని ఒక వినాయకుని గుడిలో పురోహితునిగా పనిచేస్తున్నారు. ముగ్గురు కుమార్తెల్లో పెద్దావిడ నర్సుగా పనిచేసి రిటైరైంది. రెండో కుమార్తె కుటుంబంతో రాజమహేంద్రవరంలోనే ఉంటోంది. చిన్న కుమార్తె కొడుకుని సాకేందుకు 20 ఏళ్లుగా ఈ వృద్ధురాలు.. చిన్న కుమార్తె కుటుంబంతో గొల్లపుంతలో ఉంటోంది. చిన్న అల్లుడు మండపేట మండలం ఇప్పనపాడులోని ఆలయంలో అర్చకునిగా పనిచేస్తున్నారు. రమణమ్మకు మండపేటలో వృద్ధాప్య పింఛన్‌ వస్తోంది. నెలనెలా పింఛన్‌ సొమ్ము కుటుంబ సభ్యులకు ఇస్తుంది. వృద్ధాప్యంతో ఆమె ఆరోగ్యం క్షీణించి ఆమె దైనందిన దినచర్యలు చేసుకోలేని దుస్థితిలో ఉంది. రెండు రోజుల క్రితం పింఛన్‌ సొమ్ములో రూ.500 ఇవ్వాలని కోరింది.

దీంతో కుమార్తె, అల్లుడు అమానుషంగా ప్రవర్తించి బయటకు గెంటేసినట్టు ఆమె వాపోయింది. గతంలో తనను కుమారులు, ఇరువురు కుమార్తెలు తమ వద్ద ఉండాలని కోరినా చిన్న కుమార్తె పిల్లలను చూసుకోలేకపోతోందని వచ్చి ఇక్కడే ఉండిపోయానని, ఇప్పుడు పట్టించుకోవడం లేదని ఆమె విలపించింది. ఆమె దుస్థితిని గమనించి కుమార్తె, అల్లుడిని నిలదీస్తే దుర్భాషలతో వాగ్వివాదానికి దిగినట్టు స్థానికులు చెబుతున్నారు. మీ ఇంటికి తీసుకువెళ్లి సేవ చేసుకొమ్మంటూ పరుష పదజాలంతో స్థానికులను దూషించారని కాలనీకి చెందిన సామాజిక కార్యకర్త పాలంగి కమల తెలిపారు. దీంతో వారు పట్టణ పోలీసులకు సమాచారం అందించి పోలీసుల సమక్షంలో గేటు తాళం పగలగొట్టి ఆమెను బయటి వరండాలో ఉంచారు. ప్రస్తుతం చుట్టుపక్కల వారు ఆమెకు ఆహారం అందించి సేవలు చేస్తున్నారు. గది తాళం లేకపోవడంతో దోమలకు రాత్రిళ్లు కంటిపై కునుకు లేకుండా ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆమె సంరక్షణ కోసం కుటుంబ సభ్యులు ముందుకు రావాలని, ఆ దిశగా మండపేట బ్రాహ్మణ సేవా సంఘం కృషిచేయాలని స్థానికులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు