త్వరలో సీఎం జగన్‌ పల్లె బాట

12 Jun, 2020 05:19 IST|Sakshi

అర్హత ఉన్న వారికి పథకాలు రాకపోతే అధికారులదే బాధ్యత

గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థపై సమీక్షలో సీఎం

పథకాలు అందలేదనే ఫిర్యాదులు అర్హుల నుంచి రాకూడదు

అవినీతి, వివక్ష లేకుండా గడువులోగా పథకాలు అందేలా చూడాలి

మనకు ఓటేయకపోయినా అర్హతఉన్న వారందరికీ పథకాలు అందాల్సిందే

నిర్దిష్ట కారణం లేకుండా ఎవరి దరఖాస్తునూ తిరస్కరించరాదు

వైద్య శాఖలో, గ్రామ, వార్డు సచివాలయాల్లో పోస్టుల భర్తీకి ఒకేసారి షెడ్యూల్‌ ఇవ్వాలి

సాక్షి, అమరావతి: త్వరలోనే గ్రామాల్లో పర్యటిస్తానని సీఎం వైఎస్‌ జగన్ వెల్లడించారు. కరోనా కుదుట పడిన అనంతరం ఈ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఆ సందర్భంగా తమకు పథకాలు అందలేదని అర్హత కలిగిన ఏ ఒక్కరి నుంచి ఫిర్యాదులు రాకూడదని, చేయి ఎత్తకూడదని అధికారులకు స్పష్టం చేశారు. అర్హత ఉన్న వారికి పథకాలు రాకపోతే సంబంధిత అధికారులను బాధ్యులను చేస్తామన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ, సేవలు, మౌలిక సదుపాయాలపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మనకు ఓటేయకపోయినా.. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ అవినీతి, వివక్ష లేకుండా పారదర్శకంగా పథకాలు అందేలా చూడాలన్నదే ప్రభుత్వ సిద్ధాంతమని స్పష్టం చేశారు. వైద్య శాఖలో, గ్రామ, వార్డు సచివాలయాల్లో పోస్టుల భర్తీకి ఒకేసారి షెడ్యూల్‌ ఇవ్వాలని ఆదేశించారు. ఈ సందర్భంగా అధికారులు వెల్లడించిన అంశాలు, సీఎం ఆదేశాలు, సూచనలు ఇలా ఉన్నాయి.

గడువులోగా పథకాలు అందించాల్సిందే
► నిర్దిష్ట గడువులోగా వివిధ పథకాలు లబ్ధిదారులకు అందాలి. అర్హత గల ఎవరి దరఖాస్తులను కూడా  ఎటువంటి సరైన కారణం లేకుండా తిరస్కరించరాదు. అర్హత ఉన్న వారికి పథకాలు రాకపోతే.. అధికారులను బాధ్యులను చేస్తాం. 
► పెన్షన్, ఇళ్ల పట్టాలు, ఆరోగ్య శ్రీకార్డు, రేషన్‌ కార్డులు తప్పనిసరిగా అర్హులకు అందాలి. మొదట వీటిపై దృష్టి పెట్టాలి. లబ్ధిదారుల జాబితా, గుర్తు పెట్టుకోవాల్సిన ముఖ్యమైన నంబర్ల జాబితాలను సచివాలయాల వద్ద ప్రదర్శించాలి. 
► ప్రకటించిన విధంగా నిర్ణీత కాలంలో అందే సేవల జాబితాలను, ఈ ఏడాదిలో అమలు చేయనున్న పథకాల క్యాలెండర్‌ను అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించాలి. 
► మార్చి 2021 నాటికి గ్రామ, వార్డు సచివాలయాల సొంత భవనాల నిర్మాణం పూర్తి కావాలి. 
► వైద్య శాఖలో పోస్టులు, గ్రామ, వార్డు సచివాలయాల్లో పోస్టులు అన్నీ కలిపి వాటి భర్తీకి ఒకేసారి షెడ్యూల్‌ ఇవ్వాలి.

ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి చర్యలు
► సేవల జాబితా, క్యాలెండర్‌ను ప్రదర్శించారా.. లేదా.. అన్నదానిపై ఈ నెల 20లోగా జియో ట్యాగింగ్, వెరిఫికేషన్‌ పూర్తవుతుందని అధికారులు వెల్లడించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 17,097 పోస్టుల భర్తీకి అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జూలైæ నెలాఖరులో పరీక్షలు నిర్వహించడానికి సన్నద్ధమవుతున్నామన్నారు. 
► గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల శిక్షణకు సంబంధించి అధికారులు వివరించారు. ఈ సందర్భంగా వలంటీర్లకు శిక్షణపై సీఎం ఆరా తీశారు. వలంటీర్లకు సెల్‌ఫోన్లు ఇచ్చినందున, డిజిటిల్‌ పద్ధతుల్లో వారికి శిక్షణ ఇచ్చే విషయంఆలోచించాలని సూచించారు. అవగాహన చేసుకున్నారా? లేదా? అనే విషయంపై వలంటీర్లకు ప్రశ్నావళి పంపాలని సీఎం ఆదేశించారు. 
► ఏదైనా ఒక పథకానికి దరఖాస్తు చేసినప్పటి నుంచి  అక్‌నాలెడ్జ్‌మెంట్‌ కోసం ఇచ్చిన నంబరు ఆధారంగా దరఖాస్తుదారుడు తన దరఖాస్తు ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చని చెప్పారు.

గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో సాంకేతికత వినియోగించడమే కాకుండా, వచ్చే సమాచారాన్ని విశ్లేషించి, సమీక్షించి ఆ మేరకు పర్యవేక్షించడం చాలా ముఖ్యం. అలసత్వం లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం వ్యవస్థలో జవాబు దారీతనం (అకౌంటబిలిటీ), బాధ్యత (రెస్పాన్సిబిలిటీ) ప్రధానం. ఇది పెరిగేలా చూడాలి.

మరిన్ని వార్తలు