త్వరలో ఈ-రేషన్

11 Jan, 2014 02:25 IST|Sakshi

 కలెక్టరేట్, న్యూస్‌లైన్ :  ప్రజా పంపిణీ వ్యవస్థ(పీడీఎస్)లో అక్రమాలకు చెక్ పెట్టేందుకు పౌరసరఫరాల శాఖ కసరత్తు చేస్తోంది. జిల్లాలో మార్పులు తీసుకొచ్చేందుకు ఆధార్ ఆధారిత ప్రజా పంపిణీ వ్యవస్థకు శ్రీకారం చుట్టనుంది. ఇందుకు జిల్లాలోని రేషన్ కార్డులకు ఆధార్ నంబర్లను అనుసంధానం చేసే ప్రక్రియ నాలుగు నెలల నుంచి జరుగుతోంది. జిల్లాలో 80 శాతం అనుసంధానం పూర్తయితే ఈ-రేషన్ విధానాన్ని అమలు చేయాలని ఇటీవల వీడియో కాన్ఫరెన్స్‌లో పౌర సరఫరాల శాఖ కమిషనర్ సునీల్‌శర్మ జిల్లా అధికారులను ఆదేశించారు.

 ప్రస్తుతం తెల్లరేషన్ కార్డుల అనుసంధానం 75 శాతం పూర్తయింది. ఈ విధానం అమలైతే బోగస్ రేషన్ కార్డులకు అడ్డుకట్ట వేయడంతోపాటు రూ.కోట్ల నిత్యావసర సరుకులు పక్కదారి పట్టకుండా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. సరుకుల సరఫరాకు ఈ-పాస్ యంత్రాలు తప్పని సరి. ప్రతి రేషన్ దుకాణాల్లో ఈ-పాస్ యంత్రాలు అమరుస్తారు. నెట్ సౌకర్యం కల్పిస్తారు. నెట్‌వర్క్ సహాయంతో ఈ యంత్రం పని చేస్తోంది.

కీ రిజిష్టర్‌ను తాజా సమాచారంతో క్రోడీకరించి సరుకులు సరఫరా చేస్తారు. ఈ-పాస్ యంత్రంపై కార్డుదారు చేతివేళ్లను పెడితే అతని కుటుంబ సభ్యుల వివరాలు తెలుస్తాయి. కార్డులో ఉన్న సభ్యులు ఎవరైనా సరుకులు తీసుకో చ్చు. ఈ విధానం అమలైతే నేరుగా నిత్యావసరాల కేటాయింపులు ఆ శాఖ కమిషనరేట్ నుంచి జారీ అవుతాయని అధికారులు పేర్కొంటున్నారు.

 4,75,572 కార్డులు అనుసంధానం
 జిల్లాలో 1,617 చౌక ధరల దుకాణాలు ఉన్నాయి. వీటి పరిధిలో 7,12,673 రేషన్ కార్డులు ఉన్నాయి. వీటిలో 6,34,096  తెలుపు రేషన్ కార్డులు, అంత్యోదయ, అన్నపూర్ణ కార్డులు 38,892, మూడో విడత రచ్చబండలో పంపిణీ చేసిన 39,685 కార్డులు ఉన్నాయి. తెలుపు రేషన్‌కార్డులలో ఇప్పటివరకు 4,75,572 కార్డులను ఆధార్‌తో అనుసంధానం చేశారు. ఇంకా 1,58,524 తెలుపు కార్డులు, అంత్యోదయ, అన్నపూర్ణ, మూడో విడత రచ్చబండ కార్డులను అనుసంధానం చేయాల్సి ఉంది. ఇప్పటికీ అనుసంధానం చేసినవాటిలో 40,510 రేషన్ కార్డులు బోగస్‌గా ఉన్నాయని గుర్తించారు.

 వీటికి ప్ర స్తుతం రేషన్ పంపిణీ కావడం లేదని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి కార్డులకు ప్రతి నెలా కోటా కింద 10 వేల మెట్రిక్ టన్నుల బియ్యం, 350 క్వింటాళ్ల చక్కెర పంపిణీ అవుతోంది. దీంతోపాటు అమ్మహస్తం కింద తొమ్మిది సరుకులు కూడా పంపిణీ చేస్తున్నారు. రేషన్ కార్డులు ఆధార్‌తో అనుసంధానం అయితే ఈ-రేషన్ అమలుకానుంది.
 అక్రమాలకు అడ్డుకట్ట
 
 జిల్లాలోని ప్రజా పంపిణీ వ్యవస్థలో అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం భావిస్తోంది. ఇంతక ముందు గోదాముల నుంచి నేరుగా రేషన్ సరుకులు ఎంఎల్‌ఎస్ కేంద్రాలకు చేరేవి. అక్కడి నుంచి డీలర్లుకు వచ్చేవి. ఈ విధానంలో బియ్యం, చక్కెర, నూనె, తదితర సరుకులు బ్లాక్ మార్కెట్‌కు తరలేవి. అధికారులు కూడా చాలాసార్లు బియ్యాన్ని పట్టుకున్నారు. ఈ విధానంతో ప్రభుత్వానికి రూ.కోట్ల నష్టం వాటిల్లేది. దీనికితోడు ప్రజలకు కూడా సరుకులు చేరేవి కావు.  తాజాగా తీసుకున్న నిర్ణయంతో వాస్తవ కార్డుదారుడికి నిత్యావసరాలు ఇక నుంచి పూర్తిస్థాయిలో అందే విధంగా ఈ విధానం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
 

>
మరిన్ని వార్తలు