రైతుల్లో ‘నైరుతీ’ ఆశల మోసులు..!

27 Jun, 2020 04:23 IST|Sakshi

ఏడు జిల్లాల్లో అధిక వర్షపాతం

అయిదు జిల్లాల్లో సాధారణ వర్షాలు

ఒక్క జిల్లాలో లోటు వర్షపాతం

సాక్షి, అమరావతి: నైరుతీ రుతుపవనాలు రైతుల్లో ఆశల మోసులు రేకెత్తిస్తున్నాయి. వాతావరణ శాఖ ముందస్తు అంచనాల కంటే అధిక వర్షాలు కురుస్తుండటంతో రైతులు ఆనందంగా పంటల సాగులో నిమగ్నమయ్యారు. ఈ నెల ఒకటో తేదీతో ఆరంభమైన ఖరీఫ్‌ (నైరుతీ) సీజన్‌లో ఇప్పటి (జూన్‌ 26వ తేదీ) వరకూ చూస్తే ఏడు జిల్లాల్లో సాధారణం కంటే 20 నుంచి 59 శాతం అధిక వర్షపాతం, అయిదు జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. 

► ఒక్క చిత్తూరు జిల్లాదీ మాత్రమే 21 శాతం కంటే తక్కువ వర్షపాతంతో లోటు జాబితాలో ఉంది. (30 ఏళ్ల సగటు వర్షపాతంతో పోల్చితే..)
► జిల్లాల వారీగా చూస్తే నెల్లూరులో 58శాతం, గుంటూరు– 43, కర్నూలు–38, విజయనగరం–31, కృష్ణా–30, అనంతపురం– 23,  ప్రకాశం–21 శాతం అధిక వర్షపాతం నమోదైంది.
► వైఎస్సార్‌ కడప, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో సాధారణ వర్షాలు కురిశాయి.

మరిన్ని వార్తలు