కన్న తండ్రిని వదిలించుకున్నారు.!

24 Feb, 2018 19:20 IST|Sakshi
దీనస్థితిలో ఉన్న చెన్నయ్య

నడిరోడ్డుపై వదిలేసిన బిడ్డలు

అక్కున చేర్చుకున్న ‘అమ్మ ఒడి’

సాక్షి, తిరుపతి: నడక నేర్పించి, విద్యాబుద్ధులు చెప్పించి, ప్రయోజకులను చేసిన తండ్రి వారికి భారమయ్యాడు. ముదిమి వయసులో కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రిని దిక్కులేని వాడిగా నడిరోడ్డుపై వదిలేసి వెళ్లిపోయారు. నెల రోజులుగా నానా అవస్థలు పడుతున్న ఆ వృద్ధున్ని ‘అమ్మ ఒడి’ నిర్వాహకులు అక్కున చేర్చుకున్నారు. వైఎస్సార్‌ జిల్లా రాయచోటి తాలూక గాలివీడుకు చెందిన రొడ్డ చెన్నయ్య(70)కి ఐదుగురు పిల్లలు. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే భార్య అంజనమ్మ చనిపోవడంతో వారిని పోషించి, పెళ్లిళ్లు చేశాడు. 10 ఎకరాల పొలం ఉన్నా వచ్చే ఆదాయం బిడ్డలే తీసుకుంటూ వచ్చారు. 

వయస్సు మీదపడి నడవలేని స్థితిలో ఇంటికే పరిమితమైన చెన్నయ్యను కోడళ్లు నిర్లక్ష్యం చేశారు. ఆయన ఉంటే తాము కాపురాలు చేయలేమని తెగేసి చెప్పడంతో భార్యల మాటకు విలువనిచ్చిన కుమారులు నెల రోజుల క్రింద అర్ధరాత్రి వేళ తండ్రిని ఒక వాహనంలో తీసుకొచ్చి స్థానిక మల్లికార్జున సర్కిల్‌ సమీపంలోని వారపుసంత గోడకింద వదిలేసి వెళ్లిపోయారు. నడవలేని స్థితిలో ఉన్న ఆ వృద్ధుడు స్థానికులు పెట్టే మెతుకులతో ప్రాణాలు నిలబెట్టుకుంటూ వచ్చాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న అమ్మ ఒడి ఆశ్రమ నిర్వాహకులు ఆయన్ను అక్కున చేర్చుకున్నాడు.

మరిన్ని వార్తలు