రాష్ట్రంలో చురుగ్గా నైరుతి

9 Jun, 2020 03:43 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి: రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు మరింత చురుగ్గా కదులుతున్నాయి. రాగల 48 గంటల్లో కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాలు, రాయలసీమలోని ఇతర జిల్లాలకు, మధ్య బంగాళాఖాతం, ఉత్తర బంగాళాఖాతంలో మరికొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించనున్నాయి. 76 గంటల్లో తెలంగాణలోని కొన్ని ప్రాంతాలకు, కోస్తాలోని ఇతర ప్రాంతాలకు, సిక్కిం, ఒడిశా, పశ్చిమబెంగాల్‌ మొదలైన ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. 

► తూర్పు మధ్య బంగాళాఖాతంలో రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడనుంది.
► నేటి నుంచి మూడ్రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురుస్తాయి. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. 
► రాగల 4 రోజుల పాటు ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో ఆయా జిల్లాల యంత్రాంగాన్ని ప్రభుత్వం అప్రమత్తం చేసింది.
► తూర్పు మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో ట్రోపోస్పియర్‌ వరకు విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం వల్ల  వచ్చే 12 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని, 24 గంటల్లో బలపడే అవకాశం ఉందని ఐఎండీ అమరావతి శాఖ తెలిపింది. 
► నాలుగు రోజులు ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయనే హెచ్చరికల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ కమిషనర్‌ కన్నబాబు సూచించారు. పిడుగుల పడే ప్రమాదం  ఉన్నందున రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపరులు చెట్ల కిందకు, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు