త్వరలో బస్సు చార్జీల బాదుడు!

12 Sep, 2014 02:11 IST|Sakshi
త్వరలో బస్సు చార్జీల బాదుడు!

బాబు సర్కారు యోచన

 ► 15 శాతానికి తక్కువ కాకుండా  పెంపునకు ఆర్టీసీ ప్రతిపాదనలు
 ► పెరగనున్న ఆర్డినరీ, సూపర్ లగ్జరీ,   గరుడ చార్జీలు!
 ► సీఎం ఆమోదమే తరువారుు
 ► రూ. 556 కోట్లకు పైగా జనంపై భారం


హైదరాబాద్: ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ‘బస్సు చార్జీలను పెంచి ఏడాది కావొస్తోంది. ఈ ఏడాదిలో డీజిల్ ధర ఏడెనిమిది సార్లు పెరిగింది. బస్సు చార్జీలను పెంచక తప్పని పరిస్థితి ఉంది. త్వరలోనే సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం’ అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శిద్దా రాఘవరావు చెప్పిన నేపథ్యంలో అక్టోబర్ నుంచి చార్జీల పెంపు తప్పదని తెలుస్తోంది. 15 శాతానికి పైగా బస్సు టికెట్ ధరలు పెంచాల్సిందిగా ఆర్టీసీ యూజమాన్యం ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదన సమర్పించింది. ప్రయాణికులు డబ్బు లెక్క చేయడం లేదని, వారికి మెరుగైన సేవలందిస్తే ఆర్థిక భారాన్ని పట్టించుకోరని మంత్రి విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించడాన్ని బట్టి చూస్తే.. చార్జీల పెంపు ఖాయమని, ప్రభుత్వం ఇప్పటికే ఈ మేరకు నిర్ణయూనికి వచ్చిందనే విషయం స్పష్టమవుతోంది. ఈ మేరకు ఫైలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వద్దకు చేరింది. గురువారం సచివాలయంలో ఆర్టీసీ, రవాణా అధికారులతో సమావేశమైన మంత్రి ఈ అంశంపైనే సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. డీజిల్ ధర ప్రతి నెలా లీటరుకు 50 పైసల చొప్పున పెరుగుతుండటంతో సంస్థ ఏటా రూ.400 కోట్లకు పైగా భారం భరించాల్సి వస్తోందని ఆర్టీసీ ఉన్నతాధికారులు పేర్కొన్నట్లు తెలిసింది. ఎంప్లాయిస్ యూనియన్ నేతలతో బుధవారం చర్చలు, అంతర్గత సమావేశం సందర్భంగా చార్జీల పెంపును ప్రస్తావించిన యాజమాన్యం.. చార్జీల పెంపు తప్పదనే సంకేతాలు ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ చార్జీలు 10 శాతానికి పైగా, సూపర్‌లగ్జరీ 15 శాతం, ఇంద్ర, గరుడ, గరుడ ప్లస్ చార్జీలు 15 శాతానికి పైగా పెంచేందుకు ఆర్టీసీ సమాయత్తమవుతున్నట్టు అధికారవర్గాల సమాచారం. 15 శాతం వరకు చార్జీల పెంపుతో ప్రయాణికులపై పెనుభారమే పడనుంది.

రూ.556 కోట్లకు పైగా భారం!

గతేడాది నవంబర్‌లో కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆర్టీసీ చార్జీలు 9.5 శాతం వరకు పెంచారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలపై రూ.600 కోట్ల భారం పడింది. విభజన తర్వాత ఏపీ ప్రభుత్వం పెంచనున్న బస్సు చార్జీలతో రూ.556 కోట్లకు పైగా భారం పడుతుందని అంచనా. ఆర్టీసీ బస్సు చార్జీలు పెరిగితే రాష్ట్రంలోని ప్రైవేటు బస్సు ఆపరేటర్లకూ కాసుల వర్షమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రైవేటు బస్సుల నిర్వాహకులు వారాంతాల్లో రెట్టింపు చార్జీలు వసూలు చేస్తున్నారు. ఆర్టీసీ చార్జీలు పెరిగితే ఆ సాకుతో ప్రయాణికులను మరింత దోచుకుంటారనే ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రైవేటు బస్సు ఆపరేటర్లంతా టీడీపీకి చెందినవారే కావడంతో వారు పండుగల వేళ, రద్దీ సమయాల్లో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని విలేకరులు రవాణా మంత్రి దృష్టికి తెచ్చారు. వారితో ఏకీభవించిన మంత్రి అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.  

డీజిల్ బదులు బయోడీజిల్: మంత్రి శిద్దా

ఆర్టీసీ బస్సుల్లో డీజిల్  బదులు బయో డీజిల్ వాడాలని నిర్ణరుుంచినట్లు రవాణా మంత్రి శిద్దా రాఘవరావు తెలిపారు. బయో డీజిల్ సరఫరాను కాంట్రాక్టుకు అప్పగించనున్నామని, ఈ మేరకు రెండ్రోజుల్లో టెండర్లు పిలవనున్నట్లు చెప్పారు. గురువారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బస్‌స్టేషన్లలో విద్యుత్ పొదుపునకు సోలార్ యూనిట్లు ఏర్పాటు చేయూలని, ఆర్టీసీ స్థలాలు బీవోటీ (నిర్మాణం, నిర్వహణ, బదిలీ) పద్ధతిలో లీజుకు అప్పగించడం వంటి కీలక నిర్ణయూలు తీసుకున్నామన్నారు. పోలాండ్, ఆస్ట్రేలియాలో ఆర్టీసీ బస్‌స్టేషన్లను అధ్యయనం చేసి, ఆ మాదిరిగా విజయవాడ, వైజాగ్, గుంటూరులలోని ఆర్టీసీ బస్టాండ్‌లలో షాపింగ్ మాల్స్, ఐమ్యాక్స్ థియేటర్లు లాంటి నిర్మాణాలు బీవోటీ పద్ధతిలో నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించాల్సి ఉందని మంత్రి చెప్పారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై గతంలో ఏ ప్రభుత్వమూ ఈ విధంగా డీల్ చేయలేదన్నారు. సమావేశంలో పాల్గొన్న ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె.పద్మాకర్ మాట్లాడుతూ.. తమ సమస్యలు పూర్తిగా పరిష్కారం కాకపోయినా మూడు నెలల కిందటే ఏర్పాటైన ప్రభుత్వానికి ఓ అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో సమ్మె విషయంలో గౌరవప్రదమైన ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు.
 
 

మరిన్ని వార్తలు