సోలార్ లాంతర్లు త్వరలో పంపిణీ

20 Oct, 2014 04:31 IST|Sakshi
సోలార్ లాంతర్లు త్వరలో పంపిణీ
  • మొదటి విడతగా 4 వేలు
  •  10 వేల ఇళ్లల్లో కాంతులు
  •  నెడ్‌క్యాప్ ద్వారా అందజేత
  • విశాఖపట్నం సిటీ : తుపానుకు నష్టపోయిన గిరిజనులకు సోలార్ లాంతర్లు రెండు మూడు రోజుల్లో పంపిణీకి విశాఖ నెడ్‌క్యాప్ ప్రయత్నిస్తోంది. రూ. 1.7 కోట్ల వ్యయం తో దాదాపు 10 వేల ఇళ్ల ల్లో సోలార్ విద్యుత్ కాంతులను అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ముందుగా 4 వేల లాంతర్లను పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారికి అందించాలని నిర్ణయించారు. అంతకన్నా ముందుగా ఆయా లాంతర్లకు ఛార్జింగ్ పెట్టుకునేందుకు అవసరమైన ప్యానెల్స్ ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. పాడేరు గిరిజన ఆశ్రమ పాఠశాలలో 0.5 కిలోవాట్ ప్యానెల్స్ 20, విశాఖ దరి ఎండాడ అంధుల పాఠశాల, డాక్టర్ రెడ్నం సూర్యప్రసాదరావు ప్రభుత్వ ప్రాంతీయ నేత్ర వైద్యశాలల్లో ఒక్కో కిలో వాట్ ప్యానెల్స్ ద్వారా అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
     
    మునగపాక మండలం తోటాడ గ్రామంలోని షెడ్యూల్డ్ కులాల బాలికల వసతి గృహంలో విద్యుత్ లేని కారణంగా 6 సోలార్ లాంతర్లు అందిస్తున్నారు. చింతపల్లి, డుంబ్రిగుడ, జీకే వీధి వంటి ప్రాంతాల్లో ఆయా మండల రెవెన్యూ అధికారులు, ఎండీవోల ద్వారా వీటిని గిరిజనులకు అందించాలని పేర్కొన్నారు. ఒక్కో లాంతర్ ఖరీదు కేంద్ర ప్రభుత్వ ధర మేరకు దాదాపు రూ. 1700గా వుంటుంది. ప్రభుత్వం ప్రకటించినట్టుగా 10 వేల లాంతర్లను తయారీ సంస్థల నుంచి ఆర్డర్‌పై కొనుగోలుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.

    ఇప్పటికే సిద్ధంగా ఉన్న 4 వేల లాంతర్లను మొదటి విడతగా పంపిణీకి సమాయత్తమవుతున్నారు. అన్నింటినీ ఒకే సారి పంపిణీ చేయనందున ఉన్న వాటిని పంపిణీ చేస్తే వచ్చే వాటిని తర్వాత వినియోగదారులకు అందించవచ్చని నెడ్ క్యాప్ మేనేజింగ్ డెరైక్టర్ ఎం. కమలాకర్ బాబు చెప్పారు. లాంతర్ల పంపిణీ ఎలా చేయాలనే దానిపై నెడ్‌క్యాప్ జిల్లా అధికారి పి.వి. రామరాజు, ఇతర అధికారులతో ఆయన ఆదివారం సమీక్ష నిర్వహించారు. గిరిజనులకు సోలార్ లాంతర్లు అందే వరకూ ప్రణాళికయుతంగా వ్యవహరించాలని సిబ్బందికి సూచించారు.
     

మరిన్ని వార్తలు