నైరుతి వచ్చేసింది

2 Jun, 2020 03:59 IST|Sakshi
సోమవారం సాయంత్రం విజయవాడ నగరాన్ని కమ్మేసిన మబ్బులు

కేరళను తాకిన రుతు పవనాలు

సాక్షి, అమరావతి/విశాఖపట్నం/నెట్‌వర్క్‌: నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించాయి. రుతు పవనాల ఆగమనానికి సూచికగా సోమవారం ఆ రాష్ట్రంలో చల్లని ఈదురుగాలులతో కూడిన వర్షాలు విస్తారంగా కురిశాయి. తమిళనాడు, పుదుచ్చేరిలోని కొన్ని ప్రాంతాలకు కూడా నైరుతి రుతు పవనాలు విస్తరించాయని భారత వాతావరణ విభాగం సోమవారం ధ్రువీకరించింది. దక్షిణ అరేబియా సముద్రం, లక్షదీవులను ఈ రుతు పవనాలు పూర్తిగా కమ్ముకున్నాయి. మాల్దీవుల్లోని మిగిలిన ప్రాంతాలు, కేరళ, మహేలోని చాలా ప్రాంతాలు,  తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్‌లోని కొన్ని ప్రాంతాలు, కోమెరిన్, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. కాగా, నైరుతి రుతుపవనాల సీజన్‌లో కురిసే వర్షాలవల్లే దేశంలో 50 శాతంపైగా పంటలు సాగవుతాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు అత్యధిక ప్రాంతాల్లో పంటల సాగుకు నైరుతి రుతుపవనాలే కీలకం. 

నేడు, రేపు వర్షాలు
ఇక ఆగ్నేయ అరేబియా సముద్రం, దాన్ని ఆనుకొని ఉన్న తూర్పు మధ్య అరేబియా సముద్రం, లక్షదీవుల్లో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో.. దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, నైరుతి, ఆగ్నేయ రాయలసీమ, తెలంగాణ మీదుగా కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో మంగళ, బుధవారాల్లో దక్షిణ, ఉత్తర కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. కాగా, గడిచిన 24 గంటల్లో భీమిలిలో 3 సెం.మీ, సాలూరు, వెంకటగిరి కోటలో 2 సెం.మీ వర్షపాతం నమోదైంది.

పిడుగులు పడి నలుగురు మృతి
ఇదిలా ఉంటే.. విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలం ఎస్సీ మరువాడ గ్రామంలో సోమవారం సాయంత్రం పిడుగుపాటుకు ముగ్గురు మృతిచెందారు. ఉరుములతో కూడిన వర్షం కురవడంతో పొలంలోని పాకలో తలదాచుకున్న సమయంలో పిడుగుపడి వీరు బలయ్యారు. వీరితో పాటు ఉన్న మరో ముగ్గురు స్పృహ తప్పి పడిపోవడంతో ఆస్పత్రికి తరలించారు. అలాగే, గుంటూరు జిల్లాలో కూడా పిడుగుపడి ఓ రైతు మరణించాడు. అమరావతి మండలం అత్తలూరులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇదే జిల్లా ఈపూరు మండలంలో దాదాపు రెండు కేజీల బరువు ఉండే వడగళ్లు పడ్డాయి. 

ఈ ఏడాది 102శాతం వర్షపాతం
ఈ సీజన్‌ (జూన్‌–సెప్టెంబర్‌)లో దేశవ్యాప్తంగా సాధారణ వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసినట్లు ఐఎండీ సోమవారం ఢిల్లీలోనూ, అమరావతిలోనూ ప్రకటించింది. ఈ మేరకు అమరావతి ఐఎండీ డైరెక్టర్‌ స్టెల్లా మీడియా సమావేశంలో వివరించారు. ప్రాంతాల వారీగా, నెలల వారీగా కూడా దీర్ఘకాలిక వర్షపాత అంచనాలను ఐఎండీ అధికారులు వెల్లడించారు. దేశవ్యాప్తంగా జూలైలో 103 శాతం, ఆగస్టులో 97 శాతం వర్షపాతం నమోదవుతుంది. ఈ అంచనాలో తొమ్మిది శాతం అటూ ఇటుగా తేడా ఉండవచ్చని తెలిపారు. అలాగే.. దక్షిణాది రాష్ట్రాల్లో 102 శాతం సాధారణ వర్షపాతం నమోదవుతుందని వెల్లడించారు. కాగా, ఈ నెల రెండో వారంలో నైరుతి రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశించే అవకాశం ఉంది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా