రెండు రోజుల్లో రానున్న నైరుతి

7 Jun, 2020 03:23 IST|Sakshi

రాష్ట్రంలో విస్తరించనున్న రుతుపవనాలు

సాక్షి, విశాఖపట్నం: చల్లని కబురు మరో రెండు రోజుల్లో రాష్ట్రాన్ని పలకరించనుంది. చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాలు 2, 3 రోజుల్లో తమిళనాడులోని మొత్తం ప్రాంతాలకు విస్తరించి.. కోస్తా, రాయలసీమల్లోని కొన్ని ప్రాంతాలకు రానున్నాయి. అదేవిధంగా.. నైరుతి బంగాళాఖాతంలోని మొత్తం ప్రాంతాలు, ఈశాన్య భారత దేశంలోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించనున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు తూర్పు విదర్భ, దాని పరిసర ప్రాంతాల్లో, అలాగే తూర్పు మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకొని ఉన్న అండమాన్‌ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీంతో 8వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.

– నైరుతి రుతుపవనాల ప్రభావంతో  కోస్తా, రాయలసీమల్లో రానున్న 3 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. 9, 10 తేదీల్లో ఉత్తర కోస్తా, యానాం ప్రాంతాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయి.
–    గడిచిన 24 గంటల్లో విజయనగరం, విశాఖపట్నం, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురిశాయి.

>
మరిన్ని వార్తలు